CM Revanth Reddy: రేవంత్ ఆస్తి రూ.30 కోట్లు!
ABN , Publish Date - Dec 31 , 2024 | 05:09 AM
దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఏడో స్థానంలో నిలిచారు. ఆయనకు రూ.30.04 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

సంపన్న సీఎంలలో ఏడో స్థానం..
రూ.931 కోట్లతో అగ్రస్థానంలో బాబు
నిరుపేద ముఖ్యమంత్రి మమత
కేసుల్లో తొలి మూడు స్థానాల్లో రేవంత్, స్టాలిన్, చంద్రబాబు
ఏడీఆర్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబరు 30: దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఏడో స్థానంలో నిలిచారు. ఆయనకు రూ.30.04 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు రూ.931 కోట్ల (కుటుంబ ఆస్తి)తో ఆగ్రస్థానంలో నిలిచినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సోమవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. బాబుకు రూ.10 కోట్ల అప్పు ఉన్నట్లు తెలిపింది. ఇక, దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిచారు. ఆమె వద్ద కేవలం రూ.15 లక్షల ఆస్తే ఉందని ఏడీఆర్ పేర్కొంది. రూ.332 కోట్ల సంపదతో అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమాఖండు ధనిక ముఖ్యమంత్రిగా రెండోస్థానంలో ఉన్నారు.
అయితే, ఈయనకు రూ.180 కోట్ల మేరకు అప్పులు ఉన్నాయి. రూ.51 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య మూడోస్థానంలో నిలిచారు. ఈయన రూ.23 కోట్ల అప్పులు చేశారు. కేసుల్లో రేవంత్‌రెడ్డి అగ్రస్థానంలో ఉన్నారు. ఆయనపై 72 ఐపీసీ కేసులు, 89 సాధారణ కేసులు ఉన్నాయి. తర్వాతి స్థానాలో తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు. ఇక కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సగటు సంపద రూ.52.59 కోట్లుగా ఉందని నివేదిక వివరించింది. అంతేకాదు, ముఖ్యమంత్రుల సగటు వ్యక్తిగత ఆదాయం రూ.13,64,310గా ఉందని పేర్కొంది. ఇది.. 2023-24 లెక్కల ప్రకారం తలసరి నికర జాతీయ ఆదాయం(ఎన్‌ఎన్‌ఐ) రూ.1,85,854 కంటే 7.3 రెట్లు ఎక్కువగా ఉందని వివరించింది.