Share News

Chapata Mirchi: చపాట.. వారసత్వ సత్తా

ABN , Publish Date - Dec 12 , 2024 | 03:58 AM

పెద్దగా కారం లేకుండా కొంచెం తీపి.. సాధారణం కంటే మరింత ఎరుపు.. కొంచెం లావు.. పచ్చళ్లు పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ.. విత్తనంలోనూ నాణ్యత..! ఇదీ చపాటా మిర్చి ప్రత్యేకత. ముడతలతో కనిపించే ఈ పంట ఐదు దశాబ్దాలుగా వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో సాగవుతోంది.

Chapata Mirchi: చపాట.. వారసత్వ సత్తా

ఐదు దశాబ్దాల కిందటి నుంచే వరంగల్‌ మిర్చిగా సాగు.. నకిలీ బెడద లేకుండా రైతుల నుంచే మూల విత్తనాలు

  • రంగు, రుచిలో విశేష పేరు ప్రఖ్యాతులు

  • జాతీయ, అంతర్జాతీయస్థాయి మార్కెటింగ్‌

  • ‘జీఐ’తో విదేశాల్లో మరింతగా డిమాండ్‌!

  • వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మంలో 25 వేలపైగా ఎకరాల్లో సాగు

వరంగల్‌, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పెద్దగా కారం లేకుండా కొంచెం తీపి.. సాధారణం కంటే మరింత ఎరుపు.. కొంచెం లావు.. పచ్చళ్లు పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ.. విత్తనంలోనూ నాణ్యత..! ఇదీ చపాటా మిర్చి ప్రత్యేకత. ముడతలతో కనిపించే ఈ పంట ఐదు దశాబ్దాలుగా వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో సాగవుతోంది. ఆహారంలో రంగుల వినియోగంపై నిషేధం ఉన్న దేశాల్లో.. ప్రత్యామ్నాయంగా చపాటా మిర్చిలోని ఓల్యూరోసిన్‌ అనే ఎర్ర రంగు ద్రావణాన్ని తీసి వాడుతుంటారు. దీంతో విదేశాల్లో చపాటాకు డిమాండ్‌ పెరిగింది. మూల విత్తనాలను రైతులే తయారు చేసుకుంటుండడంతో నకిలీ బెడద ఉండదు. అయితే, తెగుళ్లు, నల్లతామర, వైరస్‌ దాడి తీవ్రతతో కొన్నేళ్లుగా ఆశించిన దిగుబడి రావడం లేదు. రైతులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చపాటా మిర్చికి తాజాగా భౌగోళిక గుర్తింపు (జీఐ) దక్కింది. ఈ మేరకు 2021 నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. జీఐ కోసం తిమ్మంపేట మిర్చి ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ 2022లో దరఖాస్తు చేయగా ఇటీవలే భారత పేటెంట్‌ కార్యాలయం (ఐపీవో) ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో గిరాకీ, మార్కెటింగ్‌ అవకాశాలు పెరుగుతూ ఇది అన్నదాతలకూ లాభదాయకం కానుంది. దేశ, విదేశాల్లో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు మెరుగవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.


50 ఏళ్ల కిందట పడిన విత్తనం

1972లో పరకాల మండలం నాగారం, నడికుడ, రంగాపురం, బంగ్లాపల్లి, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, వావిలాల తదితర గ్రామాల్లో చపాటా విత్తనాలను రైతులే తయారు చేసుకున్నారు. తొలుత నగర మిర్చిగా పిలిచినా.. వరంగల్‌ మిర్చిగా మార్కెట్‌లో ప్రసిద్ధి చెందింది. లంబుకాయ, సింగిల్‌ పట్టి, డబుల్‌ పట్టి, టమాట మిర్చిగానూ పేర్కొంటారు. చపాటాపై స్వీయ ప్రయోగం విజయవంతంతో విత్తనాలను ఇతర రైతులకు అందించారు. మొదటి కాతలో నాణ్యమైన, మంచి రంగుతో కూడిన కాయలను గ్రేడ్‌ చేసి 10-15 రోజులు, గింజలను వేరు చేసి మరో మూడు రోజులు ఎండబెడతారు. తర్వాత శుద్ధి చేసి భద్రపరుస్తారు. ఈ మిరప పొడిని పచ్చళ్లలో, ఎండు మిర్చిగా వాడుతుంటారు. విశిష్టత రీత్యా చపాటా మిర్చి సాగు పదేళ్ల నుంచి భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు విస్తరించింది. ఈ సీజన్‌లో ఉమ్మడి వరంగల్‌లో 10 వేల, ఉమ్మడి ఖమ్మంలో 6 వేల, ఇతర జిల్లాల్లో 9 వేల ఎకరాల్లో పండిస్తున్నారు.


మెక్సికన్‌ క్యాప్సికమ్‌లా..

మెక్సికన్‌ క్యాప్సికమ్‌ను పోలి ఉండే వరంగల్‌ చపాటా మిర్చి అరుదైన రకాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. పచ్చళ్లు చాలా రోజులు ఉండడంతో ఈ మిర్చికి దేశ, విదేశాల్లో డిమాండ్‌ నెలకొంది. ఆహార శుద్ధి పరిశ్రమలు, హోటళ్లు, బెవరేజెస్‌, పచ్చళ్ల తయారీతో పాటు లిప్‌స్టిక్‌, ఐస్‌క్రీంలో వినియోగిస్తుండడం విశేషం. ముఖ్యంగా థాయ్‌లాండ్‌, వియత్నాం, ఇంగ్లండ్‌, అమెరికా, స్విట్జర్లాండ్‌ తదితర దేశాల్లో భారీ డిమాండ్‌ ఉంది. చపాటా మిర్చి ఉష్ణ విలువ 4000-8,500 మధ్య స్కోవిల్లే హీట్‌ యూనిట్స్‌ మధ్య ఉంటుందని, అందుకే విదేశాల్లో బాగా వినియోగిస్తారని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు.


తెగుళ్ల బెడద నివారిస్తే..

ఇతర మిర్చి రకాలతో పోల్చితే చపాటాకు మార్కెట్‌లో ధర ఎక్కువ. కానీ, తెగుళ్లు, నల్ల తామర, వైర్‌సలు దెబ్బకొడుతున్నాయి. ఎకరానికి సాధారణంగా 15 క్వింటాళ్ల నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. నిరుడు 8 నుంచి 10 క్వింటాళ్లకే పరిమితమైంది. వరంగల్‌లో మిర్చి పరిశోధన కేంద్రంలో లేకపోవడంతో ఏపీలోని గుంటూరు, మహారాష్ట్రలోని పుణెలకు పంపాల్సి వస్తుంది. పదేళ్ల నుంచి చపాటా మిర్చికి క్వింటా రూ.25 వేల వరకు ధర పలుకుతోంది. 2022లో ఏకంగా రూ.60వేలు ధర వచ్చింది. పరకాల మండలం హైబత్‌పల్లి రైతు సంపత్‌ తెచ్చిన పంట క్వింటాకు గరిష్ఠంగా రూ.90 వేలు పలికింది. నిరుడు రూ.30వేల లోపే విక్రయించారు. తెగుళ్లపై ఉద్యానశాఖ అధికారులు పరిశోధనలు చేసి కట్టడికి సూచనలు చేయాల్సి ఉంది.

Updated Date - Dec 12 , 2024 | 03:58 AM