Share News

Hyderabad: చంచల్‌గూడ బాస్‌ ఎవరో?

ABN , Publish Date - Dec 05 , 2024 | 03:40 AM

చంచల్‌గూడ కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ పోస్టుకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు! రాష్ట్ర జైళ్ల శాఖలో డీజీ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్‌ ఉన్న పోస్టుల్లో ఇదొకటి! చంచల్‌గూడ జైలుకు వీఐపీ జైలు అనే పేరు కూడా ఉంది.

Hyderabad: చంచల్‌గూడ బాస్‌ ఎవరో?

  • శివకుమార్‌ వదలరు.. దశరథం పట్టువదలరు!

  • మూడేళ్లుగా జైలు సూపరింటెండెంట్‌గా శివకుమార్‌

హైదరాబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): చంచల్‌గూడ కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ పోస్టుకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు! రాష్ట్ర జైళ్ల శాఖలో డీజీ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్‌ ఉన్న పోస్టుల్లో ఇదొకటి! చంచల్‌గూడ జైలుకు వీఐపీ జైలు అనే పేరు కూడా ఉంది. సాధారణ జేబుదొంగ నుంచి వీఐపీ, వీవీఐపీ ఖైదీల వరకు ఈ జైలుకు వస్తుంటారు. కొద్ది రోజులుగా ఈ జైలు సూపరింటెండెంట్‌ పోస్టు విష యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఒక్క పోస్టు విషయం ఏకంగా ప్రభుత్వం దృష్టి సారించే వరకు వెళ్లిందంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. చంచల్‌గూడ జైల్లో అసలేం జరుగుతుందనే విషయం నిగ్గుతేల్చేందుకు నిఘా విభాగం రంగంలోకి దిగినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో ఐదు కేంద్ర కారాగారాలు ఉండగా వరంగల్‌ జైలు ప్రస్తు తం మనుగడలో లేదు. ఇక మిగిలింది నాలుగు. చంచల్‌గూడ, చర్లపల్లి, నిజామాబాద్‌, సంగారెడ్డి. ఈ కేంద్ర కారాగారాల్లో చంచల్‌గూడ ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గా నిలుస్తుంది.


కొంతకాలంగా జైలు సూపరింటెండెంట్‌ పోస్టు విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుత సూపరింటెండెంట్‌ శివకుమార్‌ 2021లో బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ సూపరింటెండెంట్‌ హోదాలో అధికారులు రెండేళ్ల వరకు కొనసాగుతారు. కానీ, శివకుమార్‌ మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. ఇలా జరగడం జైలు చరిత్రలో ఇదే తొలిసారి. తాజాగా సూపరింటెండెంట్‌ పోస్ట్‌ దక్కించుకునేందుకు దశరథం అనే మరో అధికారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శివకుమార్‌ తనకున్న రాజకీయ పరిచయాలు ఉపయోగించుకుని పోస్టులో కొనసాగుతున్నారని జైళ్ల శాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది. లెక్కప్రకారం దశరథం ఇప్పటికే చంచల్‌గూడలో బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ, గతంలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఉన్నతాధికారులు ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం ఉంది.


  • నకిలీ బెయిల్‌ విషయంలోనూ పంచాయితీ

సంచలనం సృష్టించిన నకిలీ బెయిల్‌ పత్రాలతో ఖైదీ విడుదల వ్యవహారం కూడా జైళ్ల శాఖలో వివాదానికి దారితీసింది. ఖైదీ విడుదలపై జైలు అధికారు లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని అధికారులు ఐజీకి కాకుండా నేరుగా డీజీ దృష్టికి తీసుకెళ్లారు. తీవ్రంగా పరిగణించిన డీజీ సౌ మ్యామిశ్రా తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Dec 05 , 2024 | 03:40 AM