Share News

BRS: కారు దిగకుండా.. కట్టు దాటకుండా.. బీఆర్‌ఎస్‌ ముందస్తు జాగ్రత్తలు ఫలించేనా...

ABN , Publish Date - Feb 11 , 2024 | 01:35 PM

లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీ ప్రజాప్రతినిధులు కట్టుదాటకుండా బీఆర్‌ఎస్‌ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.

BRS: కారు దిగకుండా.. కట్టు దాటకుండా.. బీఆర్‌ఎస్‌ ముందస్తు జాగ్రత్తలు ఫలించేనా...

హైదరాబాద్‌ సిటీ: లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీ ప్రజాప్రతినిధులు కట్టుదాటకుండా బీఆర్‌ఎస్‌ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఓ వైపు నియోజకవర్గాల వారీగా విజయోత్సవ సభలు నిర్వహిస్తూనే.. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సమావేశమవుతున్నారు. విద్యార్థి, యువజన విభాగం నాయకుడిగా ఆది నుంచి బీఆర్‌ఎస్(గతంలో టీఆర్‌ఎస్)లో ఉన్న మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ శుక్రవారం పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో శనివారం తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ గ్రేటర్‌ కార్పొరేటర్లతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. స్థానిక ఎమ్మెల్యేలతో పొసగని, పార్టీ అగ్రనాయకుల తీరుపై అసంతృప్తితో ఉన్న కొందరు కార్పొరేటర్లు కారు దిగుతారన్న ప్రచారం నేపథ్యంలో కేటీఆర్‌ రంగంలోకి దిగినట్టు సమాచారం. గతంలోనూ ఓసారి జీహెచ్‌ఎంసీలోని పార్టీ కార్పొరేటర్లతో సమావేశమైన కేటీఆర్‌ వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా కొందరు ఇతర పార్టీల వైపు చూస్తుండడంతో మరోసారి వారితో సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. అగ్ర నాయకుడి బుజ్జగింపుల నేపథ్యంలో పార్టీలో కొనసాగేది ఎందరు..? కారు దిగేది ఎవరు..? అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఆ నియోజకవర్గాల కార్పొరేటర్లే లక్ష్యంగా..

శాసనసభ్యులతో సఖ్యత లేని నియోజకవర్గాల్లోని బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. నామినేటెడ్‌ పోస్టులు ఇస్తామని, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసేందుకు మంచి అవకాశాలు కల్పిస్తామని ఆశ చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ఓ కాంగ్రెస్‌ అభ్యర్థి.. ఓ కార్పొరేటర్‌కు ఫోన్‌ చేసి ‘నాకు ఎమ్మెల్సీ పదవి వస్తుంది.. నియోజకవర్గంలోని మరో అగ్రనేత కూడా ఇతర ప్రాంతానికి వెళ్తున్నాడు. తరువాత నీకే ఎమ్మెల్యే అవకాశం దక్కుతుంది’ అని చెప్పినట్టు సమాచారం. హస్తం గూటికి చేరిన బాబా ఫసియుద్దీన్‌ కూడా తనతోపాటు కొందరు కార్పొరేటర్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసినట్టు తెలిసింది. దీంతో ఎమ్మెల్యేలతో పొసగని కార్పొరేటర్లు, వారి భర్తలు కొందరు పార్టీ వీడే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. జూబ్లీహిల్స్‌, అంబర్‌పేట, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి(Amberpet, Khairatabad, Kukatpally), కుత్బుల్లాపుర్‌, ఉప్పల్‌ నియోజకవర్గాల్లోని 14 మంది కార్పొరేటర్లతో కాంగ్రెస్‌ నేతలు సంప్రదింపులు జరిపినట్టు విశ్వసనీయ సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరిన ఓ కార్పొరేటర్‌ కూడా కారు దిగే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘ఇప్పటికీ పార్టీలో ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఉంది. వారెక్కడ పార్టీ వీడతారో అన్న భయంతో మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అందుకే మా దారి మేం చూసుకోవాలనుకుంటున్నాం’ అని ఓ కార్పొరేటర్‌ పేర్కొన్నారు.

డిప్యూటీ మేయర్‌ డుమ్మా..

- పార్టీ వీడతారని ప్రచారం..

తెలంగాణభవన్‌లో కార్పొరేటర్లతో కేటీఆర్‌ నిర్వహించిన సమావేశానికి డిప్యూటీ మేయర్‌ శ్రీలతాశోభన్‌రెడ్డి డుమ్మా కొట్టారు. పార్టీ తీరుపట్ల అసంతృప్తితోనే సమావేశానికి దూరంగా ఉన్నట్టు సమాచారం. పార్టీ అధినేతను కలిసేందుకు ఇటీవల శ్రీలత దంపతులు నందినగర్‌లోని ఇంటికి వెళ్లగా నాలుగు గంటలు వేచి చూసినా కేసీఆర్‌ కలవలేదని సమాచారం. అంత సమయం నిరీక్షించినా.. ఇప్పుడు కలవడం కుదరదని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ చెప్పినట్టు తెలిసింది. అంతకుముందు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌ్‌సలో కలిసేందుకు వెళ్లినా లోనికి అనుమతించలేదని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని శోభన్‌రెడ్డి భావించారు. డిప్యూటీ స్పీకర్‌ తీగుళ్ల పద్మారావుగౌడ్‌కు మరోసారి అవకాశం దక్కడంతో ఆయనకు నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో ఉద్యమకారులకు పార్టీలో తగిన గుర్తింపు లేదన్న అభిప్రాయాన్ని శోభన్‌రెడ్డి సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీలత దంపతులు బీఆర్‌ఎ్‌సను వీడతారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై శోభన్‌రెడ్డి స్పందిస్తూ అలాంటిదేం లేదని ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. కొందరు కార్పొరేటర్లు కూడా సమావేశానికి గైర్హాజరు కావడం గమనార్హం.

Updated Date - Feb 11 , 2024 | 01:35 PM