వాణిజ్యం ఆకాశాన్ని తాకేలా!
ABN , Publish Date - Nov 13 , 2024 | 04:16 AM
హైదరాబాద్‌కు పశ్చిమాన అతి పెద్ద కమర్షియల్(వాణిజ్య) భవనం రాబోతుంది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారి 50 అంతస్తులతో ఓ వాణిజ్య భవనాన్ని నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది.

కోకాపేటలో 50 అంతస్తుల కమర్షియల్ భవనం
దక్షిణ భారత దేశంలోనే ఇదే అతి పెద్దది
హెచ్‌ఎండీఏకు ప్రముఖ నిర్మాణ సంస్థ దరఖాస్తు
హైదరాబాద్ సిటీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు పశ్చిమాన అతి పెద్ద కమర్షియల్(వాణిజ్య) భవనం రాబోతుంది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారి 50 అంతస్తులతో ఓ వాణిజ్య భవనాన్ని నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది. కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌లో ఈ నిర్మాణం జరగనుంది. హైదరాబాద్ సహా దక్షిణ భారతదేశం మొత్తంలో 30 అంతస్తుల వాణిజ్య భవనాలే ఇప్పటిదాకా పెద్దవి. ఈ 50 అంతస్తుల భవన నిర్మాణం జరిగితే హైదరాబాద్ అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. కోకాపేట, నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, ఖాజాగూడ, నార్సింగి, నల్లగండ్ల, కొల్లూరు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ఇప్పటికే అనేకబహుళ అంతస్తుల భవనాలు వస్తున్నాయి. ఐటీ కారిడార్‌లో ఆఫీస్ స్పేస్, నివాస సముదాయాలకు ఉన్న డిమాండ్ మేరకు నిర్మాణ సంస్థలు ఆయా ప్రాంతాల్లో ఆకాశహర్మ్యాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఐటీ కారిడార్‌లో 40 అంతస్తుల నుంచి 58 అంతస్తుల వరకు రెసిడెన్షియల్ భవన నిర్మాణాలు చేపడుతుండగా 50అంతస్తుల కమర్షియల్ భవనం రానుండడం విశేషం. కాగా, హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన కోకాపేట నియో పోలీస్ లేఅవుట్ బహుళ అంతస్తుల భవనాలకు కేంద్రంగా మారింది. ఇక్కడ ఎకరం రూ.100 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. ఈ లేఅవుట్‌లో గ్రౌండ్ ప్లస్ 50 అంతస్తులతో రెండు రెసిడెన్షియల్ టవర్ల నిర్మాణ పనులను ఇప్పటికే ఓ నిర్మాణ సంస్థ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు సమీపంలోనే గ్రౌండ్ ప్లస్ 50 అంతస్తులతో కమర్షియల్ భవనాన్ని నిర్మించేందుకు ఓ నిర్మాణ సంస్థ హెచ్‌ఎండీఎకు దరఖాస్తు చేసింది. మరో 20 రోజుల్లో ఈ సంస్థ బ్రోచర్ విడుదల చేసే అవకాశముంది..
పార్కింగ్‌కు 5 అంతస్తులు
కోకాపేట నియోపోలీస్ లేఅవుట్‌లో వచ్చే ఈ 50 అంతస్తుల భవనంలో 80శాతానికి పైగా ఓపెన్ స్పెస్ ఉండనుంది. ఇందులో వాహనాల పార్కింగ్ కోసం ఐదు అంతస్తుల మల్టీలెవల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తారు. గ్రౌండ్ నుంచి ఆరో అం తస్తు వరకు షాపింగ్ మాల్, ఆరో అంతస్తులో డైనింగ్ ఏరియా, సినిమా థియేటర్లు ఉండనున్నాయి. ఇక, 7నుంచి 29వ అంతస్తు వరకు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు కేటాయించనుండగా.. బహుళ జాతి సంస్థ(ఎంఎన్‌సీ)లు తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తాయి. ఇక 30 నుంచి 50వ అంతస్తు వరకు ఇంటర్‌కాంటినెంటల్ హోటల్ నిర్మాణానికి రిజర్వు చేశారు.