Share News

Hyderabad: హైదరాబాద్‌లో 40-50 కి.మీ. వేగంతో గాలులు

ABN , Publish Date - May 27 , 2024 | 04:36 AM

హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో 20 నిమిషాల పాటు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పెద్ద సంఖ్యలో భారీ వృక్షాలు నేలకూలాయి. ఓ దశలో మనిషి కొట్టుకుపోతారా? అనేంత వేగంతో గాలి వీచింది.

Hyderabad: హైదరాబాద్‌లో 40-50 కి.మీ. వేగంతో గాలులు

హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో 20 నిమిషాల పాటు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పెద్ద సంఖ్యలో భారీ వృక్షాలు నేలకూలాయి. ఓ దశలో మనిషి కొట్టుకుపోతారా? అనేంత వేగంతో గాలి వీచింది. గంటలపాటు విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. వర్షం పది నిముషాలే పడింది. కానీ బలంగా వీచిన ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. వనస్థలిపురం గణేష్‌ ఆలయం రోడ్డులో భారీ చెట్టు పడడంతో వాహనాల రాకపోకలు గంటకుపైగా నిలిచిపోయాయి. కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఇళ్లపై రేకులు కొట్టుకుపోయాయి. హయత్‌నగర్‌-1 డిపోలో భారీ వృక్షం పడడంతో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది.


డ్రైవర్ల రెస్ట్‌రూంల పై కప్పు రేకులు విరిగిపోయాయి. డిపోలో సైతం భారీ వృక్షం కూలి డిపో ప్రహరీ గోడ ధ్వంసమైంది. రాయదుర్గం, గచ్చిబౌలి, టీఎన్‌జీవో కాలనీ, గౌరవెలి ప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రతకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తీగలపై చెట్లు పడడంతో విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. 3-4 గంటల పాటు సరఫరా నిలిచిపోయింది. నగరంలో మధ్యాహ్నం 3 గంటలకు పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా మరికొన్నిచోట్ల వర్షం కురవడం గమనార్హం. గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, ఖాజాగూడ, రాయదుర్గం, కొత్తగూడ, కొండాపూర్‌, లింగంపల్లి, తారానగర్‌, మియాపూర్‌, చందానగర్‌లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఐకియా, బయో డైవర్సిటీ, కొండాపూర్‌ సర్కిల్‌, గచ్చిబౌలి ఔటర్‌ సర్కిల్‌ తదితరచోట్ల, ట్రాఫిక్‌ స్తంభించింది.

Updated Date - May 27 , 2024 | 04:36 AM