Share News

Hyderabad: 11 టోల్‌ ప్లాజాలు.. ఇంటర్‌చేంజ్‌లు

ABN , Publish Date - May 27 , 2024 | 04:20 AM

రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రోడ్డు నిర్మాణానికి ఆగస్టు రెండో వారంలో టెండర్లకు వెళ్లనున్న నేపథ్యంలో రహదారి స్వరూపం దాదాపు ఖరారైంది. 6 ప్యాకేజీలతో 161 కి.మీ. మేర నిర్మాణం కానున్న ఉత్తరభాగం రహదారిలో టోల్‌ ప్లాజాలు

Hyderabad: 11 టోల్‌ ప్లాజాలు.. ఇంటర్‌చేంజ్‌లు

  • 107 మేజర్‌, మైనర్‌ బ్రిడ్జిలు.. 4 ఆర్వోబీలు

  • 187 అండర్‌ పాస్‌లు.. 6 రెస్ట్‌ ఏరియాలు

  • ఇది ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం స్వరూపం

  • బ్రిడ్జిలు, కెనాల్‌ క్రాసింగ్స్‌, రైల్వే అంశాలపై జీఏడీకి వివరాలు సమర్పించిన ఎన్‌హెచ్‌ఏఐ

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రోడ్డు నిర్మాణానికి ఆగస్టు రెండో వారంలో టెండర్లకు వెళ్లనున్న నేపథ్యంలో రహదారి స్వరూపం దాదాపు ఖరారైంది. 6 ప్యాకేజీలతో 161 కి.మీ. మేర నిర్మాణం కానున్న ఉత్తరభాగం రహదారిలో టోల్‌ ప్లాజాలు మొదలుకుని, ఆర్వోబీల వరకు ఎక్కడెక్కడ ఏయే నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే అన్ని అంశాలను ఇప్పటికే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) తెలంగాణ విభాగం ప్రాథమికంగా ఖరారు చేసింది.


ప్రస్తుతం ప్రాథమిక అంచనాలలో ఉన్న రోడ్డు మ్యాప్‌ అతి త్వరలోనే ఖరారు కానున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. గత సర్కారు ఆశించిన స్థాయిలో సహకరించకపోవడం వల్ల ఏళ్ల తరబడి ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రీజినల్‌ రింగ్‌ రోడ్డుపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే ఔటర్‌ రింగ్‌ రోడ్డును నిర్మించామని, ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ను కూడా తామే పూర్తిచేస్తామంటూ సీఎం రేవంత్‌, ఆర్‌ అండ్‌ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతూ వస్తున్నారు. అత్యంత వేగంగా దీని పనులను మొదలుపెట్టేందుకు అవసరమైన మేర సహకరిస్తున్నారు. ఉత్తర భాగం రోడ్డు మ్యాప్‌కు సంబంధించిన ఇతర నిర్మాణాలపైనా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్డుతో పాటు ఏయే ప్రాంతాల్లో ఇతర నిర్మాణాలు రానున్నాయనే అంశాలను తెలుసుకున్నారు.


ఇదీ సమగ్ర స్వరూపం..

ఉత్తర భాగం రోడ్డు విస్తీర్ణం 161కి.మీ. ఈ మార్గంలో పలు జాతీయ, రాష్ట్ర రహదారులను క్రాస్‌ చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన మైనర్‌, మేజర్‌, బాక్స్‌ కల్వర్టులను కూడా నిర్మించాల్సి ఉంది. దీంతో అసలు ఈ ఉత్తర భాగం రోడ్డు మొత్తంలో ఎక్కడెక్కడ ఏయే నిర్మాణాలు వస్తున్నాయనే వివరాలకు సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐ ప్రాథమికంగా ఒక రిపోర్టును సిద్ధం చేసింది. ఈ మేరకు మొత్తం రోడ్డు విస్తీర్ణంలో 11 టోల్‌ప్లాజాలు, 11 ఇంటర్‌ ఛేంజ్‌లు రానుండగా, 6 చోట్ల రెస్ట్‌ ఏరియాలు ఏర్పాటుకానున్నాయి. చిన్న, మధ్య, భారీ తరహా వెహికల్‌ అండర్‌ పాస్‌లు అన్నీ కలిపి దాదాపు 187 వరకు నిర్మాణం చేయాల్సి వస్తోందని అధికారులు గుర్తించారు. నాలుగు రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి(ఆర్వోబీ)లను నిర్మించాల్సి వస్తోంది.


ఇవికాక మేజర్‌ బ్రిడ్జిలు 27, మైనర్‌ బ్రిడ్జిలు 80, బాక్స్‌ కల్వర్టులు 404 మేర నిర్మించాల్సి ఉంది. కాగా, ఈ నిర్మాణాలకు రోడ్డుతో సంబంధం లేకుండా టెండర్లకు వెళ్లాలా..? లేదంటే రోడ్డుతో పాటే కలిపి టెండర్లను ఆహ్వానించాలా..? అనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ మార్గంలో ఉన్న రైల్వే లైన్లు, కాల్వలు, చెట్లు, సహా పలు అంశాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖకు అందించగా, వీటిలో కొన్నింటి నిర్వహణకు ఇరిగేషన్‌, రైల్వే శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఆయా అనుమతులను త్వరలోనే పొంది, రోడ్డు పనులను త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - May 27 , 2024 | 04:20 AM