Share News

West Indies: ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం.. గబ్బాలో వెస్టిండీస్ సంచలనం!

ABN , Publish Date - Jan 28 , 2024 | 05:24 PM

అద్భుత ఫామ్‌తో చెలరేగుతున్న ఆస్ట్రేలియాకు స్వదేశంలో షాక్ తగిలింది. పసికూనగా భావించిన వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది. గబ్బాలో ఆస్ట్రేలియాను దెబ్బ తీసింది. విండీస్ నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 207 పరుగులకు ఆలౌటైంది

West Indies: ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం.. గబ్బాలో వెస్టిండీస్ సంచలనం!

అద్భుత ఫామ్‌తో చెలరేగుతున్న ఆస్ట్రేలియాకు (Australia) స్వదేశంలో షాక్ తగిలింది. పసికూనగా భావించిన వెస్టిండీస్ (West Indies) ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది. గబ్బాలో ఆస్ట్రేలియాను దెబ్బ తీసింది (Aus vs WI). విండీస్ నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 207 పరుగులకు ఆలౌటైంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై విండీస్ జట్టుకు ఇదే తొలి విజయం. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై విండీస్ బౌలర్ షామార్ జోసెఫ్ (7/68) (Shamar Joseph) నిప్పులు చెరిగాడు.

తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 311 పరుగులకు అలౌట్ అయింది. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 289 పరుగులు చేసింది. ప్యాట్ కమిన్స్ (64 నాటౌట్) క్రీజులో ఉన్నప్పటికీ ఆసీస్ అతి విశ్వాసానికి పోయి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. విండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో త్వరగా అవుట్ చేయాలని ఆ నిర్ణయం తీసుకుంది. అనుకున్నట్టుగానే రెండో ఇన్నింగ్స్‌లో విండీస్‌ను 193 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా ముందు విండీస్ 216 పరుగుల లక్ష్యం ఉంచింది (West Indies victory).

స్వల్ప లక్ష్యాన్ని విండీస్ బౌలర్లు అద్భుతంగా కాపాడుకున్నారు. స్టీవ్ స్మిత్ (91 నాటౌట్), కామెరూన్ గ్రీన్ (42) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ క్రీజులో ఎక్కువ సేపు నిలువలేకపోయారు. ముఖ్యంగా విండీస్ బౌలర్ షామార్ జోసెఫ్ ఏడు వికెట్లతో కంగారూల పతనాన్ని శాసించాడు. లోయర్ ఆర్డర్ మద్దతు లభించకపోవడంతో స్మిత్ ఒంటరి పోరాటం ఆసీస్‌ను గెలిపించలేకపోయింది. మొత్తానికి 30 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై విండీస్‌కు తొలి విజయం లభించింది. రెండు టెస్ట్‌ల సిరీస్‌ను ఇరు జట్లూ 1-1తో సమం చేశాయి.

Updated Date - Jan 28 , 2024 | 05:25 PM