వాహ్! నామీ ఐలాండ్
ABN , Publish Date - Dec 29 , 2024 | 10:35 AM
కె డ్రామా, కె సినిమాలు భారతీయుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దాంతో ఒక్కసారిగా దక్షిణ కొరియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దక్షిణకొరియా అంటే ఉర్రూతలూగడానికి మరో కారణం బీటీఎస్. అలా సంగీతం, సినిమాలతో భారత్‌తో సాంస్కృతిక బంధం పెనవేసుకుపోయింది. టెక్నాలజీతో పాటు పర్యాటకంగా కూడా గొప్ప అనుభూతి కలిగించే అక్కడి విశేషాలే ఇవి...

కె డ్రామా, కె సినిమాలు భారతీయుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దాంతో ఒక్కసారిగా దక్షిణ కొరియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దక్షిణకొరియా అంటే ఉర్రూతలూగడానికి మరో కారణం బీటీఎస్. అలా సంగీతం, సినిమాలతో భారత్‌తో సాంస్కృతిక బంధం పెనవేసుకుపోయింది. టెక్నాలజీతో పాటు పర్యాటకంగా కూడా గొప్ప అనుభూతి కలిగించే అక్కడి విశేషాలే ఇవి...
ఇటీవల ఐదురోజుల పాటు దక్షిణకొరియాకు వెళ్లాను. అక్కడ అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిన ప్రదేశం ‘నామీ ఐలాండ్’. చుట్టూ సరస్సు... మధ్యలో ఐలాండ్. ఆ దీవికి సాంస్కృతికపరంగా దక్షిణకొరియా ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఇది ఆ దేశంలోని భాగమే అయినా... ఒక పర్యాటక ప్రాంతంగా సాంస్కృతిక స్వేచ్ఛ కలిగి ఉంది. విశేషమేమిటంటే ఈ దీవికి ఒక ప్రత్యేక పతాకం కూడా ఉంది. అక్కడ పర్యాటకుల పాస్‌పోర్టులు చెక్ చేసే ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ ఉంది.
సాధారణంగా ఒక దేశంలోకి ప్రవేశించేటప్పుడు విమానాశ్రయంలో మాత్రమే పాస్‌పోర్టులు తనిఖీ చేస్తారు. తిరిగి దేశం దాటేటప్పుడు పరిశీలిస్తారు. నామీ ఐలాండ్‌కు ఇచ్చిన ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపు నేపథ్యంలో అక్కడ ఇమ్మిగ్రేషన్ కౌంటర్‌లో పాస్‌పోర్టును మళ్లీ చెక్ చేశారు. ఆ తర్వాత టికెట్ తీసుకుని బోట్ ఎక్కాం. రెండంతస్థుల బోట్‌లో ఐలాండ్‌కు ఆరు నిమిషాల ప్రయాణం. చుట్టూ గ్లాస్ ఉండి, బోట్‌లో నుంచే 360 డిగ్రీల కోణంలో ప్రకృతి అందాల్ని చూసేలా ఏర్పాటు ఉంది.
ఈ దీవి సముద్రంలో కాకుండా హాన్ నదిలో ఉంది. నామీ ఐలాండ్‌లో దిగాక... అక్కడి భూభాగం, జంతుజాలం, వృక్షసంపద... మొత్తంగా చెప్పాలంటే జీవావరణం, పర్యావరణం భిన్నంగా కనిపించింది. కొన్ని శీతల దేశాల్లో మాత్రమే ఉండే రంగురంగుల చెట్లు ఇక్కడ చూడొచ్చు. అటూ ఇటూ రంగురంగుల చెట్లున్న ఆ రోడ్లమీద నడుస్తూ ఐలాండ్ మొత్తం తిరిగి చూశాం. చిన్న చిన్న సరస్సులు, గడ్డి మైదానాలు, ఫౌంటేన్లు, కొరియన్ స్టైల్ రెస్టారెంట్లు అన్నీ చూస్తుంటే కాలం ఇట్టే గడిచిపోయింది. టికెట్ తీసుకుని ఐలాండ్‌కు వెళ్లాక అక్కడ సాయంత్రం వరకు ఉండి మళ్లీ బోటులో రావొచ్చు. నది మీద కొన్ని కిలోమీటర్ల మేర జిప్‌లైనర్ లాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి.
777 అడుగుల ఎత్తులో డైనింగ్...
సియోల్‌లో ఉన్న మరో ప్రధాన ఆకర్షణ ‘సియోల్ టవర్’. భూమి నుంచి 777 అడుగుల ఎత్తులో ఒక కొండమీద కట్టారు. టవర్ పైవరకు లిఫ్టులో తీసుకెళ్తారు. సగం దూరం వరకు ఒక లిఫ్టు... అక్కడినుంచి పైకి వెళ్లేందుకు మరొక లిఫ్టు. రెండింటికీ వేర్వేరు టికెట్లు తీసుకోవాలి. ఒక్కో టికెట్ ధర సుమారు వెయ్యి రూపాయలు. కొందరు ఒక టికెట్ తీసుకుని సగం వరకు వెళ్లి, అక్కడినుంచి నగరాన్ని చూసి, షాపింగ్ చేసుకుని వెళ్లిపోతారు. కొందరు మరింత పైకి వెళ్తున్నారు. మేము టవర్ పైభాగం వరకు వెళ్లాం. అక్కడినుంచి సియోల్ నగరం మొత్తం కనిపిస్తుంది. నగరం మధ్య నుంచి వెళ్లే హాన్ నది, ఆ నదిపై ఉన్న వంతెనలు, వాటర్ ఫౌంటేన్లు...
మేము రాత్రిపూట వెళ్లడంతో విద్యుద్దీపాల కాంతిలో వెలుగు జిలుగుల నగరాన్ని చూడడం అద్భుత అనుభవం. లిఫ్ట్ ఎక్కి దిగేవరకు... లిఫ్ట్ గోడల మీద చూడచక్కని వీడియోను ప్రదర్శించారు. లిఫ్ట్ ఎక్కాక ప్రారంభమయ్యే వీడియో... పైకి చేరుకునేసరికి అయిపోతుంది. ఆఖరి ఫ్లోర్‌లో ‘ఎన్ గ్రిల్’ అనే రెస్టారెంట్ ఉంది. 777 అడుగుల ఎత్తులో కూర్చుని నగరాన్ని వీక్షిస్తూ భోజనం చేయడం ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో ఊహించొచ్చు. సియోల్ టవర్‌లోని ‘ప్యాడ్‌లాక్ ఆఫ్ లవ్’ ప్రసిద్ధి చెందింది.. భార్యాభర్తలు, ప్రేయసీ ప్రియులు... ఇలా ఎవరైనా ఇక్కడున్న ఒక రెయిలింగ్‌కి తాళం వేస్తే... తమ ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుందని నమ్ముతారు. పర్యాటకులు ఇక్కడ లాక్ వేసి ఫొటోలు దిగుతారు.
ప్యాలెస్‌లు... హాన్ నదీ తీరంలో వెలుగులు...
సియోల్ ప్యాలెస్‌లకు ప్రసిద్ధి. జోసియాన్ వంశానికి చెందిన రాజులు 1392-1910 వరకు కొరియాను పాలించారు. ఆ రాజులు కట్టిన అనేక ప్యాలెస్‌లు ఇప్పుడు పర్యాటక ఆకర్షణగా ఉన్నాయి. గ్యాంగ్‌డక్‌గంగ్, చాంగ్‌డక్‌గంగ్ లాంటివి పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. 1395లో నిర్మించిన గ్యాంగ్‌డక్‌గంగ్ ప్యాలెస్ 1592లో జపాన్ దండయాత్ర సమయంలో దెబ్బతింది. 1867లో ప్యాలెస్‌ను తిరిగి నిర్మించారు. ఇక సియోల్ మధ్య నుంచి ప్రవహించే ‘హాన్ నది’ ఒడ్డున రాత్రి సమయాల్లో వేడుకగా ఉంటుంది. క్రూయిజ్‌లో విహారం, అక్కడి ఆటపాటలు, ఆహారం చవి చూడాల్సిందే.
సియోల్ పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న మరో ప్రాంతం ‘చంగ్ ఎ చంగ్’ నది. ఎప్పుడో అంతరించిపోయి, మురికికూపంగా మారిన నదిని... తిరిగి పునరుజ్జీవింపచేసి చూడచక్కని పర్యాటక ప్రదేశంగా చేశారు. ఆ నది వెంబడి నడక, అక్కడి స్వచ్ఛమైన నీరు, నదిని పునరుజ్జీవం చేసిన తీరు ఆకట్టుకుంటాయి.
సైడ్ డిష్ ‘కిమ్చీ’
కొరియా ఆహారం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మేము హైదరాబాద్ నుంచి బ్యాంకాక్... అక్కడి నుంచి సియోల్‌కు చేరుకున్నాం. విమానాశ్రయంలో దిగి గదికి వెళ్లేసరికి రాత్రి 9 గంటలైంది. మా హోటల్ మ్యాంగ్‌డ్యాంగ్ ప్రాంతంలో ఉంది. మ్యాంగ్ డ్యాంగ్ అనేది స్ర్టీట్ ఫుడ్, షాపింగ్‌లకు ప్రసిద్ధి. రాత్రి సమయాల్లో స్ర్టీట్‌ఫుడ్ దుకాణాలు వెలుగు లీనుతూ ఉంటాయి. ఆక్టోపస్‌ను బాగా తింటున్నారు. దానితో పాటు పీతలు, రొయ్యలు, ఆల్చిప్పలను ఉడికించి ఇస్తున్నారు. ఆహారం ఖరీదు చాలా ఎక్కువ. భారతీయ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. కొరియన్ ఫుడ్ బాగానే ఉన్నా...
మనం ఏది ఆర్డర్ ఇస్తున్నాం అనేది ముఖ్యం. చూసి, తెలుసుకుని ఆర్డర్ ఇవ్వాలి. ఏవేవో ఆర్డర్ చేసి నోరు ఖరాబు చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. కొరియా ఫుడ్‌లో రామియన్ బాగుంది. అంటే సూప్‌లో నూడుల్స్ వేసి ఇస్తారు. నూడుల్స్‌తో పాటు వెజిటేరియన్ అయితే పలురకాల కూరగాయలు, నాన్‌వెజ్ అయితే ఎంచుకున్నదాన్ని బట్టి ఆ సూప్‌లో చిన్న చిన్న ముక్కలుగా కలిపి ఇస్తారు. కొరియా ఆహారంలో ఏది తీసుకున్నా... దానికి సైడ్ డిష్‌గా ‘కిమ్చీ’ ఉంటుంది. కిమ్చీ అంటే క్యాబేజీ లేదా ర్యాడిష్‌తో చేసిన ఒక పచ్చడి లాంటిది. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది. కొరియన్లు మాంసాహార ప్రియులు. అక్కడ శాఖాహారం, మాంసాహారం రెండింటి ధర ఒకేలా ఉంటుంది.
కొరియాలో ‘మ్యాంగ్‌డ్యాంగ్’ మార్కెట్ విదేశీయులతో కళకళలాడుతుంటోంది. అక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. దక్షిణ కొరియాలో 50ఏళ్లు పైబడినవారు కూడా పాతికేళ్లలానే కనిపిస్తారు. అందుకే అక్కడ తయారయ్యే కాస్మొటిక్స్‌కు అత్యంత డిమాండ్ ఉంటుంది. పర్యాటకులు ఎక్కువగా సౌందర్య ఉత్పత్తులనే కొంటారు.
గంగ్నమ్ అంటే దక్షిణం...
ఆమధ్య ప్రపంచవ్యాప్తంగా ఒక ఊపు ఊపిన ‘గంగ్నమ్ స్టైల్’ తెలుసు కదా. సియోల్‌లో ఉన్న జిల్లాల్లో ఒకటి గంగ్నమ్. ఎడమ మణికట్టు మీదుగా కుడి అరచేతిని ఉంచే ఫోజు గంగ్నమ్‌లో ప్రసిద్ధి. ఆ ఆకారంలోనే ఒక చిహ్నాన్ని నిర్మించారు. పర్యాటకులు ఆ చిహ్నం కింద నిలబడి ఫొటోలు దిగుతారు. కొందరు ఆ స్టైల్ స్టెప్పులేస్తూ సరదాగా వీడియోలు తీయించుకుంటారు. గంగ్నమ్ అంటే దక్షిణం అని అర్థం. హాన్ నదికి దక్షిణంగా ఉండే సియోల్ ప్రాంతం అన్నమాట.
కొరియన్లకు ఇంగ్లీషు మాట్లాడడం అంటే అదో కొరకరాని కొయ్య. కొన్నిసార్లు హోటళ్లలో పక్కవాళ్లు ఏం తింటున్నారో దాన్ని చూపించి... అదే కావాలని సైగలతో చెప్పేవాళ్లం. మాతృభాష తప్ప మరో భాష రాకున్నా... టెక్నాలజీ, పరిశోధనలో అత్యున్నత స్థాయిలో ఉండడంతో ప్రపంచాన్నే తన దగ్గరకు తెచ్చుకోగలిగిన స్థితిలో దక్షిణకొరియా ఉందని మా ఐదు రోజుల పర్యటనలో అర్థమయ్యింది.
- ఉప్పులూరి మురళీకృష్ణ,
99854 33362