Share News

Delhi High court: గొంతెమ్మ కోర్కెలతో భర్తను టార్చర్ పెట్టిన మహిళకు భారీ షాకిచ్చిన కోర్టు!

ABN , Publish Date - Feb 03 , 2024 | 04:38 PM

భర్తకు డబ్బు లేదని తెలిసీ గొంతెమ్మ కోర్కెలతో టార్చర్ పెట్టిన ఓ మహిళకు ఢిల్లీ హైకోర్టు భారీ షాకిచ్చింది. అలవిగాని కోర్కెలతో భర్తకు మనశ్శాంతి లేకుండా చేయడమూ క్రూత్వమేనని తేల్చి చెప్పింది.

Delhi High court: గొంతెమ్మ కోర్కెలతో భర్తను టార్చర్ పెట్టిన మహిళకు భారీ షాకిచ్చిన కోర్టు!

ఇంటర్నెట్ డెస్క్: భర్తకు డబ్బు లేదని తెలిసీ గొంతెమ్మ కోర్కెలతో టార్చర్ పెట్టిన ఓ మహిళకు ఢిల్లీ హైకోర్టు తాజాగా భారీ షాకిచ్చింది. అలవిగాని కోరికలతో భర్తకు మనశ్శాంతి లేకుండా చేయడమూ క్రూరత్వమేనని తేల్చి చెప్పింది. ఆ జంటకు విడాకులు ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. జస్టిస్ సురేశ్ కుమార్ కైత్, జస్టిస్ నీనా బన్సల్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

కేసు పూర్వాపరాల్లోకి వెళితే, భార్య తనను తాహతుకు మించిన కోర్కెలు కోరుతూ మానసికంగా హింసించిందన్న ఓ వ్యక్తికి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీనిపై మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, కింది కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.


భర్త ఆర్థిక పరిమితులు తెలిసీ భార్య అలవిగాని కోర్కెలు కోరడం వివాహ బంధంలో అసంతృప్తి కలిగిస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు కరువయ్యేలా మానసిక ఒత్తిడి కలుగజేస్తుందని పేర్కొంది. భర్త ఆర్థిక పరిమితులు నిత్యం గుర్తుచేసేలా భార్య తీరు ఉండకూడదని న్యాయమూర్తులు హితవు పలికారు. కోరికలు, ఆశలు, అవసరాలు, ఆదాయం మధ్య అంతరాలను గుర్తించాలని సూచించారు. ‘‘ఇలాంటి ఘటనలు చూడటానికి చాలా చిన్నవిగా అనిపించొచ్చు కానీ దీర్ఘకాలంలో భర్తకు ఒత్తిడి కలగజేస్తాయి. భార్యాభర్తలు ఇద్దరూ వైవాహిక బంధంలో ఇమడలేని పరిస్థితి కల్పిస్తాయి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది (Wife forcing husband to fulfil dreams beyond financial limit is mental strain).

భర్త చెప్పిన వివరాలను బట్టి అతడి భార్యలో సర్దుబాటు ధోరణి లేనట్టు కనిపిస్తోందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. భర్తతో ఉన్న అభిప్రాయభేదాలు తొలగించుకునే మానసిక పరిపక్వత కూడా ఆమెలో లోపించిందని అన్నారు. భార్య ప్రవర్తన కారణంగా అతడికి మానశ్శాంతి కరువైందని, ఒత్తిడి పెరిగిందని కోర్టు తేల్చి చెప్పింది. ఈ క్రమంలో హిందూ వివాహ చట్టం సెక్షన్ 13 (ఏ)(2) కింద విడాకులు ఇస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు సమర్థించారు.

Updated Date - Feb 03 , 2024 | 04:45 PM