Share News

Hangover: హ్యాంగోవర్‌కు కారణాలేంటి? దానిని నివారించాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?.

ABN , Publish Date - Dec 31 , 2024 | 04:24 PM

మద్యపానం చేసిన తర్వాతి రోజు ఉదయం చాలా మందిలో విపరీతమైన తలనొప్పి, దాహం, ఒళ్లు నొప్పులు, లైట్‌ను కూడా భరించలేకపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. కొందరిలో వాంతులు, వికారం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. సాధారణంగా అతిగా మద్యం సేవించిన వారు ఈ హ్యాంగోవర్‌కు గురవుతారని అనుకుంటారు.

Hangover: హ్యాంగోవర్‌కు కారణాలేంటి? దానిని నివారించాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?.
steps to prevent Hangover

హ్యాంగోవర్ (Hangover).. ఈ పదం మందుబాబులకు పరిచయమే. మద్యం సేవించిన తర్వాత చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. విపరీతమైన తలనొప్పి, దాహం, ఒళ్లు నొప్పులు, లైట్‌ను కూడా భరించలేకపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. కొందరిలో వాంతులు, వికారం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. సాధారణంగా అతిగా మద్యం సేవించిన వారు ఈ హ్యాంగోవర్‌కు గురవుతారని అనుకుంటారు. అయితే ఇది శరీరతత్వాన్ని బట్టి మారుతుంది. కొందరు రెండు పెగ్గులే తాగినా హ్యాంగోవర్‌ బారిన పడుతుంటారు. కొందరిలో ఈ హ్యాంగోవర్ రెండు గంటలు మాత్రమే ఉంటుంది. మరికొందరిలో ఆరు గంటల వరకు ఉంటుంది. ఇంకొందరిలో 24 గంటలు కూడా ఉంటుంది. (Health News)


రాత్రి మద్యం సేవించి ఉదయాన్నే హ్యాంగోవర్‌ సమస్యను ఎదుర్కొనే వారు తలనొప్పి మాత్రలు వేసుకుంటారు. అలా చేయడం మరిన్ని సమస్యలకు కారణమవుతుంది. హ్యంగోవర్‌కు ప్రధాన కారణం డీ హైడ్రేషన్. శరీరంలోకి చేరిన ఆల్కహాల్ నీటిని యూరిన్ రూపంలో బయటకు పంపించేస్తుంది. ఫలితంగా శరీరంలో నీటి శాతం బాగా తగ్గిపోతుంది. ఎంత ఎక్కువ ఆల్కహాల్ శరీరంలోకి చేరితే నీటి శాతం అంతగా తగ్గిపోతుంది. శరీరంలోకి చేరిన ఆల్కహాల్ నేరుగా రక్తంలో కలిసిపోతుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోయి అసమతుల్యత లోపిస్తుంది.


ఇక, డార్క్ స్పిరిట్స్ అయిన బ్రాందీ, స్కాచ్‌, విస్కీలను నిల్వ ఉంచేందుకు, వాటికి రుచి, వాసన కోసం కంజెనర్స్ అనే రసాయన సమ్మేళనాలు కలుపుతారు. ఆల్కహాల్‌లో ఈ కంజెనర్స్ శాతం ఎంత ఎక్కువగా ఉంటే హ్యాంగోవర్ తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది. బ్రాందీ, విస్కీలతో పోల్చుకుంటే వోడ్కా, రమ్, జిన్‌లలో ఈ కంజెనర్స్ శాతం తక్కువగా ఉంటుంది. ఇక, ఒకే రకమైన ఆల్కహాల్ కాకుండా, రెండు మూడు రకాలు కలిపి చేసే కాక్‌టైయిల్స్ హ్యాంగోవర్‌ను మరింత పెంచుతాయి.


హ్యాంగోవర్‌ను నియంత్రించడం ఎలా?

ఖాళీ కడుపుతో మద్యం సేవించకూడదు. మద్యపానానికి గంట ముందు ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా రక్తంలో త్వరగా కలవని కూరగాయలు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవాలి. పెరుగు తీసుకుంటే ఇంకా మంచిది. ఇక, మద్యపానానికి ముందు, మధ్యలోను, నిద్రపోయే ముందు వీలైనన్ని మంచి నీళ్లు తాగాలి. పై జాగ్రత్తలేవీ తీసుకోకుండా మద్యపానం చేసి, తర్వాతి రోజు హ్యాంగోవర్ బారిన పడితే.. లేచిన వెంటనే చన్నీళ్లతో వీలైనంత సేపు స్నానం చేయాలి. వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి. నీటిలో పంచదార, చిటికెడు ఉప్పు కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది. ఆ రోజంతా కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. వ్యాయామం జోలికి వెళ్లకూడదు. ఐరన్ శాతం పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే సిట్రస్ ఫ్రూట్స్‌ను కూడా తీసుకోవాలి.

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 31 , 2024 | 04:24 PM