Viral News: తల్లి, చెల్లికి సర్‌ప్రైజ్ ఇచ్చిన యువకుడు.. చివరికి ఎలా ఏడ్చారంటే..
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:26 AM
కొత్తగూడెం సింగరేణికి చెందిన ఓ వ్యక్తి ఐదేళ్ల క్రితం మృతిచెందారు. పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే ఆయమ ప్రాణాలు విడిచారు. అనంతరం కుటుంబ భారం అంతా కుమారుడిపై పడింది. దీంతో అతను కుటుంబానికి ఆసరాగా నిలిచాడు.

భద్రాద్రి కొత్తగూడెం: నాన్న అంటే ప్రేమ, బాధ్యతకు ప్రతిరూపం. తాను ఎన్ని కష్టాలు పడైనా పిల్లలను ఉన్నతస్థాయిలో ఉంచాలని అనుకుంటాడు. జీవితంలో ఎదురయ్యే అనేక ఒడుదుకులను తాను ఎదుర్కొంటూ పిల్లలకు రక్షణ కవచంలా నిలుస్తాడు తండ్రి. రాత్రింబవళ్లు కష్టపడి వారి ఎదుగుదలకు మెట్లు వేస్తాడు. అలాంటి నాన్న.. పిల్లలు ఎదుగుతున్న దశలో మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటివరకూ కోడి రెక్కల కింద దాక్కున పిల్లలు తల్లి దూరం కావడంతో గద్దలు ఎత్తుకెళ్లినట్లు అవుతుంది. ఇక ఇంట్లో ఆడపిల్లలు ఉంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. తండ్రి స్ఫూర్తితో అన్నీ ఒడిదుగులను ఎదుర్కొని జీవితంలో నిలబడినా ప్రత్యేకమైన రోజుల్లో అతను లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అయితే తన చెల్లి పెళ్లి వేడుకలో ఆ లోటు తీర్చేందుకు ప్రయత్నించిని ఓ యువకుడు అందరి కంటా కన్నీళ్లు తెప్పిస్తున్నాడు.
కొత్తగూడెం సింగరేణికి చెందిన ఓ వ్యక్తి ఐదేళ్ల క్రితం మృతిచెందారు. పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే ఆయమ ప్రాణాలు విడిచారు. అనంతరం కుటుంబ భారం అంతా కుమారుడిపై పడింది. దీంతో అతను కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. తండ్రి బాధ్యతలు తీసుకుని కుటుంబాన్ని ఓ స్థితికి తీసుకువచ్చాడు. మంచి యువకుడిని చూసి తన చెల్లికి సంబంధం కుదిర్చాడు. అయితే తన వివాహం చూసేందుకు తండ్రి లేడనే బాధ ఆ యువతిని వేధించింది. ఇది గమనించిన ఆమె సోదరుడు పెళ్లిలో తన తండ్రి లేడన్న లోటును భర్తీ చేసేందుకు ప్లాన్ చేశాడు. వేదికపై ఆమెకు సర్‌ప్ర్తెజ్ ఇచ్చాడు.
అచ్చం తన తండ్రి లాంటి విగ్రహాన్ని చేయించిన యువకుడు వివాహ వేదికపైకి తీసుకువచ్చి సోదరిని ఆశ్చర్యపరిచాడు. వధువు తల్లి, బంధువులు ఆయన ప్రతిరూపాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా తండ్రిని చూసిన ఆనందంతో నవ వధువు, ఆమె తల్లి భావోద్వేగానికి లోనయ్యారు. ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. తండ్రి విగ్రహం పాదాలపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వధువు వద్దకు వెళ్లిన వరుడు ఓదార్చే పయత్నం చేశాడు. తన దగ్గర ఉన్న కర్చీఫ్‌తో ఆమె కన్నీళ్లను తుడిచాడు. చెల్లి పెళ్లికి తానిచ్చే గిఫ్ట్ ఇదేనంటూ వధువు సోదరుడు అందరికీ చెప్పాడు. ఈ సన్నివేశాన్ని చూసిన బంధువులు సైతం కన్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారింది.