Share News

ఈ ‘దావత్‌’ తీరే వేరు...

ABN , Publish Date - Dec 29 , 2024 | 06:53 AM

మద్యం తాగి వాహనం నడిపితే ఫైన్‌ కట్టాలి... కొన్నిసార్లు జైలుకి వెళ్లాల్సి వస్తుంది కూడా. కానీ అక్కడ మాత్రం సీన్‌ మరోలా ఉంటుంది. ఆ ఊరిలో పొరపాటున ఎవరైనా మందుతాగి పట్టుబడితే ‘దావత్‌’ ఇవ్వాల్సిందే. అయితే అది అలాంటి ఇలాంటి దావత్‌ కాదండోయ్‌... ఊర్లో అందర్నీ పిలిచి కడుపునిండా నాన్‌వెజ్‌ బిర్యానీ పెట్టాలి. ఇంతకీ ఆ వింత ఊరు ఎక్కడంటారా...

ఈ ‘దావత్‌’ తీరే వేరు...

మద్యం తాగి వాహనం నడిపితే ఫైన్‌ కట్టాలి... కొన్నిసార్లు జైలుకి వెళ్లాల్సి వస్తుంది కూడా. కానీ అక్కడ మాత్రం సీన్‌ మరోలా ఉంటుంది. ఆ ఊరిలో పొరపాటున ఎవరైనా మందుతాగి పట్టుబడితే ‘దావత్‌’ ఇవ్వాల్సిందే. అయితే అది అలాంటి ఇలాంటి దావత్‌ కాదండోయ్‌... ఊర్లో అందర్నీ పిలిచి కడుపునిండా నాన్‌వెజ్‌ బిర్యానీ పెట్టాలి. ఇంతకీ ఆ వింత ఊరు ఎక్కడంటారా...

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో ‘ఖితిసితారా’ అనే గ్రామం ఉంది. గిరిజన జనాభా అధికంగా ఉండే ఈ ఊళ్లో ఒకప్పుడు మద్యం ఏరులై పారేదట. మద్యం మత్తులో గృహహింస, హత్యలు, దోపిడీలు రోజురోజుకి పెరిగిపోతూ ఉండేవి. దాంతో గ్రామ పెద్దలంతా కూర్చుని, ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. మద్యపానాన్ని పూర్తిగా రూపుమాపాలని గ్రామపంచాయితీ పరిధిలో కొన్ని కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు.


గ్రామంలో ఎవరైనా సరే కాస్త మందు కొట్టి దొరికితే స్పాట్‌లోనే 2వేల రూపాయలు జరిమానా కట్టాలి. అదే ఫుల్‌గా తాగి అల్లరి చేేస్త మాత్రం 5 వేల రూపాయలు జరిమానా చెల్లించాల్సిందే. అంతటితో అయిపోయిందనుకు నేరు... ఆ తర్వాతే అసలు కథ మొదలవు తుంది. జరిమానా కట్టిన నెల రోజుల్లోపు ఊరి మొత్తానికి (సుమారు 800 మంది జనాభా) దావత్‌ ఇవ్వాలి. అంటే... సుమారు పాతికవేల రూపాయల దాకా ఖర్చవుతుంది. దావత్‌ తేదీకి ముందురోజే ఇంటింటికి వెళ్లి అందరినీ స్వయంగా ఆహ్వానించాలి. అందరూ తృప్తిగా తిన్నారా లేదా అని దగ్గరుండి మరీ చూసుకోవాలి.


ఎవరు ఎంత తింటే అంత వడ్డించాలి. మర్యాదల విషయంలో ఏమాత్రం తేడా రాకూడదు. ‘ఇదంతా నా వల్ల కాదని’ ఎగ్గొట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తే, గ్రామ పెద్దలు నిబంధనలకు అనుగుణంగా అంత మొత్తాన్ని ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే... నిబంధనల్ని ఉల్లంఘించి ఎవరైనా మందు తాగితే జేబుకు చిల్లు పడాల్సిందే. అందుకే తాగటం కన్నా... ఆ తర్వాత ఇచ్చే దావత్‌ ఖర్చుకు భయపడి ‘ఖితిసితారా’లో మగాళ్లు మందు జోలికి వెళ్లడమే మానేశారట. ఈ కఠిన నిబంధనలతో ఆ గ్రామంలో భార్యాభర్తల గొడవలు, హత్యలు, తగాదాలు పూర్తిగా తగ్గడంతో పాటు ఎట్టకేలకు ప్రశాంత వాతా వరణం నెలకొందట. చూస్తుంటే ఈ దావత్‌ కట్టుబాటు ఏదో బాగానే ఉన్నట్టుంది కదూ...!

Updated Date - Dec 29 , 2024 | 06:53 AM