Share News

ద్రాక్షపండ్లు తింటారు.. సోఫాలపై ఎగురుతారు...

ABN , Publish Date - Dec 29 , 2024 | 09:01 AM

క్యాలెండర్‌ మార్చే రోజు వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, న్యూ ఇయర్‌ను స్వాగతిస్తున్న సమయాన... అంతటా ఒకేరకం వేడుకలుండవు. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకుంటారు. ఆ ఉత్సవాల్లో ఆసక్తిరేకిత్తించేవి ఏమిటంటే...

ద్రాక్షపండ్లు తింటారు.. సోఫాలపై ఎగురుతారు...

క్యాలెండర్‌ మార్చే రోజు వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, న్యూ ఇయర్‌ను స్వాగతిస్తున్న సమయాన... అంతటా ఒకేరకం వేడుకలుండవు. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకుంటారు. ఆ ఉత్సవాల్లో ఆసక్తిరేకిత్తించేవి ఏమిటంటే...

స్పెయిన్‌లో డిసెంబర్‌ 31 అర్థరాత్రి గడియారం పన్నెండు గంటలు కొడుతుంటే... అక్కడి ప్రజలు పన్నెండు ద్రాక్షపండ్లను తింటారు. రాబోయే సంవత్సరం శుభం కలగాలని, ఒక్కో పండు ఒక్కో నెలలా భావించి తింటారు. ఇంకో విచిత్రమైన విషయమేంటంటే.. ఆ రోజు ఎరుపు రంగు లోదుస్తులు ధరిస్తారట. వాటి కోసం ప్రత్యేకంగా షాపింగ్‌ కూడా చేస్తారట. ఎర్రటి అండర్‌వేర్‌ అదృష్టానికి సూచికగా నమ్ముతారు మరి!


గ్రీకులైతే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే క్షణంలో ఒక్కసారిగా దానిమ్మ పండ్లను పగలగొడతారు. అలా చేస్తే మంచి జరుగుతుందని వీరి నమ్మకం. ఇక జనవరి 1న ఉదయం ఇంట్లో పిల్లలు నిద్ర లేవగానే ఉల్లిపాయతో తలమీద కొడతారు. ఈ చర్య వల్ల పిల్లలకు ఆరోగ్యం, తెలివి కలుగుతుందని విశ్వసిస్తారు.

కరేబియన్‌ దేశాల్లోని ‘హైతీ’కి న్యూ ఇయర్‌ రోజునే ఇండిపెండెన్స్‌డే కూడా. దాంతో వారికి ఒకింత ప్రత్యేకం. బానిసత్వం అంతరించినందుకు స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ కొత్త సంవత్సర వేడుకల్ని జరుపుతారు. గుమ్మడి కాయ సూప్‌ తాగుతారు. స్వేచ్ఛకు ప్రతిరూపంగా ఈ సూప్‌ తాగుతారట.


ఫిలిప్పీన్స్‌లో పిల్లలు డిసెంబర్‌ 30 అర్థరాత్రి లేదా జనవరి 1న ఉదయం నిద్ర లేస్తూనే పైకి ఎగురు తారు. ఇలా ఉన్నచోటనే ఎగిరితే మంచి భవిష్యత్‌ ఉంటుందని నమ్ముతారు. వీరిలాగే డెన్మార్క్‌ ప్రజలు సోఫాల మీద ఎగురుతారు. దాన్ని అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. బ్రెజిలియన్లు అయితే సముద్రంలో అలమీద పైకి ఎగురుతారు. ఇలా ఏడు సార్లు చేస్తే అంతా శుభమే జరుగుతుందనేది వీరి నమ్మకం.

book5.2.jpg

స్కాట్లాండ్‌ దేశీయులు డిసెంబర్‌ 31 అర్థరాత్రి 1788లో రాబర్ట్‌ బర్న్‌ రాసిన కవితను చప్పట్లు కొడుతూ వీధుల్లో పాడుతారు. ఆ సమయంలో ఇంట్లోకి వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే వ్యక్తికి పొడవాటి నల్లటి జుట్టు ఉంటే... ఏడాదంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. అర్థరాత్రి పూట ఇతరుల ఇంటికి బొగ్గు, బీర్‌, ఉప్పు తీసుకుని వెళ్లి శుభాకాంక్షలు చెప్పటం పరిపాటి. ఆ రోజు రాత్రి వేలమంది టార్చ్‌ లైట్లతో వీధుల్లోకి వచ్చి కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతారు.


‘డిన్నర్‌ ఫర్‌ వన్‌ ఆన్‌ ఇయర్‌’ అనే బ్రిటీష్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ కామెడీని కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేప్పుడు... జర్మన్లతో పాటు స్విట్జర్లాండ్‌, ఆస్ర్టియా దేశీయులు చూస్తారు. డెన్మార్క్‌ ప్రజలయితే తమ కుటుంబీకులు, స్నేహితుల ఇళ్లు, వాకిళ్ల దగ్గరకు వెళ్లి పాత గ్లాసులు, ప్లేట్లను పగలగొడతారు. ఇలా చేస్తే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. పాత సంవత్సరాన్ని కిందకు తోసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికినట్లుగా.. దక్షిణాఫ్రికాలో ఇంట్లోని కిటికీలోంచి సోఫాలను కిందకు విసిరేస్తారట. ఇలా ప్రపంచవ్యాప్తంగా విభిన్న రకాలుగా గత ఏడాదికి వీడ్కోలు చెబుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు.

Updated Date - Dec 29 , 2024 | 09:01 AM