క్యాలెండర్ మారుతోంది!
ABN , Publish Date - Dec 29 , 2024 | 08:34 AM
మరో మూడు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. అంటే క్యాలెండర్ మారుతోందన్నమాట. ఈ ఏడాది నెటిజన్లకు ఎన్నో జ్ఞాపకాలను అందించింది. అయితే ప్రపంచం మొత్తం సెల్‌ఫోన్‌లో కనిపిస్తుంటే... జనాలు ఎక్కువగా దేనికోసం సెర్చ్ చేశారనే ఆసక్తి సహజంగానే అందరిలో ఉంటుంది.

మరో మూడు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. అంటే క్యాలెండర్ మారుతోందన్నమాట. ఈ ఏడాది నెటిజన్లకు ఎన్నో జ్ఞాపకాలను అందించింది. అయితే ప్రపంచం మొత్తం సెల్‌ఫోన్‌లో కనిపిస్తుంటే... జనాలు ఎక్కువగా దేనికోసం సెర్చ్ చేశారనే ఆసక్తి సహజంగానే అందరిలో ఉంటుంది. కొంతమంది తమకు నచ్చిన వ్యక్తి గురించి వెదికితే, మరికొంత మంది నచ్చిన ప్రదేశం గురించి వెదికారు. మొత్తంగా నెటిజన్లు ఈ ఏడాది గూగుల్‌లో శోధించిన వాటిల్లో (కొన్ని విభాగాల్లో) టాప్ 5 స్థానాల జాబితా ఇలా ఉంది...
గాజా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపిన తరువాత ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ అనే పదం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ పదబంధం అర్థాన్ని తెలుసుకోవడానికి చాలామంది గూగుల్‌లో శోధించారు. 2024లో ఎక్కువ మంది అర్థం కోసం వెతికిన పదంగా ఇది నంబర్‌వన్ స్థానంలో నిలిచింది.
పాలస్తీనా క్యాంపు దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో రూపొందించిన ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ చిత్రం బాగా పాపులర్ అయింది. ఆ తరువాతే నెటిజన్లు గూగుల్‌లో దాని గురించి వెదికారు. దీని తరువాత స్థానంలో ‘అకాయ్’ అనే పదం నిలిచింది. ఈ పదం అర్థం తెలుసుకోవడానికి ఎక్కువ మంది గూగుల్‌ను ఆశ్రయించారు. స్టార్ క్రికెటర్ విరాట్‌కోహ్లీ కుమారుడి పేరు ఇది. ఈ పేరు ఆయన బయటకు వెల్లడించగానే అర్థం తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు. ఫిబ్రవరిలో కుమారుడు పుట్టగానే కోహ్లీ దంపతులు ఈ పేరును ప్రకటించారు. అప్పటి నుంచి హిందీ, టర్కీ మూలాలు ఉన్న ఈ పేరు గూగుల్ సెర్చ్‌లో సెన్సేషన్‌గా మారింది. ఇక మూడో స్థానంలో ‘సర్వైకల్ క్యాన్సర్’ అనే పదం నిలిచింది. దీని ద్వారా మహిళలు తమ ఆరోగ్యం పట్ల మరింత చైతన్యవంతులు అవుతున్నట్టు నిర్ధారణ అయ్యింది. ఆ తరువాత స్థానాల్లో ‘తవాయిఫ్’, ‘డెమూర్’ అనే పదాలు వున్నాయి. ‘తవాయిఫ్’ అంటే సంప్రదాయ నృత్యాలు చేసే మహిళలు అని అర్థం. ప్రెస్‌మీట్లలో, ఇతర సాహిత్య సంభాషణలో ‘డెమూర్’ అనే పదం తరచుగా వినపడుతుండటంతో దాని అర్థం కోసం వెతికారు. నిరాడంబరంగా ఉంటూ మర్యాదగా ప్రవర్తించే వ్యక్తిని ‘డెమూర్’ అంటారు.
ఆటలపై ఆసక్తి
ఈ ఏడాది స్పోర్ట్స్ గురించి నెటిజన్లు బాగానే వెతికారు. మనదేశంలో ‘ఐపీఎల్’కు ఉన్న పాపులారిటీ తెలిసిందే. ఎప్పటిలాగే ఇండియన్ ప్రీమియర్‌లీగ్ (ఐపీఎల్) గూగుల్ సెర్చ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో ఎక్కువ సెర్చ్ చేసిన ఆటగా ఇది రికార్డుల్లోకి ఎక్కింది. ఆ తరువాత స్థానంలో ‘టీ20 వరల్డ్ కప్’ నిలిచింది. ఈ క్రికెట్ టోర్నమెంట్ గురించి ఎక్కువ మంది సెర్చ్ చేయడంతో రెండో స్థానం దక్కించుకుంది. ఇక మూడోస్థానంలో పారిస్‌లో జరిగిన ‘ఒలింపిక్’ క్రీడలు నిలిచాయి. ఈ క్రీడల గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తి చూపారు. భారతీయ అథ్లెట్లు, వాళ్లు సాధించిన మెడల్స్ గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది గూగుల్‌ను ఆశ్రయించారు. నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా ‘ప్రో కబడ్డీ లీగ్’, ‘ఇండియన్ సూపర్ లీగ్’ నిలిచాయి.
వీరిదే హవా...
గూగుల్‌లో ఏ నటీనటులను ఎక్కువగా వెతికారు? వరల్డ్ టాప్ 10 సెర్చ్ లిస్ట్‌లో ఏ నటులు ఉన్నారు? అంటే ‘కేట్ విలియమ్స్’ అగ్రస్థానంలో నిలిచారు. స్టాండప్ కమెడియన్‌గా, నటుడిగా కేట్ విలియమ్స్‌కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆ జాబితాలో రెండో స్థానంలో ఒక తెలుగు హీరో పేరు ఉందంటే ఆయన ఛరిష్మా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆయనే పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన ఛరిష్మా మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు వెతికిన నటీనటుల జాబితాలో పవన్‌కల్యాణ్ రెండో స్థానంలో నిలిచారు. ఇక మూడో స్థానంలో అమెరికన్ నటుడు ఆడమ్ బ్రాడీ ఉన్నారు. నాలుగోస్థానంలో ఎల్లా పర్నెల్ ్త, ఐదో స్థానంలో భారతీయ నటి హీనాఖాన్ నిలిచారు. హీనాఖాన్ హిందీ, పంజాబీ సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టెలివిజన్ నటిగా ఆమె గుర్తింపు సాధించారు.
‘సెంట్రల్ పార్క్’ టాప్...
ఏదైనా ప్రదేశం ఎక్కడుందో తెలుసుకోవాలంటే ‘గూగుల్ మ్యాప్’లో సెర్చ్ చేస్తాం. మరి ఈ ఏడాది గూగుల్ మ్యాప్‌లో ఎక్కువమంది దేని గురించి సెర్చ్ చేశారో తెలుసా?... న్యూయార్క్‌లో ఉన్న ‘సెంట్రల్ పార్కు’ గురించి. 843 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కులో సినిమా షూటింగ్‌లు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. నెటిజన్లు ఈ పార్కు ఎక్కుడుందో మ్యాప్‌లో ఎక్కువగా శోధించారు. తరువాత స్థానంలో ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో ఉన్న ‘రిజల్ పార్కు’ ఉంది. ఫిలిప్పీన్స్‌లో ఉన్న అతి పెద్ద అర్బన్ పార్కు ఇది. ఆ తరువాత స్థానాల్లో జపాన్‌లోని ఒహోరి పార్కు, బార్సిలోనాలోని పార్క్ గెల్ నిలిచాయి.
‘నియర్ మీ’ కేటగిరీలో...
గూగుల్ ఇయర్ సెర్చ్ రిపోర్టు 2024 ప్రకారం ఇండియాలో ఎక్కువ సెర్చ్ చేసిన టాపిక్‌గా ‘ఎయిర్ క్వాలిటీ’ నిలిచింది. ‘నియర్ మీ’ కేటగిరీలో ఈ పదం అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడం వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బంది తెలిసిందే. ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గిపోవడంతో మిగతా నగరాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్న ఆసక్తి సహజంగానే నెటిజన్లలో పెరిగింది. దాంతో తమ స్మార్ట్‌ఫోన్లలో గాలి నాణ్యతకు సంబంధించి రియల్ టైమ్ అప్‌డేట్స్ తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అందుకే గూగుల్ సెర్చ్ ‘ఎయిర్ క్వాలిటీ’ టాపిక్ అగ్రస్థానంలో నిలిచింది. ‘నియర్ మీ’ కేటగిరీలో రెండో స్థానంలో ‘ఓనమ్ సంధ్య’ నిలిచింది. కేరళలో జరుపుకొనే సంప్రదాయ పండుగ ఓనమ్. ‘ఓనమ్ సంధ్య’ అంటే ఓనమ్ సాయంత్రం అని అర్థం. ఓనమ్ సాయంత్రం రోజున సంప్రదాయ విందులు, ప్రదర్శనలతో సందడి వాతావరణం ఉంటుంది. ఇక మూడోస్థానంలో ‘రామ్‌మందిర్ నియర్ మీ’ నిలిచింది. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం జరగడంతో నెటిజన్లు తమ దగ్గర ఉన్న రామాలయం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. నాలుగు, ఐదో స్థానాల్లో ‘స్పోర్ట్స్ బార్’, ‘బెస్ట్ బేకరీ నియర్ మీ’ ఉన్నాయి.
ఎక్కడికి వెళ్లాలి?
ట్రావెల్ ప్లాన్ చేసుకునే ముందు ఎక్కడికి వెళ్లాలో గూగుల్‌లో వెతకడం అందరూ చేసేదే. మరి ఈ ఏడాదిలో ఏయే పర్యాటక ప్రదేశాల గురించి వెతికారు? అంటే... ఆశ్చర్యంగా ‘అజర్‌బైజాన్’ నెటిజన్ల శోధనతో అగ్రస్థానంలో నిలిచింది. వీసా సులభంగా రావడం, తక్కువ ఖర్చు, గుర్రపు స్వారీ, జీప్ సఫారీ, ఐకానిక్ ఫేమ్ టవర్స్‌తో పాటు చారిత్రక ప్రదేశం కావడంతో ఎక్కువ మంది అజర్‌బైజాన్ వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ దేశ అతిథ్యంతో పర్యాటకులు మధురానుభూతిని సొంతం చేసుకుంటున్నారు. అందుకే ఈ దేశం నెటిజన్ల సెర్చ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. అజర్‌బైజాన్ తరువాత నెటిజన్లు ఎక్కువగా వెదికిన దేశం ‘బాలి’ (ఇండోనేషియా).
బెస్ట్ హానీమూన్ స్పాట్‌గా గుర్తింపు పొందిన ఈ దేశంలో ఎగ్జయిట్‌మెంట్‌కు కొదువుండదు. ‘దేవతల ద్వీపం’గా పిలిచే ఈ దేశాన్ని సందర్శించే పర్యాటకుల్లో భారతీయుల సంఖ్య ఎక్కువే ఉంటోంది. ప్రకృతి అద్భుతాలకు కొలువైన ఈ దేశాన్ని సందర్శించేందుకు నెటిజన్లు గూగుల్‌లో తెగ సెర్చ్ చేశారు. మూడో స్థానంలో హిమాచల్ ప్రదేశ్‌లోని ‘మనాలి’ ఉంది. ఈ ప్రదేశాన్ని ‘భూతల స్వర్గం’గా పేర్కొంటారు. పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ వంటివి సాహసప్రియుల మదిని దోచేస్తాయి. న్యూఇయర్, క్రిస్‌మస్ వేడుకల కోసం చాలామంది మనాలి ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. అందుకే నెటిజన్లు విదేశాలతో పాటు స్వదేశంలోని మనాలి గురించి తెగ వెదికారు. మంచు దుప్పటి కప్పుకున్నట్టుగా ఉండే ఈ ప్రాంతం పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తుంది. నాలుగో స్థానంలో కజకిస్థాన్ ఉంటే, ఐదో స్థానంలో రాజసం ఉట్టిపడే జైపూర్ ఉంది.
వార్తల్లో వ్యక్తులు...
గూగుల్‌లో ఈ ఏడాది వీరి గురించి ఎక్కువగా వెదికారు.
వినేష్ పొగట్: ఈ ఏడాది నెటిజన్ల సెర్చ్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచారు వినేష్ పొగట్. పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ విభాగంలో ఫైనల్‌కు చేరిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా ఆమె రికార్డు నెలకొల్పారు. 50 కిలోల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో ఫైనల్‌లో పాల్గొనాల్సిన ఆమె కేవలం 100 గ్రాముల బరువు అదనంగా ఉన్నారన్న కారణంతో డిస్‌క్వాలిఫై అయ్యారు. దీంతో దేశం మొత్తం ఆమెకు మద్దతుగా నిలిచింది. ఆ తరువాత రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించి హర్యానా ఎన్నికల్లో ఎంఎల్‌ఏ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు.
నితీష్ కుమార్: రాజకీయ పొత్తులను పదే పదే మార్చడం ద్వారా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఎన్‌డీఏను వదిలివెళ్లిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ లోకసభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు తిరిగి ఎన్‌డీఏ గూటికి చేరారు. ‘ఆబ్‌కీబార్ 400 పార్’ నినాదంతో బరిలో దిగిన బీజేపీ ఆ స్థాయిలో సీట్లు గెలవలేకపోయింది. దాంతో నితీష్ మళ్లీ పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. ఈ నేతపై సోషల్‌మీడియాలో వచ్చే ట్రోల్స్‌కు కొదువే లేదు. నితీష్ గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేయడంతో రెండో స్థానంలో నిలిచారు.
చిరాగ్ పాశ్వాన్ : మోదీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. హాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. చిరాగ్ పాశ్వాన్ తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ లోక్‌జన్‌శక్తి పార్టీ అధ్యక్షుడు. చిరాగ్ పాశ్వాన్ తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. అయితే రాజకీయాల్లోకి రాకముందు బాలీవుడ్‌లో నటుడిగా గుర్తింపు పొందారు. మోదీ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే సందేహాలున్న సమయంలో నెటిజన్లు ఆయన గురించి గూగుల్‌లో తెగ శోధించారు.
హార్దిక్‌పాండ్యా : వ్యక్తిగత, వృత్తిపరమైన వార్తలతో మోస్ట్ సెర్చ్‌డ్ పర్సన్‌గా నాలుగోస్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ప్రదర్శన బాగాలేక ఇబ్బంది పడ్డారు. అయితే టీ20 వరల్డ్‌కప్‌లో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్‌తో వచ్చారు. భార్య నటాశా శ్టాంకోవిక్‌తో విడాకులు తీసుకున్నారు. ఈ వార్తల వల్ల నెటిజన్లు హార్దిక్ గురించి తెగ వెదికారు.
పవన్ కల్యాణ్ : మనదేశంలో నెటిజన్లు సెర్చ్ చేసిన జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ 2014లో జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది ఏపీ రాజకీయాల్లో కీలకవ్యక్తిగా నిలిచారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన సమయం చూసుకుని నిర్మాణ దశలో ఉన్న సినిమాలు పూర్తి చేస్తానని ప్రకటించారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ జనసేనానిని నెటిజన్లు తెగ ఫాలో అయ్యారు.
వెబ్‌సీరిస్‌ల హవా...
హీరామండి : స్వాతంత్య్రం రాకముందు లాహోర్‌లోని ఒక ప్రాంతం పేరు ఇది. ఇక్కడ వేశ్యాగృహాలు అధికం. సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన ఈ వెబ్‌సీరిస్ విజువల్ మాస్టర్‌పీస్‌గా నిలిచింది. ఎక్కువ మంది శోధించిన వెబ్‌సీరిస్‌గా అగ్రస్థానంలో నిలిచింది. మనీషా కొయిరాలా, సోనాక్షిసిన్హా, అదితిరావుహైదరీ, రిచాచద్దా వంటి తారలు నటించిన ‘హీరామండి’ వెబ్‌సీరిస్ ప్రేక్షకుల మదిని దోచింది. ‘మీర్జాపూర్ 3’ రెండో స్థానంలో, ఆ తరువాత స్థానంలో ‘లాస్ట్ ఆఫ్ అస్’, నాలుగో స్థానంలో ‘బిగ్ బాస్ 17’ నిలిస్తే, ఐదోస్థానంలో కామెడీ డ్రామా ‘పంచాయత్’ ఉంది.
- సండే డెస్క్