నిడుపుగాకరకాయ కూర
ABN , Publish Date - Dec 29 , 2024 | 10:00 AM
పాంచాలీపరిణయం 1560లలో కాకమానిమూర్తి కవి చేసిన అద్భుత రచన. ప్రతీ పదంలోనూ, ప్రతీ పద్యంలోనూ చమత్కారాన్ని నింపి రచన చేయటం తన ఉద్దేశంగా చెప్పుకున్నాడీ కవి. దృపదుడిచ్చిన విందు వంటకాల మెనూలో ‘నిడుపు గాకరకాయ కూర’ కూడా ఉంది.

ఉప్పుపులుసుఁబట్టి యొక్కింత
మిరియంబు/
ముట్టి తిరుఁగబోఁత చుట్టినట్టి
నేత వేఁచినట్టి నిడుపుగాకరకాయ/
వరుసనిడియె నొక్క వంటలక్క
పాంచాలీపరిణయం 1560లలో కాకమానిమూర్తి కవి చేసిన అద్భుత రచన. ప్రతీ పదంలోనూ, ప్రతీ పద్యంలోనూ చమత్కారాన్ని నింపి రచన చేయటం తన ఉద్దేశంగా చెప్పుకున్నాడీ కవి. దృపదుడిచ్చిన విందు వంటకాల మెనూలో ‘నిడుపు గాకరకాయ కూర’ కూడా ఉంది. గుత్తికాకర కాయకూరని ఉల్లి ముక్కలు, కారం కూరి నూనెతో వేగించి వండుతారు. కానీ, మూర్తికవి లోపల ఏదీ కూరకుండానే కాకర కాయల కూర చేసుకునే విధానాన్ని ఇందులో వివరించాడు. మూర్తికవి కన్నా ఒక తరం తరువాతి వాడైన కుందవరపు కవి చౌడప్ప ‘‘వేయాఱు వగల కూరలు/ గాయ లనేకములు ధాత్రిఁగల వందులలో/ నాయకములురా కాఁకర/ కాయలు మఱి కుందవరపు కవి చౌడప్పా!’’ అని కాకర కాయల్ని కాయగూరలకు రారాజుగా కీర్తించాడు.
కక్కర అంటే గరుకుగాఉంటుంది కాబట్టి ఇది కాకర అయ్యింది. కాకరాకులు విచ్చుకున్న అరచెయ్యి (కరము)లా ఉండటం కూడా కా‘కర’ అనే పేరుకి ఒక కారణం కావచ్చు. కాకరకాయలో పొడుగు, పొట్టి రెండు రకాలూ ఉన్నాయి. మూర్తికవి రాజభోజనంలో నిడుపు (పొడుగు) కాకరనే ఎంచుకున్నాడు. పొడుగు కాకరకాయలు చేదు తక్కువ. జీర్ణశక్తిని పెంచుతాయి. పొట్టికాకరలో నీరు తక్కువ. చేదు ఎక్కువ. అందుకని పొట్టికాకర ముక్కలకు ఉప్పు రాసి ఎండబెట్టి వరుగులు చేసుకుని అవసరమైనప్పుడు ఉడికించి కూర తయారు చేసుకునే వాళ్లు. చవగ్గా ఉన్నప్పుడు వరుగులు చేసుకుంటే దొరకనప్పుడు వండుకోవటానికి వీలవుతుంది. పొట్టికాకర వేడి చేస్తుంది. ఆ చేదు తగ్గటం కోసం ఎక్కువ పులుపు, ఉప్పు, కారాలు కలపవలసి వస్తుంది. అందువలన మరింత వేడి పెరుగుతుంది.
నిడుపుగాకర కూర ఇలా ...
గింజపట్టని లేత కాకరకాయల్ని శుభ్రపరచి, నిలువుగా నాలుగు పక్షాలు కోయాలి. చిక్కని చింతపండు గుజ్జు తీసుకుని అందులో మిరియాలపొడి, తగినంత ఉప్పు కలిపి ఈ కాకరకాయలకి లోపలా బైటా బాగా పట్టించాలి. ఇప్పుడు ఒక భాండీలో కొద్దిగా నెయ్యి వేసి తాలింపు గింజలు వేగించి ఆ నేతిలో ఈ కాయల్ని వేసి మూతపెట్టి సన్నసెగన బాగా మగ్గనివ్వాలి. ఇలా వండిన నిడుపు కాకరకాయల్ని విస్తట్లో వరుసగా పేర్చి వడ్డిస్తోందట ఓ వంటలక్క.
కాకరకాయని ‘కొరివి కారం’తో కలిపి వండటం కన్నా ఇలా చింతపండు మిరియాల పొడితో కలిపి వండటమే ఆరోగ్యదాయకం. ఆయుర్వేద గ్రంథాలు కాకరని నెయ్యి, ఆవాలు, దోస, చింతపండులతో కలిపి వండుకోవటం వలన ఎలాంటి దోషాలూ కలిగించకుండా ఆరోగ్యదాయకంగా ఉంటుందని పేర్కొన్నాయి.
కాకరకాయకి చొచ్చుకుపోయి త్వరగా శరీరం అంతా వ్యాపించే గుణం ఉంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది బిట్టర్ టానిక్. బలాన్నిచ్చే చేదు ద్రవ్యం. విషదోషాల్ని హరిస్తుంది. కుక్కకాటు విషానికి ఇది విరుగుడు. నోట్లో నీళ్ళూరటం, అజీర్తి, ఆయాసం, ఉబ్బసం, దగ్గు, మొలలవ్యాధి, కడుపులో నులిపురుగులు, చర్మ వ్యాధులన్నింటి మీదా పనిచేస్తుంది.జ్వరాలలో తినదగినది. రక్తదోషాలను హరిస్తుంది. పుండు త్వరగా మాడేలా చేస్తుంది.
లేతగా ఉండే కాకరకాయలే కూర వండు కోవటానికి శ్రేష్ఠం. లేతకాకరలో పీచు తేలికగా వంటబట్టేదిగా ఉంటుంది. బీర, పొట్ల, సొర లాంటి కాయల్లో ముదిరేకొద్దీ పీచు పెరుగు తుంది. కానీ, కాకర ముదిరినా, పీచు పెరగదు. ఏరుకోనిచ్చే చోటే కాకరకాయలు కొనండి.
‘మొమొర్డికా చరాంటియా’ కాకర శాస్త్రీయ నామం. కాకర గుజ్జుని ‘మొమార్డికా’ టాబ్లెట్ల పేరుతో కొన్నిదేశాల్లో అమ్ముతున్నారు. షుగరు వ్యాధిని, స్థూలకాయాన్ని అదుపు చేస్తాయని!
- డా. జి వి పూర్ణచందు, 94401 72642