Aral Sea: 50 ఏళ్లలో మాయమైపోయిన అరల్ సముద్రం.. కారణమేంటో తెలిస్తే నివ్వెరపోవాల్సిందే..!

ABN , First Publish Date - 2024-02-09T18:48:54+05:30 IST

గ్లోబల్ వార్మింగ్ దుష్పరిణామాలు, మానవ ఇంజినీరింగ్ విధానాల కారణంగా పదేళ్ల క్రితం ఓ భారీ సరస్సు మాయమైనట్టు తాజాగా నాసా పరిశోధకులు కనుగొన్నారు.

Aral Sea: 50 ఏళ్లలో మాయమైపోయిన అరల్ సముద్రం.. కారణమేంటో తెలిస్తే నివ్వెరపోవాల్సిందే..!

అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం కారణంగా ప్రకృతికి కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లోనూ ఉష్ణోగ్రతలు (Temperature) విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా గత జనవరి రికార్డుల్లోకి ఎక్కింది. జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సగటున 1.5 డిగ్రీల మేర పెరిగాయి. గ్లోబల్ వార్మింగ్ (Global Warming) దుష్పరిణామాలు, మానవ ఇంజినీరింగ్ విధానాల కారణంగా పదేళ్ల క్రితం ఓ భారీ సరస్సు మాయమైనట్టు తాజాగా వాతావరణ పరిశోధకులు కనుగొన్నారు.

కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మధ్య ఉన్న భూభాగం మొత్తం నీటితో నిండి ఉంటుంది. దీనిని ``అరల్ సముద్రం`` (Aral Sea) అని పిలుస్తారు. 68,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన అరల్ సముద్రం ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద లోతట్టు ప్రాంతం. 1960వ దశకం నుంచి కుచించుకుపోతూ వచ్చిన ఈ సరస్సు 2010 నాటికి పూర్తిగా ఆవిరైపోయినట్టు పరిశోధకులు గుర్తించారు. నీటి పారుదల ప్రాజెక్టుల కోసం నీటిని మళ్లించడంతో ఈ సరస్సు తరిగిపోవడం మొదలైంది. 20 లక్షల సంవత్సరాల క్రితం సహజంగా ఏర్పడిన ఈ సరస్సు.. ఇప్పుడు పూర్తిగా అంతర్థానమైందని నాసాకు (NASA) చెందిన ఎర్త్ అబ్జర్వేటరీ తెలిపింది.

ఈ ప్రాంతంలో రెండు ప్రధాన నదులైన సిర్ దర్యా, అము దర్యా అనే నదుల నీళ్లు కొండలు, గుట్టలు దాటి అరల్ సముద్రంలో కలిసేవి. అయితే 1960వ దశకంలో సోవియట్ యూనియన్ భారీ నీటి పారుదల ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టింది. ఆయా నదుల నుంచి నీరు అరల్ సముద్రంలోకి వెళ్లకుండా ఆనకట్టలు కట్టి కజికిస్థాన్,ఉజ్బకిస్థాన్, తుర్కుమెనిస్థాన్‌ మధ్య ఉన్న ప్రాంతానికి తరలించింది. దాంతో ఆ ప్రాంతం సస్యశ్యామలంగా మారింది. పంటలు పండాయి. ఆ క్రమంలో ఆరల్ సీ క్రమంగా ఎండిపోవడం ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడ నీటి జాడే లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Updated Date - 2024-02-09T18:48:56+05:30 IST