Share News

Australia: భార్యను కొట్టిచంపి.. డస్ట్‌బిన్‌లో పడేసి..

ABN , Publish Date - Mar 11 , 2024 | 08:51 AM

పన్నెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. దారుణంగా కొట్టిచంపాడు! పరాయి దేశంలో.. రోడ్డు పక్కన ఉన్న చెత్త కుండీలో అనాథ శవంలా పారేసి.. నాలుగేళ్ల కుమారుణ్ని తీసుకుని స్వదేశానికి పారిపోయి వచ్చాడు!!

Australia: భార్యను కొట్టిచంపి.. డస్ట్‌బిన్‌లో పడేసి..

  • ఆస్ట్రేలియాలో హైదరాబాదీ ఘాతుకం

  • ఏమీ ఎరుగనట్టు హైదరాబాద్‌కు రాక

  • నాలుగేళ్ల కొడుకును అత్తమామలకు

  • అప్పగించి.. క్షమాపణలు చెప్పి పరార్‌

  • 12 ఏళ్ల క్రితం కులాంతర వివాహం

  • ఆస్ట్రేలియాలో స్థిరపడిన దంపతులు

  • కొన్నాళ్లుగా మనస్పర్థలతో ఘోరం

  • ఆస్ట్రేలియాలో హైదరాబాదీ ఘాతుకం

  • ఏమీ ఎరుగనట్టు హైదరాబాద్‌కు రాక

ఏఎస్‌రావునగర్‌/హైదరాబాద్‌ సిటీ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): పన్నెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. దారుణంగా కొట్టిచంపాడు! పరాయి దేశంలో.. రోడ్డు పక్కన ఉన్న చెత్త కుండీలో అనాథ శవంలా పారేసి.. నాలుగేళ్ల కుమారుణ్ని తీసుకుని స్వదేశానికి పారిపోయి వచ్చాడు!! ఆ పిల్లాణ్ని నేరుగా అత్తారింటికి తీసుకెళ్లి, వారికి అప్పగించి, భార్యను చంపిన విషయం చెప్పి.. క్షమాపణలు చెప్పి పరారైపోయాడు! అల్లుడు చెప్పిన పిడుగులాంటి వార్త విని కుప్పకూలిపోయారా తల్లిదండ్రులు. కుమార్తె మృతదేహం వేల కిలోమీటర్ల ఆవల.. రోడ్డుపక్కన దిక్కులేని స్థితిలో డస్ట్‌బిన్‌లో పడి ఉన్న విషయాన్ని తల్చుకుని కుమిలికుమిలి రోదిస్తున్నారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ బృందావన్‌ కాలనీలో నివాసం ఉండే మాదగాని బాల్‌శెట్టిగౌడ్‌, మాధవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు చైతన్య భారతి అలియాస్‌ శ్వేత(36), ఏఎస్‌రావునగర్‌ ఈసీఐఎల్‌ ప్రాంతానికి చెందిన వరికుప్పల అశోక్‌రాజ్‌ ఒకే కాలేజీలో చదివేవారు. డిగ్రీలో ఉండగా ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా విషయం పెద్దలకు చెప్పి ఒప్పించి, 2012లో వివాహం చేసుకున్నారు. అనంతరం ఉన్నత చదువుల నిమిత్తం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు వెళ్లారు. శ్వేత ఎం.ఫార్మసీ, అశోక్‌రాజ్‌ ఎంబీఏ పూర్తిచేశారు.

ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. ఆస్ట్రేలియా పౌరసత్వం కూడా పొందారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఆర్య ఉన్నాడు. అయితే.. ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. తరచూ ఇద్దరూ గొడవలు పడుతున్నారు. ఈ విషయం తెలిసిన శ్వేత తల్లిదండ్రులు.. ఇద్దరికీ నచ్చజెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 7న.. తెల్లవారుజామున 4 గంటల సమయంలో అశోక్‌రాజ్‌ తన కుమారుడు ఆర్యతో కలిసి అత్తవారింటికి వచ్చాడు. మనవణ్ని తీసుకుని అల్లుడు ఒక్కడే రావడంతో.. శ్వేత తల్లిదండ్రులు తమ కుమార్తె గురించి అడిగారు. దీనికి అతడు.. ుూశ్వేతకు నాకు గొడవ జరిగింది. తోపులాటలో శ్వేత తల గోడకు తగిలి చనిపోయింది. జరిగిందానికి నన్ను క్షమించండి. ఇకపై బాబును మీరే చూసుకోండి్‌్‌ అని చెప్పి వారు ఆ షాక్‌ నుంచి కోలుకోకముందే అక్కడి నుంచి జారుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న శ్వేత తండ్రి బాల్‌శెటి ్టగౌడ్‌.. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు.


80 కిలోమీటర్ల దూరంలో..

ఆస్ట్రేలియాలో శ్వేతను చంపేసిన అశోక్‌రాజ్‌, ఆమె మృతదేహాన్ని మూటగట్టి, తమ ఇంటి నుంచి80 కిలోమీటర్ల దూరం కారులో తీసుకెళ్లి రోడ్డు పక్కన డస్ట్‌బిన్‌లో పడేశాడు. స్థానిక పోలీసులు శ్వేత మృతదేహాన్ని వెలికితీశారని.. ఇద్దరికీ ఆస్ట్రేలియా పౌరసత్వం ఉండడంతో అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని బాల్‌శెట్టి గౌడ్‌ తెలిపారు. ఇక్కడి పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదూ చేయదలుచుకోలేదని ఆయన వెల్లడించారు.

కాగా.. ఈ విషయం తెలుసుకున్న ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదివారం ఏఎస్‌రావునగర్‌లో మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని, భాదిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. శ్వేత మృతదేహాన్ని నగరానికి త్వరగా రప్పించేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, భారత ఎంబసీ అధికారులతో చర్చించినట్లు చెప్పారు.

Updated Date - Mar 11 , 2024 | 08:52 AM