Qamar Mohsin Shaikh: మోదీ.. ఓ రాఖీ!
ABN , Publish Date - Aug 16 , 2024 | 11:25 PM
శ్రావణ పౌర్ణమి వస్తోందంటే నాలో ఉత్సాహం, ఉద్వేగం కలుగుతాయి. ఈ ఏడాది నా సోదరుడి కోసం ఎలాంటి రాఖీ తయారు చెయ్యాలి?... మనసంతా అదే ఆలోచన. ఎందుకంటే సామాన్యుడిగా నాకు పరిచయమైన సోదరుడు... ఇప్పుడు ఎంతో ఎత్తు ఎదిగిపోయారు. కానీ ఆయనలోని ఆప్యాయత అలాగే ఉంది’’ అంటారు ఖమర్ మెహ్సిన్ షేక్. ఆమెది పాకిస్తాన్‌లోని కరాచీ నగరానికి చెందిన ముస్లిం కుటుంబం. అక్కడే పుట్టి పెరిగారు. 1981లో...
ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్.. పాకిస్తానీ మహిళ. ముప్ఫయ్యేళ్ళ క్రితం వారి మధ్య చిగురించిన సోదర సోదరీ బంధం ఆయన ముఖ్యమంత్రి, ఆ తరువాత ప్రధానమంత్రి అయ్యాక కూడా కొనసాగుతోంది. ఈ ఏడాది మరోసారి నరేంద్రమోదీకి కట్టడానికి ఖమర్ మెహ్సిన్ షేక్ రాఖీని సిద్ధం చేశారు. ఆప్యాయతానురాగాలకు దేశాలు, వాటి మధ్య ద్వేషాలు అవరోధాలు కావని వారి అనుబంధం రుజువుచేస్తోంది.
‘‘శ్రావణ పౌర్ణమి వస్తోందంటే నాలో ఉత్సాహం, ఉద్వేగం కలుగుతాయి. ఈ ఏడాది నా సోదరుడి కోసం ఎలాంటి రాఖీ తయారు చెయ్యాలి?... మనసంతా అదే ఆలోచన. ఎందుకంటే సామాన్యుడిగా నాకు పరిచయమైన సోదరుడు... ఇప్పుడు ఎంతో ఎత్తు ఎదిగిపోయారు. కానీ ఆయనలోని ఆప్యాయత అలాగే ఉంది’’ అంటారు ఖమర్ మెహ్సిన్ షేక్. ఆమెది పాకిస్తాన్‌లోని కరాచీ నగరానికి చెందిన ముస్లిం కుటుంబం. అక్కడే పుట్టి పెరిగారు. 1981లో... మెహ్సిన్ షేక్‌తో ఆమెకు వివాహమయింది. ఆ దంపతులు భారతదేశానికి వలస వచ్చారు. కొన్నాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. తరువాత గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో స్థిరపడ్డారు. ‘‘అది 1991. అప్పటి గుజరాత్ గవర్నర్ డాక్టర్ స్వరూప్ సింగ్‌తో మాకు పరిచయం ఉంది. ఒకసారి ఎయిర్‌పోర్టులో మా దంపతులకు ఆయన ఎదురుపడ్డారు.
మమ్మల్ని చూడగానే సాదరంగా పలకరిస్తూ... అక్కడ ఉన్న ఒక వ్యక్తిని మాకు పరిచయం చేశారు. నన్ను ఉద్దేశించి... ‘‘ఈమె నాకు కుమార్తె లాంటిది’’ అని చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి ‘‘అయితే ఈమె నాకు సోదరి. ఎలా ఉన్నారు సోదరీ?’’ అని నన్ను పలకరించారు. అలా ఆయన నాకు దేవుడిచ్చిన సోదరుడయ్యారు. ఆ తరువాత వచ్చిన రక్షాబంధన్ పర్వదినాన ఆయనకు తొలిసారిగా రాఖీ కట్టాను. ఆయనే మన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అప్పట్లో ఆయన ఆర్‌ఎ్‌సఎస్ ప్రచారక్‌గా ఉండేవారు’’ అని గుర్తు చేసుకున్నారు ఖమర్.
ఆ మాట విని మోదీ నవ్వారు, కానీ...
ఆ తరువాత ప్రతి సంవత్సరం మోదీ ఎక్కడున్నా రాఖీ పండగ రోజున తప్పకుండా కలుసుకోవడం, రాఖీ కట్టడం ఆమెకు ఆనవాయితీ అయిపోయింది. అలాంటి ఒక సందర్భంలో ‘‘ఏదో ఒక రోజు మీరు గుజరాత్ ముఖ్యమంత్రి కావాలని నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అని మోదీతో అన్నారు ఖమర్. ఆ మాట విని మోదీ నవ్వారు. కొన్నేళ్ళ తరువాత ఆమె ప్రార్థన ఫలించింది. ‘‘ఆ తరువాత ఆయనను కలుసుకున్నప్పుడు... ‘‘ఈసారి నీ సోదరుడి కోసం ఏం కోరుకుంటున్నావు?’’ అని అడిగారు. ‘‘దేశానికి ప్రధానమంత్రి కావాలని పార్థిస్తున్నాను’’ అని చెప్పాను. నేను ఎంతో అదృష్టవంతురాలిని.
ఆ కోరిక కూడా తీరింది. ఇప్పుడు మూడోసారి మోదీ ప్రధాని అయ్యారు. అయినా ఆయన వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు. ఆయనలో గొప్ప నాయకత్వ లక్షణాలున్నాయనేది మొదటి నుంచీ నా విశ్వాసం. అది పదేపదే రుజువు అవుతూనే ఉంది’’ అని చెప్పారామె. ‘‘కొవిడ్ కారణంగా... 2000, 2001, 2002 సంవత్సరాల్లో మోదీకి వ్యక్తిగతంగా రాఖీలు కట్టడం కుదరలేదు. పోస్టులో పంపించాను. అవి అందినట్టు సమాచారం వచ్చింది. కిందటి ఏడాది స్వయంగా ఢిల్లీ వెళ్ళి, రాఖీ కట్టాను. నేను రాఖీలను మార్కెట్‌లో ఎప్పుడూ కొనలేదు.
ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమికి ముందు స్వయంగా తయారు చేస్తాను. ఈ ఏడాది కూడా ఇప్పటికే సుమారు పది రాఖీలు రూపొందించాను. వాటిలో నాకు బాగా నచ్చినదాన్ని నా సోదరుడు మోదీ చేతికి కడతాను’’ అన్నారు ఖమర్.
‘‘ఇది నేను ఆయనకు కట్టబోయే 30వ రాఖీ. కాబట్టి ఏదైనా ప్రత్యేకంగా చెయ్యాలనుకున్నాను. వెల్వెట్‌తో దాన్ని తయారు చేశాను. అలంకరణల కోసం ముత్యాలను, మెటల్ ఎంబ్రాయిడరీని, టిక్కీలను ఉపయోగించాను. ఈ సోమవారం రాఖీ పౌర్ణమి. ఒక రోజు ముందే నేను, నా భర్త ఢిల్లీ చేరుకోవడానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నాం. ఈ ఏడాది వ్యవసాయం గురించి ఒక పుస్తకాన్ని కూడా ఆయనకు అందజేస్తాను. ఆయనకు పుస్తకపఠనం చాలా ఇష్టం’’ అంటున్న ఈ సోదరి... తన సోదరుడి కోసం ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ‘‘ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. దీర్ఘాయుష్షుతో జీవించాలి. పదేళ్ళపాటు ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన సేవలు భవిష్యత్తులో మరింత గొప్పగా కొనసాగాలి అని రోజూ ప్రార్థిస్తున్నాను’’ అంటున్నారు ఖమర్.
ఇవి కూడా చదవండి:
PKL-11 : అజిత్, అర్జున్ జిగేల్
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Sports News and Latest Telugu News