Share News

నరాలు లాగేస్తున్నాయా?

ABN , Publish Date - May 07 , 2024 | 01:50 AM

ఈ ఆధునిక ప్రపంచంలో నరాల బలహీనత చాలామందిని వేధించే ఒక పెద్ద సమస్య. దీనిని ముందే గుర్తిస్తే మందుల అవసరం లేకుండానే నయం చేయవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.

నరాలు  లాగేస్తున్నాయా?

ఆధునిక ప్రపంచంలో నరాల బలహీనత చాలామందిని వేధించే ఒక పెద్ద సమస్య. దీనిని ముందే గుర్తిస్తే మందుల అవసరం లేకుండానే నయం చేయవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. మందుల అవసరం లేకుండా వారు చెబుతున్న చిట్కాలేమిటో చూద్దాం.

  • రోజూ ఉదయాన్నే ఎక్కువ చెట్లు ఉన్న ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చోవాలి. గుండె నిండా గాలి పీల్చి దీర్ఘ శ్వాసలు వదలాలి. ప్రాణయామంలా చేస్తే.. శరీరంలోని నాడీవ్యవస్థకు ఆయువు పోసే ప్రాణవాయువు పుష్కలంగా అందుతుంది. ప్రతి అవయవానికీ జీవశక్తి లభిస్తుంది. మెదడు పనితీరుకు అవసరమైన రసాయనాలన్నీ ఊరే సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా నాడీ వ్యవస్థ బలంగా మారుతుంది.

  • నాడీ వ్యవస్థ శక్తిమంతంగా ఉండేందుకు విటమిన్‌-డి చాలా అవసరం. దీని కోసం ప్రతి రోజూ ఎండలో తప్పనిసరిగా నడవాలి. నరాల బలహీనతవల్ల కూడా డిప్రెషన్‌ వచ్చే అవకాశం ఉంది. నిత్యం తలనొప్పి, చికాకు, కోపం, ఒళ్లు నొప్పులు, గ్యాస్ట్రిక్‌ సమస్యలు చుట్టుముడతాయి. అందువల్ల నాడీ వ్యవస్థను చురుకుగా ఉంచాలంటే ఎండలో తప్పక నడవాలి.

  • నరాలు శక్తిమంతంగా పని చేయాలంటే మెగ్నీషియం చాలా అవసరం. మెగ్నీషియం పుష్కలంగా లభించే బాదం, అరటిపండ్లు, పిస్తా, బచ్చలికూర మొదలైనవి ఆహారంలో భాగం చేసుకోవాలి.

  • ఉదయాన్నే గోరువెచ్చని నీటిలోకి తేనె, నిమ్మ రసం కలిపి తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఒక పెద్ద గ్లాసు పాలు తాగాలి. అధిక నూనె పదార్థాలు, మిఠాయిలు వంటివి తినకూడదు. శరీరాన్ని వేడెక్కించే మసాలాలకు దూరంగా ఉండాలి.

  • దేహంలోని కండరాలు, నరాలు కేవలం శారీరక శ్రమతోనే కాదు, మానసిక ఆందోళనతోనూ అలసిపోతాయి. అప్పుడు రక్తప్రసరణ స్వేచ్ఛగా సాగదు. దాంతో నొప్పులు మొదలవుతాయి. ఆయుర్వేద తైలాలతో మర్దన చేయించుకుంటే కండరాలు, నరాలకు సాంత్వన కలుగుతుంది.

Updated Date - May 07 , 2024 | 06:24 AM