Share News

World Meteorological Organization (WMO) :జూలై-సెప్టెంబరులో లా నినా!

ABN , Publish Date - Jun 04 , 2024 | 04:01 AM

ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల వాతావరణం, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు కారణమైన ఎల్‌ నినో బలహీనపడుతోందని, ఈ ఏడాది జూలై-సెప్టెంబరులో లా నినా ఏర్పడే అవకాశం 60 శాతం వరకు ఉందని ప్రపంచ వాతావరణ విభాగం(డబ్ల్యూఎంవో) తాజా బులెటిన్‌లో వెల్లడించింది.

World Meteorological Organization (WMO) :జూలై-సెప్టెంబరులో  లా నినా!

  • ప్రపంచ వాతావరణ విభాగం ప్రకటన

  • బలహీనపడుతున్న ఎల్‌ నినో

న్యూఢిల్లీ, జూన్‌ 3: ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల వాతావరణం, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు కారణమైన ఎల్‌ నినో బలహీనపడుతోందని, ఈ ఏడాది జూలై-సెప్టెంబరులో లా నినా ఏర్పడే అవకాశం 60 శాతం వరకు ఉందని ప్రపంచ వాతావరణ విభాగం(డబ్ల్యూఎంవో) తాజా బులెటిన్‌లో వెల్లడించింది. ఎల్‌ నినో ప్రభావంతోనే గత 13 నెలలుగా సముద్ర ఉపరితలాలపై రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు కొనసాగాయని తెలిపింది.

ఆ ఫలితంగానే భారత్‌, పాకిస్థాన్‌ సహా దక్షిణాసియాలో కోట్లాదిమంది ప్రజలు ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయారని, అత్యంత వేడి ఏప్రిల్‌ను కూడా ఈ ఏడాది చూశామని పేర్కొంది. ఎల్‌ నినో వల్ల పసిఫిక్‌ మహాసముద్రం తూర్పు, మధ్య ప్రాంతాల్లో జలాలు అసాధారణంగా వేడెక్కిపోతున్నాయని వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ కేంద్రాల దీర్ఘకాలిక అంచనాల మేరకు ఈ ఏడాది జూన్‌-ఆగస్టు కాలంలో లా నినా లేదా తటస్థ పరిస్థితి ఏర్పడేందుకు సమాన అవకాశాలు(50 శాతం) ఉన్నాయని పేర్కొంది.


జూలై-సెప్టెంబరు నాటికి లా నినా ఏర్పడే అవకాశాలు 60 శాతానికి, ఆగస్టు-నవంబరులో 70 శాతానికి పెరుగుతాయని తెలిపింది. ఆ సమయంలో తిరిగి ఎల్‌ నినో ఏర్పడే అవకాశాలు చాలా తక్కువని పేర్కొంది. ఎల్‌నినో వల్ల భారత్‌లో బలహీన రుతుపవన గాలులు, పొడి వాతావరణం ఏర్పడిందని, దీనికి వ్యతిరేకంగా లా నినా వల్ల రుతుపవన కాలంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

‘2023 జూన్‌ నుంచి ప్రతి నెలా ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నెలకొల్పాయి. అలాగే, అత్యంత వేడి సంవత్సరంగా 2023 రికార్డులకెక్కింది. ఎల్‌ నినో ముగియడమంటే దీర్ఘకాలిక వాతావరణ మార్పులకు విరామమని అర్థంకాదు. ఎందుకంటే గ్రీన్‌ హౌస్‌ వాయువుల విడుదల వల్ల గ్రహం వేడెక్కడం కొనసాగుతోంది. రానున్న నెలల్లోనూ అసాధారణ సముద్ర ఉపరితల అత్యధిక ఉష్ణోగ్రతలు కీలకపాత్ర పోహించే అవకాశం ఉంది’ అని డబ్ల్యూఎంవో డిప్యూటీ ప్రధానకార్యదర్శి కో బార్రెట్‌ పేర్కొన్నారు

Updated Date - Jun 04 , 2024 | 04:01 AM