Share News

WFI: అడ్‌హాక్ కమిటీని గుర్తించం: సంజయ్ సింగ్

ABN , Publish Date - Jan 01 , 2024 | 09:17 PM

రెజ్లింగ్ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా లో వివాదం ముదురుతోంది. ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ అడ్‌హాక్ కమిటీని తాము గుర్తించమని డబ్ల్యూఎఫ్ఐ సస్పెండెడ్ ప్రెసిడెంట్ సంజయ్ సింగ్ సోమవారంనాడు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్యానల్ తమదని, క్రీడా మంత్రిత్వ శాఖ తమపై విధించిన సస్పెన్షన్‌ను సైతం గుర్తించమని అన్నారు.

WFI: అడ్‌హాక్ కమిటీని గుర్తించం: సంజయ్ సింగ్

న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా (WFI)లో వివాదం ముదురుతోంది. ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ (IOA) అడ్‌హాక్ కమిటీని తాము గుర్తించమని డబ్ల్యూఎఫ్ఐ సస్పెండెడ్ ప్రెసిడెంట్ సంజయ్ సింగ్ (Sanjay Singh) సోమవారంనాడు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్యానల్ తమదని, క్రీడా మంత్రిత్వ శాఖ తమపై విధించిన సస్పెన్షన్‌ను సైతం గుర్తించమని అన్నారు.


గత నెలలో జరిగిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో గెలిచిన సంజయ్ సింగ్ ప్యానల్‌పై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఇటీవల సస్పెన్షన్ విధించింది. నిబంధనలను ఉల్లంఘించారనే కారణంగా ఈ ప్యానల్‌ను నిషేధించినట్టు ప్రకటించింది. దీంతో డబ్ల్యుఎఫ్ఐ వ్యవహారాలు చూసుకునేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన అడ్‌హాక్ కమిటీని భారత ఒలంపిక్ అసోసియేషన్ ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా తాము గెలిచామని, గెలుపు పత్రాలపై రిటర్నింగ్ అధికారి సంతకాలు కూడా చేశారని అన్నారు. అడ్‌హాక్ ప్యానల్‌ను, కేంద్ర క్రీడా శాఖ విధించిన సస్పెన్షన్‌ను తాము గుర్తించమని, డబ్ల్యూఎఫ్ఐ తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.


''మేము స్టేట్ అసోసియేషన్ టీమ్స్‌ను పంపకపోతే అడ్‌హాక్ కమిటీ ఎలా నేషనల్ ఛాంపియన్స్ నిర్వహిస్తుంది? త్వరలోనే మేము నేషనల్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తాం. ఇందుకోసం ఎగ్జిక్యూటివ్ సమావేశం ఒకటి రెండు రోజుల్లో జరుపుతాం. వాళ్ల (అడ్‌హాక్ కమిటీ) కంటే ముందే మేము నేషనల్స్ నిర్వహిస్తాం'' అని సంజయ్ సింగ్ చెప్పారు. క్రీడా శాఖ విధించిన సస్పెన్షన్‌పై తాము లేఖ కూడా రాశామని, జవాబు కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. తాము నిబంధనలను ఉల్లంఘించామనడం సరికాదన్నారు. చర్చలకు వాళ్లు (క్రీడాశాఖ) రాకుంటే తాము కూడా తమ ప్యానెల్‌పై విధించిన సస్పెన్షన్‌ను అంతగా పట్టించుకోమని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Jan 01 , 2024 | 09:17 PM