Union Minister: తేల్చిచెప్పేసిన కేంద్ర మంత్రి.. వారికోసం మా పార్టీ తలుపులు తెరిచే ఉంచాం..
ABN , Publish Date - Mar 03 , 2024 | 10:13 AM
లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలను తమ కూటమిలో చేర్చుకునేందుకు సిద్ధమేనని కేంద్ర మంత్రి వీకే సింగ్(Union Minister VK Singh) అన్నారు.
చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలను తమ కూటమిలో చేర్చుకునేందుకు సిద్ధమేనని కేంద్ర మంత్రి వీకే సింగ్(Union Minister VK Singh) అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కన్నియాకుమారి జిల్లాకు విచ్చేసిన ఆయన శనివారం ఉదయం పార్టీ జిల్లా నేతల సమావేశంలో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కన్నియాకుమారి(Kanniyakumari) వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. విమానాశ్రయానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేసి రాష్ట్రప్రభుత్వం అందజేస్తే వీలైనంత త్వరగా నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా అన్నాడీఎంకే, డీఎంకే తమ కూటమిలోకి వస్తే చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని తెలిపారు. కన్నియాకుమారిలో బీజేపీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థిని పార్టీ అధిష్ఠానమే ప్రకటిస్తుందని చెప్పారు. ప్రధాని మోదీ మొహంలో ఓటమి భయం కనిపిస్తోందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. మూడోసారి ముచ్చటగా మునుపటి కంటే మరింత మెజారిటీతో మోదీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు దేశ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వీకేసింగ్ చెప్పుకొచ్చారు.