Share News

కన్నీటి మాస్కో

ABN , Publish Date - Mar 24 , 2024 | 02:33 AM

రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 150కి పెరిగింది. ఈ మారణహోమం తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ అఫ్ఘానిస్థాన్‌ శాఖ ప్రకటించింది. అయితే, ఉగ్రవాదులకు ఉక్రెయిన్‌తో సంబంధాలున్నాయని రష్యా అధ్యక్షుడు

కన్నీటి మాస్కో

150కి పెరిగిన మృతుల సంఖ్య

దాడులు తమ పనేనని ఐఎస్‌ ప్రకటన

క్రైస్తవుల సమావేశమే లక్ష్యం

సిరియాలో రష్యా జోక్యంపై ప్రతీకారంగానే?

ఉక్రెయిన్‌ హస్తం ఉంది: పుతిన్‌

దాడిని ఖండించిన ప్రధాని మోదీ

మాస్కో, మార్చి 23: రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 150కి పెరిగింది. ఈ మారణహోమం తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ అఫ్ఘానిస్థాన్‌ శాఖ ప్రకటించింది. అయితే, ఉగ్రవాదులకు ఉక్రెయిన్‌తో సంబంధాలున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోపించారు. దీనిని ఉక్రెయిన్‌ తీవ్రంగా ఖండించింది. తమతో యుద్ధాన్ని మరింతకాలంపాటు పొడిగించటానికే పుతిన్‌ ఈ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. ఉగ్రదాడి నేపథ్యంలో పుతిన్‌ శనివారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న నలుగురు పారిపోయి, ఉక్రెయిన్‌ సరిహద్దు దాటటానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. వారితోపాటు మొత్తం 11 మందిని భద్రతా దళాలు అరెస్టు చేశాయన్నారు. దాడిని పాశవిక ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఆదివారం దేశవ్యాప్త సంతాపదినంగా ప్రకటించారు. ఉగ్రదాడికి సంబంధించి మరిన్ని వివరాలు శనివారం వెల్లడయ్యాయి. వాటి ప్రకారం.. మాస్కో శివార్లలోని క్రాస్‌నొగొర్స్క్‌ ప్రాంతంలో ఉన్న క్రాకస్‌ సిటీ హాల్‌లో సోవియట్‌ యూనియన్‌ కాలం నాటి ‘పిక్‌నిక్‌ రాక్‌బాండ్‌’ సంగీత కార్యక్రమాన్ని తిలకించటానికి శుక్రవారం వందలాది మంది తరలివచ్చారు. ఆ హాల్‌లో 6,200 మంది కూర్చోగల సామర్థ్యం ఉంది. కొద్దిసేపట్లో మ్యూజిక్‌ షో ప్రారంభమవుతుందనగా.. రాత్రి 7.40 గంటలకు సైనిక దుస్తులు ధరించిన నలుగురు ఉగ్రవాదులు ఏకే 47 తుపాకులతో ఓ మినీవ్యాన్‌లో వచ్చారు. వచ్చీరాగానే హాల్‌లోకి ప్రవేశించి అమాయక జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బాంబులు వేసి విధ్వంసం సృష్టించారు. హాలును తగలబెట్టటానికి మంటలను పుట్టించే ద్రావకాన్ని కుర్చీలపై, కర్టెయిన్లపై వెదజల్లారు. మంటలు క్షణాల్లో ఎగిసిపడ్డాయి. జనం కకావికలమై.. ప్రాణాలు రక్షించుకోవటానికి పరుగులు తీశారు. పారిపోతున్న జనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. హాలుపై అంతస్తులో కూర్చున్న వారు ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉగ్రవాదుల కాల్పులతోపాటు, హాలులో పొగ దట్టంగా అలుముకోవటంతో ఊపిరాడక కూడా చాలామంది మరణించి ఉంటారని పేర్కొన్నారు. కాగా, దాడి నేపథ్యంలో మాస్కో నగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రులకు రక్తదానం చేయటానికి మాస్కో వాసులు ఆసుపత్రుల ముందు బారులు తీరి మానవత్వం చాటుకున్నారు. 145 మంది గాయాలు పాలుకాగా వారిలో ఐదుగురు పిల్లలతో సహా 115 మంది చికిత్స పొందుతున్నారని ప్రభుత్వ ఆరోగ్యశాఖ అధికారులు ఓ జాబితాను వెలువరించారు.

ఇది మా పనే: ఇస్లామిక్‌ స్టేట్‌

రష్యాలో జరిగిన దాడి తమ పనేనని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రసంస్థ అఫ్ఘానిస్థాన్‌ శాఖ ప్రకటించింది. మాస్కో సమీపంలో భారీ సంఖ్యలో సమావేశమైన క్రైస్తవులపై దాడి జరిపి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించామని, తమ ఫైటర్లు తిరిగి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారని తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో వెల్లడించింది. దాడి ఇస్లామిక్‌ స్టేట్‌ పనేనన్న సంగతిని అమెరికా కూడా ధ్రువీకరించింది. మాస్కోపై దాడికి ఐఎస్‌ కుట్ర పన్నుతోందని తమకు లభించిన సమాచారాన్ని రష్యాకు ఈ నెలలోనే అందజేశామని అమెరికా అధికారులు వెల్లడించారు. దీనిపై అప్పట్లో వార్తలు రాగా.. ఇదంతా రష్యన్లను భయపెట్టటానికి అమెరికా చేస్తున్న ప్రచారంలో భాగమని పుతిన్‌ కొట్టివేశారు. కాగా, సిరియాలో 2012లో చెలరేగిన అంతర్యుద్ధంలో ఆ దేశ ప్రతిపక్షం, ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రసంస్థ.. దేశాధ్యక్షుడు బషార్‌ అల్‌ అస్సాద్‌పై సాయుధ పోరు జరిపాయి. ఈ అంతర్యుద్ధంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. అస్సాద్‌కు మద్దతుగా 2015లో తమ సైన్యాన్ని పంపించారు. దీంతో తిరుగుబాటు విఫలమైంది. ఈ నేపథ్యంలోనే, పుతిన్‌పై ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రతీకారం తీర్చుకోవటానికి తాజా దాడి జరిపినట్లుగా భావిస్తున్నారు.

తీవ్రంగా ఖండించిన ప్రపంచదేశాలు

రష్యాపై ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. ఈ విషాద సమయంలో రష్యాకు బాసటగా ఉం టామన్నారు. అత్యంత హీనమైన పిరికి చర్యగా రష్యాపై ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. పలు దేశాలు దాడిని తీవ్రంగా ఖండించి, రష్యన్లకు సానుభూతి ప్రకటించాయి.

యుద్ధోన్మాదాన్ని పెంచటానికే మాపై ఆరోపణలు

ఉగ్రదాడిలో ఉక్రెయిన్‌ కోణం ఉందంటూ పుతిన్‌తోపాటు రష్యా అధికారులు చేస్తున్న ప్రకటనలను ఉక్రెయిన్‌ తీవ్రంగా ఖండించింది. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. యుద్ధాన్ని మరింతకాలంపాటు పొడిగించటానికి, రష్యన్లలో ఉక్రెయిన్‌ వ్యతిరేక ఉన్మాదాన్ని రెచ్చగొట్టటానికి, అంతర్జాతీయంగా ఉక్రెయిన్‌ను దోషిగా నిలబెట్టటానికి రష్యా ఈ ఆరోపణలు చేస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సలహాదారు పేర్కొన్నారు. కాగా, పాతికేళ్లుగా అధికారంలో ఉన్న పుతిన్‌ ఇటీవల రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల నిష్పాక్షికతపై తీవ్ర సందేహాలున్నాయి.

Updated Date - Mar 24 , 2024 | 02:33 AM