Share News

Coast Guard Case: మీరు చేయకపోతే, మేమే ఆ పని చేస్తాం.. కేంద్రానికి సుప్రీం అల్టిమేటం

ABN , Publish Date - Feb 26 , 2024 | 08:12 PM

మహిళా కోస్ట్ గార్డు అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేసే అంశంపై కేంద్రానికి సుప్రీంకోర్టు సోమవారంనాడు అల్టిమేటం ఇచ్చింది. ''మహిళలను పక్కనపెట్టలేం. మీరు చేయకుంటే మేమే ఆ పని చేస్తాం. కాబట్టి దాన్ని పరిశీలించండి'' అని కేంద్రం తరఫు న్యాయవాదికి చెప్పారు.

Coast Guard Case: మీరు చేయకపోతే, మేమే ఆ పని చేస్తాం.. కేంద్రానికి సుప్రీం అల్టిమేటం

న్యూఢిల్లీ: మహిళా కోస్ట్ గార్డు (Coast Guard) అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేసే అంశంపై కేంద్రానికి సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారంనాడు అల్టిమేటం ఇచ్చింది. ''మహిళలను పక్కనపెట్టలేం. మీరు చేయకుంటే మేమే ఆ పని చేస్తాం. కాబట్టి దాన్ని పరిశీలించండి'' అని కేంద్రం తరఫు న్యాయవాది, అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణికి భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ (DY Chandrachud) చెప్పారు. అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కోస్ట్ గార్డ్స్‌ను కోరుతామని ఈ సందర్భంగా ఏజే తెలిపారు. అనంతరం తదుపరి విచారణను మార్చి 1వ తేదీకి అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది.


కోస్ట్‌గార్డ్‌కు చెందిన మహిళా అధికాణి పంకజ్ త్యాగి ఈ విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. షార్ట్ సర్వీస్ కమిషన్ కింద ఫోర్స్‌లో చేరిన అర్హత కలిగిన అధికారులకు పెర్మనెంట్ కమిషన్ కావాలని పిటిషనర్ కోరారు. అయితే కోస్ట్ గార్డ్ అనేది నేవీ, ఆర్మీకి భిన్నమైనదంటూ అట్నారీ జనరల్ తన వాదన వినిపించారు. ఇదే విషయమై ఫిబ్రవరి 19న జరిగిన విచారణ సమయంలోనూ కేంద్రాన్ని కోర్టు మందలించింది. కోస్ట్ గార్డ్ విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని సీజేఐ ప్రశ్నించారు. ''కోస్ట్ గార్డులలో మహిళలు ఉండకూడదని ఎందుకనుకుంటున్నారు? మహిళలు సరిహద్దులను కాపాడ గలితే బీచ్‌లను కూడా కాపాడగలరు. మీరు నారీశక్తి గురించి మాట్లాడండి, ఇక్కడ దాన్ని చూపించండి'' అని సీబీఐ వ్యాఖ్యానించారు.


మహిళలను చేర్చుకునేందుకు నిరాకరించే పితృస్వామ్య మనస్తత్వాన్ని కోర్టు నిలదీసింది. ''నేవీలో మహిళలు ఉన్నారు. కోస్ట్ గార్డ్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటి? మేము మొత్తం కాన్వాస్‌ను తెరుస్తాం. మహిళలు కోస్ట్ గార్డ్‌లో భాగస్వామ్యం కాలేరని చెప్పే రోజులు పోయాయి'' అని సీజేఐ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - Feb 26 , 2024 | 08:12 PM