Share News

Supreme Court: ఈవీఎంల కేసులో సుప్రీం తీర్పు ఈవీఎంలే సరైనవి..

ABN , Publish Date - Apr 27 , 2024 | 02:59 AM

ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్లన్నింటినీ వీవీప్యాట్‌ స్లిప్పులతో నూరు శాతం సరిపోల్చి చూడాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Supreme Court: ఈవీఎంల కేసులో సుప్రీం తీర్పు ఈవీఎంలే సరైనవి..

  • బ్యాలెట్‌ పేపర్లకు కాలం చెల్లింది.. గుడ్డిగా దేన్నీ అనుమానించవద్దు

  • సంస్కరణలను వృథా చేయొద్దు.. ఈవీఎంల కేసులో సుప్రీం తీర్పు

  • వీవీప్యాట్‌ స్లిప్పులను నూరుశాతం లెక్కించాలన్న పిటిషన్ల కొట్టివేత

  • ఆ స్లిప్పులను ఓటర్లే డిపాజిట్‌ చేసే అవకాశం ఇవ్వాలన్న విజ్ఞప్తికీ నో

  • సింబల్‌ లోడింగ్‌ యూనిట్లనూ 45రోజులు భద్రపరచాలని ఆదేశం

  • ఎన్నికల పిటిషన్‌ దాఖలైతే.. 5ు ఈవీఎంల మైక్రో కంట్రోలర్

  • మెమొరీని సంబంధిత ఇంజనీర్లు తనిఖీచేయాలని మరో ఆదేశం

  • జూ ఎలకా్ట్రనిక్‌ పద్ధతిలో వీవీప్యాట్ల లెక్కింపుపై ఆలోచించాలని సూచన

  • బ్యాలెట్‌ పేపర్లకు కాలం చెల్లింది

  • గుడ్డిగా దేన్నీ అనుమానించవద్దు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఆ స్లిప్‌లను వేరేగా డిపాజిట్‌ చేయాలని వచ్చిన అభ్యర్థనలను కూడా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది.


ఈవీఏంల బదులుగా మళ్లీ పాత కాలం బ్యాలట్‌ పద్ధతిని ప్రవేశపెట్టాలనడం సరైంది కాదని ఇద్దరు న్యాయమూర్తులూ ఒకే అభిప్రాయంతో వెలువరించిన వేర్వేరు తీర్పుల్లో స్పష్టం చేశారు. 97 కోట్ల మంది ఓటర్లు, పెద్ద సంఖ్యలో ఉన్న అభ్యర్థులు, లక్షలాది పోలింగ్‌ బూత్‌లు ఉన్న ఈ దేశం బ్యాలట్‌ పేపర్ల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నదని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. మళ్లీ అదే పద్ధతికి వెళితే ఎన్నో సంవత్సరాల కృషి తర్వాత జరిగిన ఎన్నికల సంస్కరణలు వృథా అయిపోతాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

ఈవీఎంలపై అనుమానాలు సహేతుకం కాదని వ్యాఖ్యానించారు. సాంకేతిక అంశాలను, ఇప్పటి వరకూ నమోదైన డేటాను పరిశీలించిన తర్వాత.. ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరిపించడం సరైందని నిర్ణయించామని వారు తెలిపారు. అలాగే.. వీవీప్యాట్‌ స్లిప్పులను ఓటర్లే డ్రాప్‌బాక్సుల్లో వేసే అవకాశం కల్పించాలన్న విజ్ఞప్తినీ న్యాయమూర్తులు తోసిపుచ్చారు. అలా ఇవ్వడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని.. వాటిని దుర్వినియోగపరిచే అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డారు.


ఇప్పటి వరకూ 4 కోట్ల వీవీప్యాట్‌ స్లిప్పులను కంట్రోల్‌ యూనిట్ల ఫలితాలతో సరిపోల్చారని, ఒక్కసారి కూడా లోపాలు కనపడలేదని గుర్తుచేశారు. గుడ్డిగా ఒక వ్యవస్థను అనుమానించడం, వ్యతిరేకించడం సరైంది కాదని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం ఏర్పడినప్పుడే ప్రజాస్వామ్యం పటిష్ఠమవుతుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. మళ్లీ బ్యాలట్‌ పేపర్లకు వెళ్లే బదులు.. ఉన్న ఈవీఎంల వ్యవస్థనే మరింత మెరుగుపరచుకోవాలని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా తన తీర్పులో పేర్కొన్నారు. కొన్ని స్వార్థపరశక్తులు ఈ దేశం సాధించిన విజయాలను తక్కువ చేయాలని చూస్తున్నాయని జస్టిస్‌ దత్తా వ్యాఖ్యానించారు.


రెండు ఆదేశాలు..

ఈవీఎంలపై మరింత నమ్మకం పెరిగేందుకు ఎన్నికల కమిషన్‌కు సుప్రీం ధర్మాసనం రెండు ఆదేశాలు జారీ చేసింది.

1) మే 1వ తేదీ తర్వాత.. వీవీప్యాట్‌ యూనిట్లలోకి అభ్యర్థుల పేర్లు, గుర్తులు, సీరియల్‌ నంబర్లను లోడ్‌ చేసిన తర్వాత సింబల్‌ లోడింగ్‌ యూనిట్లను (ఎస్‌ఎల్‌యూలు) సీల్‌ చేసి, కంటెయినర్లలో భద్రపరచాలి. ఆ ప్రక్రియ సవ్యంగా జరిగినట్టు ధ్రువీకరిస్తూ అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు ఆ సీల్‌పై సంతకం చేయాలి. ఆ సీల్డ్‌ కంటెయినర్లను.. ఎన్నికల ఫలితాలను ప్రకటించిన తర్వాత 45 రోజులపాటు ఈవీఎంలతో కలిపి స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరచాలి. ఒకవేళ ఈవీఎంలలో ఓట్లను మళ్లీ లెక్కించాల్సిన పరిస్థితి వస్తే.. అప్పుడు ఈ ఎస్‌ఎల్‌యూలను కూడా తెరిచి, పరీక్షించాలి.

2) ఫలితాలు వెల్లడైన 7 రోజుల్లోపు.. గెలిచిన అభ్యర్థి తర్వాతి రెండు స్థానాల్లో (అంటే రెండో స్థానంలో లేదా మూడో స్థానంలో) నిలిచిన అభ్యర్థుల్లో ఎవరైనా ఫలితంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే, వారు చెప్పిన నియోజకవర్గంలోని పోలింగ్‌ స్టేషన్‌లో.. వారు సూచించిన సీరియల్‌ నంబర్‌ కలిగిన 5ు ఈవీఎంల మైక్రోకంట్రోలర్ల మెమొరీని.. వాటిని తయారుచేసిన ఇంజనీర్ల బృందం తనిఖీ చేయాలి. ఈ రెండు ఆదేశాలు ఇవ్వడంతోపాటు.. కౌంటింగ్‌ సమయంలో పేపర్‌ స్లిప్‌లను లెక్కించేందుకు ఎలకా్ట్రనిక్‌ యంత్రాలను ఉపయోగించాలన్న పిటిషనర్ల సూచనను కూడా పరిశీలించాలని ధర్మాసనం ఈసీకి సూచించింది. సుప్రీం తీర్పుపై పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా కనీసం 40సార్లు.. ఈవీఎంల విశ్వసనీయతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టులు కొట్టేశాయని ఈసీ గుర్తుచేసింది.


ఏమిటీ సింబల్‌ లోడింగ్‌ యూనిట్లు?

సింబల్‌ లోడింగ్‌ యూనిట్‌ అంటే.. వీవీప్యాట్‌ మెషీన్లలోకి అభ్యర్థుల పేర్లు, గుర్తులు, సీరియల్‌ నంబర్లను ఎక్కించే యంత్రం. ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులందరి గుర్తులనూ తొలుత కంప్యూటర్‌ ద్వారా ఈ సింబల్‌ లోడింగ్‌ యూనిట్‌లోకి ఎక్కిస్తారు (అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటే రెండు యూనిట్లను ఉపయోగిస్తారు). తర్వాత వాటిని వీవీప్యాట్లకు అనుసంధానం చేసి.. వాటిలోకి ఆయా గుర్తులను అప్‌లోడ్‌చేస్తారు. ఇదంతా నామినేషన్ల దశ పూర్తయి, అభ్యర్థులు ఖరారయ్యాక.. ఎన్నికల కార్యాలయంలో, వివిధ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారుల సమక్షంలో జరిగేప్రక్రియ. సింబల్‌ లోడింగ్‌ యూనిట్లను మనదేశంలో ప్రస్తుతం రెండు సంస్థలే తయారుచేస్తున్నాయి. అవి.. ఈసీఐఎల్‌, బీఈల్‌.

ఈ రెండు సంస్థల ఇంజనీర్లు ఎన్నికల కార్యాలయాలకు వెళ్లి.. గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ యూనిట్ల ద్వారా వీవీప్యాట్‌ యంత్రాలలోకి అభ్యర్థుల పేర్లు, వారి పార్టీ గుర్తు, సీరియల్‌ నంబర్‌ వంటివాటిని లోడ్‌ చేసి పరీక్షిస్తారు. అంతా సరిగ్గా ఉందని నిర్ధారించుకున్నాక ఈవీఎంలను స్ట్రాంగ్‌రూముల్లో భద్రపరుస్తారు. సింబల్‌ లోడింగ్‌ యూనిట్లను జిల్లా ఎన్నికల అధికారి కస్టడీలో ఉంచుతారు. ఎన్నికలు అయిన ఒకరోజు తర్వాత.. ఆ యూనిట్లను సంబంధిత సంస్థల ఇంజనీర్లకు అప్పగిస్తారు. అప్పుడా ఇంజనీర్లు వాటిని తదుపరి దశ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఉపయోగించడానికి తీసుకెళ్తారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఓడిన అభ్యర్థులకు ఓట్ల లెక్కింపుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తేదీ నుంచి 45 రోజుల్లోగా పిటిషన్‌ దాఖలు చేయొచ్చు.

Updated Date - Apr 27 , 2024 | 02:59 AM