Share News

Suburban train: సబర్బన్‌ రైలులో విద్యార్థుల బాహాబాహీ.. రాళ్లు, బీర్‌ బాటిళ్లతో పరస్పర దాడులు

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:18 AM

స్థానిక పట్టరైపాక్కం రైల్వేస్టేషన్‌లో రెండు కళాశాలల విద్యార్థులు రాళ్లు, బీర్‌ బాటిళ్లతో పరస్పర దాడులకు పాల్పడడంతో ప్రయాణికులు భయాందోళనలు చెందారు.

Suburban train: సబర్బన్‌ రైలులో విద్యార్థుల బాహాబాహీ.. రాళ్లు, బీర్‌ బాటిళ్లతో పరస్పర దాడులు

- ముగ్గురి అరెస్ట్‌

చెన్నై: స్థానిక పట్టరైపాక్కం రైల్వేస్టేషన్‌లో రెండు కళాశాలల విద్యార్థులు రాళ్లు, బీర్‌ బాటిళ్లతో పరస్పర దాడులకు పాల్పడడంతో ప్రయాణికులు భయాందోళనలు చెందారు. పచ్చయప్ప, రాజధాని కళాశాలల విద్యార్థుల మధ్య దీర్ఘకాలంగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. బస్సులు, సబర్బన్‌ రైళ్లలో విద్యార్థులు పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం, వారిని హెచ్చరించడం తదితరాలు చేపట్టినా ఆ రెండు కళాశాలల విద్యార్థుల మధ్య తలెత్తుతున్న ఘర్షణలు అడ్డుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో.. తిరుత్తణి నుంచి బుధవారం ఉదయం చెన్నై సెంట్రల్‌కు సబర్బన్‌ రైలు బయల్దేరింది. ఉదయం వేళ కావడంతో రైలులో ప్రయాణికులు కిక్కిరిసిపోగా, పలువురు విద్యార్థులు ఫుట్‌బోర్డులపై నిలబడి ప్రయాణిస్తున్నారు. రైలు పట్టరైవాక్కం సమీపంలో వస్తుండగా రెండు బోగీల్లో ప్రయాణిస్తున్న పచ్చయప్ప, రాజధాని కళాశాలల విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రైలు రైల్వేస్టేషన్‌ వద్దకు చేరుకోగానే విద్యార్థులు ఒక్కసారిగా రాళ్లు, బీర్‌, సోడా బాటిళ్లతో పరస్పర దాడులకు పాల్పడ్డారు. స్టేషన్‌లో ఒకరి వెంట ఒకరు తరుముతూ దాడులకు పాల్పడిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వెలువడ్డాయి. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పెరంబూర్‌ రైల్వే పోలీసులు అక్కడకు చేరుకొని ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని, పరారైన మరో 10 మందిని గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు.

nani2.jpg

విద్యార్థులను డిస్మిస్‌ చేయండి

- రైల్వే పోలీసులు

దాడులకు పాల్పడిన విద్యార్థులను డిస్మిస్‌ చేయాలని రైల్వే పోలీసులు సంబంధిత కళాశాలల యజమాన్యాలకు లేఖ రాశారు. ఈ విషయమై రైల్వే డీఎస్పీ రమేష్‌ మాట్లాడుతూ.. పచ్చయప్ప, రాజధాని కళాశాలల విద్యార్థుల మధ్య తరచూ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయన్నారు. బుధవారం కూడా విద్యార్థులు పరస్పర దాడులకు పాల్పడగా, ముగ్గురు విద్యార్థులను అరెస్ట్‌ చేశామని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన విద్యార్థులను కళాశాలల నుండి డిస్మిస్‌ చేయాలని ఆయా కళాశాలల యజమాన్యాలకు లేఖ రాయడంతో పాటు బస్సు, రైళ్లలో ప్రయాణించే విద్యార్థుల వివరాలు అందించాలని కోరినట్లు డీఎస్పీ రమేష్‌ తెలిపారు.

Updated Date - Feb 15 , 2024 | 11:18 AM