Share News

Delhi: 20 రోజులు కూడా జరగలేదు!

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:33 AM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో 2023 అసెంబ్లీ సమావేశాలు పట్టుమని 20 రోజులు కూడా జరగలేదు. ఈ విషయాన్ని తాజాగా విడుదలైన పీఆర్‌ఎ్‌సఎల్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ అనే మేధో సంస్థ నివేదిక వెల్లడించింది.

Delhi: 20 రోజులు కూడా జరగలేదు!

2023లో తెలంగాణ, ఏపీ అసెంబ్లీ సమావేశాల తీరిదీ.. ఏడు రాష్ట్రాల్లో ఆరు నెలలకు పైగా కొనసాగిన సమావేశాలు

  • 500కి పైగా బిల్లులు, రూ.53లక్షల కోట్లకు పైగా బడ్జెట్లకు ఓకే

  • పీఆర్‌ఎ్‌సఎల్‌ లెజిస్లేటివ్‌ సంస్థ నివేదికలో గణాంకాలు వెల్లడి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో 2023 అసెంబ్లీ సమావేశాలు పట్టుమని 20 రోజులు కూడా జరగలేదు. ఈ విషయాన్ని తాజాగా విడుదలైన పీఆర్‌ఎ్‌సఎల్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ అనే మేధో సంస్థ నివేదిక వెల్లడించింది. దేశ వ్యాప్తంగా గతేడాది అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు సగటున 22 రోజుల పాటు సమావేశమయ్యాయి. ఈ సమావేశాలు జరిగిన సగటు కాలవ్యవధి 5 గంటలుగా నమోదైంది. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒక్కసారైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. గతేడాది దేశంలోని ఏడు రాష్ట్రాలు అరు నెలలకు పైగా సమావేశాలను వాయిదా వేయకుండా, సెషన్ల మధ్య సుదీర్ఘ విరామంతో నడిపాయి.


నివేదికలోని కొన్ని కీలక అంశాలివీ..

  • గతేడాది మహారాష్ట్ర అసెంబ్లీ అత్యధికంగా 41 రోజులు, పశ్చిమ బెంగాల్‌ 40, కర్ణాటక అసెంబ్లీ 39 రోజులు సమావేశమయ్యాయి. ఏపీ, హరియాణా, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, తెలంగాణ అసెంబ్లీలు 20రోజుల కంటే తక్కువగా, అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, ఉత్తరాఖండ్‌లో 10 రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే జరిగాయి.

  • ఢిల్లీలో మార్చి నుంచి డిసెంబరు వరకూ 14 సిటింగ్‌లతో ఒకే సెషన్‌ కొనసాగింది.

  • మార్చి నుంచి అక్టోబరు వరకూ 10 సిటింగ్‌లతో అసెంబ్లీ సెషన్‌ నిర్వహించారు. బడ్జెట్‌ సమావేశాలను గవర్నర్‌ పిలవలేదంటూ 2023 ఫిబ్రవరిలో పంజాబ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

  • రాజస్థాన్‌లో అసెంబ్లీ సమావేశాలు జనవరి నుంచి ఆగస్టు వరకూ కొనసాగాయి. 2020, 2021లలో రాజస్థాన్‌ అసెంబ్లీ సెషన్‌ జనవరి నుంచి డిసెంబరు వరకూ కొనసాగడం విశేషం.

  • పశ్చిమ బెంగాల్‌లో జూలైలో ప్రారంభమైన సెషన్‌ను 2024 మార్చి వరకూ వాయిదా వేయలేదు. రాష్ట్ర బడ్జెట్‌ను ఆమోదించడానికి ఫిబ్రవరిలో నిర్వహించిన సమావేశాలు గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభం కాలేదు.

  • సిక్కిం, తమిళనాడు, తెలంగాణల్లో ఏడాదికి పైగా సమావేశాలు కొనసాగాయి. సిక్కింలో 2022 మార్చిలో ప్రారంభమైన సమావేశాలు 2023 ఏప్రిల్‌లో వాయిదా పడ్డాయి. తెలంగాణలో 2021 సెప్టెంబరు నుంచి 2023 ఆగస్టులో సభా కాలం ముగిసే వరకూ ఒకే సెషన్‌ కొనసాగింది.

  • సమావేశాల సంఖ్య తక్కువైనప్పటికీ 2023లో 500కి పైగా బిల్లులను, రూ.53 లక్షల కోట్లకు పైగా బడ్జెట్లను రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించాయి.

  • అసెంబ్లీల్లో ప్రవేశపెట్టిన బిల్లుల్లో 44 శాతం ఒక్కరోజులోనే ఆమోదం పొందాయి. గుజరాత్‌, ఝార్ఖండ్‌, మిజోరాం, పుదుచ్చేరి, పంజాబ్‌ అసెంబ్లీలు ప్రవేశపెట్టిన రోజు లేదా మరుసటి రోజే అన్ని బిల్లులను ఆమోదించాయి.

  • కేరళ, మేఘాలయ అసెంబ్లీలు 90శాతానికి పైగా బిల్లులను ఆమోదించడానికి ఐదు రోజులకు పైగా సమయం తీసుకున్నాయి.

  • అన్ని రాష్ట్రాల్లో కలిపి 59 శాతం బిల్లులకు సగటున నెల రోజుల్లోపే గవర్నర్‌ ఆమోదం లభించింది. బిహార్‌, గుజరాత్‌, హరియానా, యూపీ సహా ఏడు రాష్ట్రాలో నెల రోజుల్లోపే అన్ని బిల్లులు ఆమోదం పొందాయి.

  • అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెండు నెలలకు కూడా అత్యధిక శాతం బిల్లులు ఆమోదం పొందని రాష్ట్రాలు... అసోం (80ు), నాగాల్యాండ్‌ (57ు), జార్ఖండ్‌ (50ు), పశ్చిమ బెంగాల్‌ (50ు).

  • పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో బిల్లు పాస్‌ అయిన తర్వాత ఆమోదం పొందడానికి సగటున 92 రోజులు పట్టగా, అసోం- 73 రోజులు, జార్ఖండ్‌- 72 రోజులు, కేరళ-67 రోజులు, హిమాచల్‌ప్రదేశ్‌-55 రోజులతో ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.

  • బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్‌ జాప్యం చేయడాన్ని 2023 నవంబరులో కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఇదే అంశంపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

Updated Date - Apr 29 , 2024 | 04:34 AM