Share News

Ramdas: పొత్తు లేకున్నా 7 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తాం..

ABN , Publish Date - Feb 02 , 2024 | 01:50 PM

రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీతో పొత్తుపెట్టుకునేందుకు ఆరాటపడుతున్నాయని, ఏ పార్టీతో పొత్తుపెట్టుకోకపోయినా ఏడు నియోజకవర్గాల్లో గెలిచే సత్తా తమకుందని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌(Dr. Ramdas) ధీమా వ్యక్తంచేశారు.

Ramdas: పొత్తు లేకున్నా 7 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తాం..

- పీఎంకే సర్వసభ్యమండలిలో రాందాస్‌ ధీమా

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీతో పొత్తుపెట్టుకునేందుకు ఆరాటపడుతున్నాయని, ఏ పార్టీతో పొత్తుపెట్టుకోకపోయినా ఏడు నియోజకవర్గాల్లో గెలిచే సత్తా తమకుందని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌(Dr. Ramdas) ధీమా వ్యక్తంచేశారు. ఎగ్మూరులోని కళ్యాణమండపంలో జరిగిన పీఎంకే సర్వసభ్యమండలి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం ఇటు డీఎంకే, అటు అన్నాడీఎంకే పీఎంకేని తమ కూటమిలో చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు తోడు బీజేపీ నాయకులు కూడా పీఎంకే నేతలతో రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. ఈ పరిస్థితులలో పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య మండలి సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ లోక్‌సభ ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా ఇప్పటి నుండే శ్రమించాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోదలిచామని, ఒంటరిగా పోటీచేస్తే ఏడు నియోజకవర్గాల్లో, పొత్తుపెట్టుకుని పోటీ చేస్తే 10 నియోజకవర్గాలలో గెలిచి తీరుతామని రాందాస్‌ అన్నారు. సమావేశంలో పీఎంకే గౌరవాధ్యక్షుడు జీకే మణి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఏకే మూర్తి, అరుళ్‌మొళి, శాసనసభ్యులు ఇరా అరుళ్‌, వెంకటేశన్‌, సదాశివం, పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.

రాందాస్‌కే పొత్తుపై నిర్ణయాధికారం..

ఈ సమావేశంలో పార్టీ నేత అన్బుమణి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం వెల్లివిరిసిందని, ప్రస్తుతం లోక్‌సభలో పార్టీ సభ్యులు ఎవరూ లేకపోవడంతో బలహీనవర్గాలవారికి జాతీయ స్థాయి రిజర్వేషన్లలో స్థానం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ తీర్మానం చేసి ఆమోదించారు. వన్నియార్లకు రిజర్వేషన్లు కల్పించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం చేశారు. చివరగా లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందా్‌సకు అప్పగిస్తూ తీర్మానం చేశారు.

Updated Date - Feb 02 , 2024 | 01:50 PM