Share News

LokSabha Elections:కాంగ్రెసకు రాహుల్‌ జవసత్వాలు

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:00 AM

కాంగ్రెస్‌.. పడి లేచింది. దేశ రాజకీయ రంగస్థలం నిజంగానే కాంగ్రెస్‌ ముక్త్‌ కాబోతోందా అనే పరిస్థితి నుంచి కోలుకొని ఉనికిని మరోసారి బలంగా చాటుకుంది. ఈ మార్పు వెనక ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కృషి కీలకం. వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో (2014, 2019) కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయాలు చవి చూసింది.

LokSabha Elections:కాంగ్రెసకు రాహుల్‌ జవసత్వాలు

  • సంక్షోభంలో పార్టీని నిలబెట్టిన నేత.. అవమానాలెదుర్కొంటూ అడుగులు

  • భారత్‌జోడో యాత్రతో ప్రజల్లోకి.. పేదల పార్టీగా కాంగ్రెస్‌ ఇమేజీ పెంపు

  • మేనిఫెస్టోలో ఆర్థిక, సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయానికి పెద్ద పీట

  • బీజేపీతో రిజర్వేషన్లకు ముప్పు అంటూ ప్రచారం.. జనంపై ప్రభావం

కాంగ్రెస్‌.. పడి లేచింది. దేశ రాజకీయ రంగస్థలం నిజంగానే కాంగ్రెస్‌ ముక్త్‌ కాబోతోందా అనే పరిస్థితి నుంచి కోలుకొని ఉనికిని మరోసారి బలంగా చాటుకుంది. ఈ మార్పు వెనక ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కృషి కీలకం. వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో (2014, 2019) కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయాలు చవి చూసింది. పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేనన్ని తక్కువ స్థానాలకు పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి. అంతటి బలహీన స్థితిలో ఉన్న కాంగ్రెస్‌ అత్యంత బలవంతుడైన నరేంద్రమోదీని ఎదుర్కోవాల్సి రావడం రాహుల్‌కు విషమ పరీక్ష పెట్టాయి.

కాంగ్రెస్‌ పార్టీ 139 ఏళ్ల చరిత్రలో రాహుల్‌గాంధీ ఎదుర్కొన్నంత తీవ్రమైన సవాళ్లను మరే నేతా ఎదుర్కోలేదంటే అతిశయోక్తి కాదు. రాహుల్‌ మాట్లాడిన ప్రతి మాటను బీజేపీ వాళ్లు ఎద్దేవా చేశారు. పప్పూ అంటూ వెక్కిరించారు. సోషల్‌ మీడియాలో ఒక జోకర్‌లా మార్చివేశారు. రాహుల్‌గాంధీని ఒక విఫలనేతగా, రాజకీయాల్లో ఆసక్తి లేని, సీరియ్‌సనెస్‌ లేని నేతగా ప్రచారం చేశారు. ఇదిలా ఉండగా, మరోవైపు.. కేంద్రంలోని మోదీ సర్కార్‌ కాంగ్రె్‌సతోపాటు ఇతర విపక్షాలను బలహీనపర్చటంపై దృష్టి పెట్టింది. పార్టీలను చీల్చింది. విపక్ష ప్రభుత్వాలను గద్దె దించింది. అయితే, దేశ చరిత్రలో ఒకదశలో (ముఖ్యంగా ఇందిర హయాంలో) కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇలాంటి పనులే చేసింది కాబట్టి, బీజేపీని గట్టిగా విమర్శించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీని గట్టెక్కించటానికి, తనను తాను రాజకీయ నేతగా నిరూపించుకోవటానికి రాహుల్‌గాంధీ ఎంచుకున్న మార్గం ప్రజల వద్దకు వెళ్లటం.

దేశ ప్రజానీకం మధ్య బీజేపీ మతం పేరిట చిచ్చు పెడుతోందని, దీనికి వ్యతిరేకంగా భారతీయులను ఐక్యపరిచే లక్ష్యంతో పాదయాత్రను చేపడతానని ప్రకటించారు. 2022 సెప్టెంబరు 7న.. కన్యాకుమారి నుంచి రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర మొదలైంది. దారి పొడవునా రాహుల్‌ అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. 150 రోజులపాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3,570 కి.మీ.ల మేర నిరవధికంగా జరిగిన ఈ పాదయాత్ర కశ్మీర్‌లో ముగిసింది. ఈ పాదయాత్ర రాహుల్‌ ఇమేజ్‌ను మార్చివేసింది. అనంతరం, లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవటానికి వీలుగా ఇండియా కూటమి ఏర్పాటులో కూడా రాహుల్‌ నిర్ణయాత్మక పాత్ర పోషించారు. భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరిపారు.

సీట్ల సర్దుబాటులో రాజీ ధోరణి చూపారు. పలు రాష్ట్రాల్లో తక్కువ స్థానాలకు పరిమితమై, స్థానికంగా బలంగా ఉన్న ప్రాంతీయపార్టీలు ఎక్కువ సీట్లు తీసుకోవటానికి అంగీకరించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో రూపకల్పనలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేయటంలో రాహుల్‌ ముద్ర సుస్పష్టం.


  • సంక్షేమ పథకాలతో ప్రజల వద్దకు..

పేద మహిళలకు ఏటా రూ.లక్ష సాయం, నిరుద్యోగ యువతకు రూ.లక్ష, రైతులకు మద్దతు ధర వంటి ఆకర్షణీయ సంక్షేమ నినాదాలతో వచ్చిన కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఆయా వర్గాల దృష్టిని ఆకర్షించింది. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తామని, 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, వాటిలో సగం మహిళలకే కేటాయిస్తామని, అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేసి సైనిక నియామకాలను ఎప్పటిలాగే శాశ్వత ప్రాతిపదికన చేపడతామని ప్రకటించింది. ఈ అంశాలను రాహుల్‌ ఎన్నికల సభల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.

  • రాహుల్‌ డబుల్‌ విక్టరీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో డబుల్‌ విక్టరీ సాధించారు. పోటీ చేసిన రెండు చోట్లా భారీ మెజారిటీ సాధించడం విశేషం. వయనాడ్‌లో తన ప్రత్యర్థి అయిన సీపీఐ నేత అన్నీ రాజాపై 3,64,422 ఓట్ల మెజారీటీతో గెలుపెందారు. ఇక కాంగ్రె్‌సకు గట్టి పట్టున్న రాయ్‌బరేలీ స్థానంలో బీజేపీ అభ్యర్థి దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌పై రాహుల్‌ 3,89,341 ఓట్ల మెజారీటీ సాధించారు.

  • బెడిసికొట్టిన మోదీ ప్రచారం!

మోదీ తన పదేళ్ల హయాంలో ప్రజలకు ఏం చేశాననేది చెప్పకుండా కాంగ్రె్‌సను తిట్టిపోయడంపైనే ప్రచారాన్ని కేంద్రీకరించారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అని నినదించిన మోదీ.. పదేళ్ల తర్వాత అదే కాంగ్రెస్‌ కేంద్రంగా ప్రచారం నిర్వహించటం విశేషం. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను లాక్కొని ముస్లింలకు ఇస్తుందని, మహిళల మంగళసూత్రాలను కూడా వదిలిపెట్టదని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రజలు ఇష్టపడలేదని తాజా ఫలితాలు రుజువు చేస్తున్నాయి.

Updated Date - Jun 05 , 2024 | 05:01 AM