Share News

Rahul Gandhi: బిల్కిస్ బానో కేసులో సుప్రీం తీర్పు.. అహంకార బీజేపీపై విజయమంటూ రాహుల్ ధ్వజం

ABN , Publish Date - Jan 08 , 2024 | 07:11 PM

బిల్కిస్ బానో కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన సంచలన తీర్పుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ఆమెకు న్యాయం దక్కిందని హర్షం చేసిన ఆయన..

Rahul Gandhi: బిల్కిస్ బానో కేసులో సుప్రీం తీర్పు.. అహంకార బీజేపీపై విజయమంటూ రాహుల్ ధ్వజం

Rahul Gandhi: బిల్కిస్ బానో కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన సంచలన తీర్పుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ఆమెకు న్యాయం దక్కిందని హర్షం చేసిన ఆయన.. ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వంపై కూడా ధ్వజమెత్తారు. బిల్కిస్ బానో చేసిన అలుపెరుగని పోరాటం.. అహంకార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ‘‘ఎన్నికల ప్రయోజనాల కోసం న్యాయాన్ని చంపేసే ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో ప్రమాదకరం. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతో.. నేరస్థుల్ని ఎవరు పోషిస్తున్నారో మరోసారి తేలిపోయింది. బిల్కిస్ బానో అలుపెరగని పోరాటం.. అహంకార బీజేపీ ప్రభుత్వంపై న్యాయ విజయానికి ప్రతీక’’ అని ఎక్స్ వేదికగా రాహుల్ చెప్పుకొచ్చారు.

రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా సుప్రీంకోర్టు నిర్ణయంపై స్పందించారు. ఇది న్యాయ విజయమని ఆమె పేర్కొన్నారు. ‘‘సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. బీజేపీ మహిళా వ్యతిరేక విధానాలను బహిర్గతం చేసింది. దీని తర్వాత న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం మరింత బలపడుతుంది. తన పోరాటాన్ని ధైర్యంగా కొనసాగించినందుకు బిల్కిస్ బానోకి అభినందనలు’’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించారు. భవిష్యత్తులో రేపిస్టులందరికీ ఈ తీర్పున ఒక ఉదాహరణగా పని చేస్తుందని తాను ఆశిస్తున్నానని అన్నారు. మహిళా సాధికారత విషయంలో బీజేపీ చేస్తున్న వాదనలన్నీ బూటకమని ఇది నిరూపిస్తుందన్నారు. గుజరాత్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు బిల్కిస్ బానో నేరస్థులను విడుదల చేయడంలో సహాయపడ్డాయని.. ఆమె కుటుంబానికి వీళ్లు క్షమాపణ చెప్పాలని ఒవైసీ డిమాండ్ చేశారు.


ఇదిలావుండగా.. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచార ఘటన జరిగింది. బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేసి, ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. దోషులు 15ఏళ్లు కారాగారంలో గడిపారు. అనంతరం.. దోషుల్లో ఒకరు తనని విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని సుప్రీంకోర్టు గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి.. ఈ కేసులో దోషులకు రెమిషన్ మంజూరు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ క్రమంలోనే గుజరాత్‌ కోర్టు రెమిషన్‌ మంజూరు చేయడంతో.. దోషులంతా 2022 ఆగస్టు 15న విడుదలయ్యారు.

అయితే.. దోషుల్ని ఇలా జైలు నుంచి ముందుగానే విడుదల చేయడంపై సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం.. గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేసింది. ఈ కేసు విచారణ మహారాష్ట్రలో జరిగినందున.. దోషులకు రెమిషన్‌ మంజూరు చేసే అధికారం గుజరాత్‌ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ఆ 11 మంది రెండు వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Updated Date - Jan 08 , 2024 | 07:11 PM