Karpoori Thakur: కర్పూరి సేవలు మరువలేనివి.. ఆయన చూపిన బాటలోనే పయనిస్తున్నామన్న ప్రధాని మోదీ
ABN , Publish Date - Jan 24 , 2024 | 12:50 PM
బిహార్(Bihar) జన నాయక్‌గా ప్రసిద్ధి చెందిన మాజీ సీఎం, దివంగత కర్పూరి ఠాకూర్(Karpoori Thakur) సమాజానికి చేసిన సేవలు మరువలేనివని ప్రధాని మోదీ (PM Modi)అన్నారు. ఆయన శత జయంతి సందర్భంగా కేంద్రం భారత రత్న ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఠాకూర్ సేవలను గుర్తు చేసుకుంటూ మోదీ ఓ పోస్ట్ చేశారు.
ఢిల్లీ: బిహార్(Bihar) జన నాయక్‌గా ప్రసిద్ధి చెందిన మాజీ సీఎం, దివంగత కర్పూరి ఠాకూర్(Karpoori Thakur) సమాజానికి చేసిన సేవలు మరువలేనివని ప్రధాని మోదీ (PM Modi)అన్నారు. ఆయన శత జయంతి సందర్భంగా కేంద్రం భారత రత్న ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఠాకూర్ సేవలను గుర్తు చేసుకుంటూ మోదీ ఓ పోస్ట్ చేశారు. ఇందులో కర్పూరి జీవితంలో ప్రధాన సంఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు.
"సామాజిక న్యాయం కోసం నిరంతరాయంగా పోరాడిన కర్పూరి ఠాకూర్ కోట్ల మంది జీవితాల్లో మార్పులు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆయనకు ఎదురైన అనేక అడ్డంకులను అధిగమించారు. అత్యంత వెనకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చి.. జీవితాంతం నిరాడంబరత, సామాజిక న్యాయం అనే స్తంభాలపై నిలబడ్డారు. సీఎం పదవిలో ఉండి కూడా తన కుమార్తె వివాహాన్ని సొంత డబ్బులతో జరిపించారు. 1977లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కేంద్రంలో, బిహార్‌లో జనతా ప్రభుత్వం అధికారంలో ఉంది. ఓ కార్యక్రమానికి కర్పూరి చిరిగిన కుర్తాతో హాజరయ్యారు. కొత్తది కొనుగోలు చేయడానికి ఆయనకు విరాళాలు ఇచ్చారు.
కానీ ఠాకూర్ తన నిస్వార్థ స్వభావంతో ఆ డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, రాజకీయ నాయకుల కోసం ఒక కాలనీని నిర్మించాలని అనుకున్నారు. కానీ అందుకోసం ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు, భూమి తీసుకోలేదు. 1988లో కర్పూరి మరణించినప్పుడు చాలా మంది నేతలు ఆయన గ్రామానికి వెళ్లి నివాళులర్పించారు. అక్కడ మహానేత ఇంటి పరిస్థితిని చూసిన వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంత మహోన్నతమైన వ్యక్తి ఇల్లు ఇంత సాదాసీదాగా ఉంటుందా అని ఆశ్చర్యపోయారు. ఠాకుర్ సేవల్ని ఉపయోగించుకునే సమయంలోనే దురదృష్టవశాత్తు ఆయన మనకు దూరమయ్యారు. కానీ ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయారు. నిజమైన జన నాయక్ ఆయనే.." అంటూ మోదీ తన వ్లాగ్‌లో రాసుకొచ్చారు.
కర్పూరి ఠాకూర్ ఎవరు?
బీహార్‌ని సమస్తిపూర్‌లో 1924 జనవరి 24న ఠాకూర్ జన్మించారు. నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆయన విద్యార్థి దశ నుంచే జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. అనంతరం రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ తొలిసారి 1952లో సోషలిస్ట్ పార్టీ టిక్కెట్టుపై బీహార్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1968లో బీహార్ ఉప ముఖ్యమంత్రిగా, 1970లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. సామాజిక న్యాయం, పేదలు, దళితుల సంక్షేమానికి ఆయన విశేషంగా పాటుపడ్డారు. లోహియా సిద్ధాంతాల పట్ల ఆయన విశేష గౌరవం కనబరచేవారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతులకు సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఉద్దేశించిన 'కర్పూరి ఠాకూర్ ఫార్ములా'ను సీఎంగా ఉన్నప్పుడు ఆయన తీసుకువచ్చారు. 1978లో బీహార్‌లో బీసీలకు 26 శాతం రిజర్వేషన్ అమలు చేశారు. జననాయక్‌గా పేరు తెచ్చుకున్నారు.
"మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"