Share News

విపక్ష నేతలు అజ్ఞానులు

ABN , Publish Date - Apr 14 , 2024 | 03:30 AM

ప్రతిపక్ష నేతలు అజ్ఞానులని ప్రధాని మోదీ ఎద్దేవాచేశారు. ఆ మాటంటే... ఒకానొక నాయకుడి (రాహుల్‌గాంధీ)ని ఉద్దేశించే అన్నానని అనుకుంటారని వ్యాఖ్యానించారు....

విపక్ష నేతలు అజ్ఞానులు

ఆ మాటంటే ఓ నేతను ఉద్దేశించేనంటారు

గేమర్స్‌తో ప్రధాని మాటామంతీ

కాంగ్రెస్‌ పార్టీకి భజన చేస్తున్న ఎంఐఎం

బీజేపీ ప్రజాదరణ చూసి ఒవైసీకి భయం

అందుకే హస్తంతో దోస్తీ: కిషన్‌రెడి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13: ప్రతిపక్ష నేతలు అజ్ఞానులని ప్రధాని మోదీ ఎద్దేవాచేశారు. ఆ మాటంటే... ఒకానొక నాయకుడి (రాహుల్‌గాంధీ)ని ఉద్దేశించే అన్నానని అనుకుంటారని వ్యాఖ్యానించారు. వీడియో గేమ్స్‌కు పలువురు బానిసలు కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. శనివారమిక్కడ ప్రముఖ గేమర్స్‌ నమన్‌ మాధుర్‌ (మోర్టల్‌), అనిమేశ్‌ అగర్వాల్‌ (థగ్‌), అంశు బిషు (గేమర్‌ఫ్లీట్‌), గణేశ్‌ గంగాధర్‌ (ఎస్‌క్రాసీ), తీర్థ మెహతా (జిసిటిర్థ్‌), పాయల్‌ ధరే (పాయల్‌ గేమింగ్‌), మిథిలేశ్‌ పటాంకర్‌ (మిత్‌ప్యాట్‌)తో ఆయన పిచ్చాపాటీగా సంభాషించారు. నైపుణ్య సంబంధ గేమ్స్‌కు, వేగంగా డబ్బు సంపాదించే అవకావమున్న గేమ్స్‌కు మధ్య తేడా ఏమిటని ఆరా తీశారు. వారు ఈ సందర్భంగా ఆయనకు ‘నమో ఓప్‌’ అని కొత్త పేరు పెట్టారు. ‘ఓప్‌ అంటే.. అత్యంత శక్తిమంతుడు. దేశంలో మీరు అత్యున్నత శక్తిమంతుడు. మాలాగే మీరు కూడా జనరేషన్‌ జూమర్‌ (జెన్‌ జడ్‌) కాబట్టి.. ఇక నుంచి మా లైవ్‌స్ట్రీమ్‌ చాట్లలో మిమ్మల్ని నమో ఓప్‌ అని పిలుస్తాం’ అని తెలిపారు. ఆయన వారితో కొన్ని స్వదేశీ గేమ్స్‌ కూడా ఆడారు. వీటికి తాను బానిస కాకూడదని కోరుకుంటున్నానని మోదీ నవ్వుతూ అన్నారు. థగ్‌ అగర్వాల్‌ తనను తాను పరిచయం చూసుకునే క్రమంలో తొట్రుపడ్డారు. కాస్త భయంగా మాట్లాడుతూ.. చాలా చిన్నప్పుడే చదవడం మొదలుపెట్టానని అన్నాడు . అతడి టెన్షన్‌ పోగొట్టడానికి ప్రధాని ప్రయత్నించారు. అందరూ చిన్నప్పుడే స్కూలుకు వెళ్తారని అనడంతో అందరూ పెద్దగా నవ్వేశారు. భుజ్‌ నుంచి వచ్చిన మరో గేమర్‌తో ఆయన మాట్లాడుతూ.. భుజ్‌లో ఈ గేమింగ్‌ ఫీవర్‌ ఎప్పుడొచ్చిందని ప్రశ్నించారు. 2019లో ‘యే పబ్జీ వాలా క్యా హై’ అని తాను చేసిన ప్రకటనను ప్రస్తావించారు. ఆయన చమత్కారాన్ని ముచ్చటపడిన గేమర్స్‌.. ఆయన్ను ‘కూలెస్ట్‌ ప్రధాని’, ‘దేశంలోనే అతిపెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌’ అని అభివర్ణించారు. మోదీ తమతో మాట్లాడిన తీరు చూస్తే ఆయనకు, తమకు వయోభేదం ఉన్నట్లు అనిపించలేదని ఇంకో గేమర్‌ అన్నాడు. ప్రధాని స్పందిస్తూ.. ‘వయోభేదం ఉందని ఎవరు అన్నారు? పెద్ద మనిషిలా కనిపించడానికి నేను నా జుట్టుకు తెల్లరంగు వేసుకుంటా’ అని చలోక్తి విసరడంతో అందరూ నవ్వారు. కొన్ని గేమింగ్‌ టెక్నాలజీలను, వాటి పదాలను కూడా వారు ఆయనకు నేర్పించారు. ఈ సందర్భంగానే ‘గ్రిండ్‌ (కష్టించి పనిచేయడం)’, ‘నూబ్‌(కంప్యూటర్‌ పరిజ్ఞానం లేకపోవడం)’ వంటి పదాలను ప్రస్తావించారు. ‘నూబ్‌’ అనే పదం వినగానే ఆయన నవ్వు ఆపులేకపోయారు. ఆ మాట తానంటే ఓ నాయకుడి(రాహుల్‌)ని ఉద్దేశించి అన్నానని అందరూ అనుకుంటారని వ్యాఖ్యానించారు. ఓ గేమర్‌ స్పందిస్తూ... ‘సర్‌! ఈ మాటకు మీకు ముందుగానే అర్థం తెలుసు కదా!’ అని అన్నాడు. తన పాలనకు సంబంధించి గేమింగ్‌ పదాలను కూడా మోదీ వారికి నేర్పించారు. అందులో పీ2జీ2 ఒకటి.. ‘ప్రొ పీపుల్‌.. గుడ్‌ గవర్నెన్స్‌’ నుంచి ఈ పదాన్ని సృష్టించారు.

Updated Date - Apr 14 , 2024 | 03:30 AM