Share News

INDIA bloc: ఆ పేరు వద్దని చెప్పినా వినలేదు: నితీష్ కుమార్

ABN , Publish Date - Jan 31 , 2024 | 02:30 PM

'ఇండియా' బ్లాక్‌ నుంచి అనూహ్యంగా తప్పుకుని బీజేపీతో చేతులు కలిపిన బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కు అసలు విపక్ష కూటమికి 'ఇండియా' అనే పేరు పెట్టడమే ఇష్టం లేదట. ఇదే విషయాన్ని ఆయన బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. విపక్ష కూటమికి 'ఇండియన్ నేషనల్ డవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్' పేరు వద్దని తాను కాంగ్రెస్‌కు, ఇతర విపక్ష కూటమి నేతలకు చెప్పానని తెలిపారు.

INDIA bloc: ఆ పేరు వద్దని చెప్పినా వినలేదు: నితీష్ కుమార్

పాట్నా: 'ఇండియా' (I.N.D.I.A.) బ్లాక్‌ నుంచి అనూహ్యంగా తప్పుకుని బీజేపీతో చేతులు కలిపిన బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ (Nitish kumar)కు అసలు విపక్ష కూటమికి 'ఇండియా' అనే పేరు పెట్టడమే ఇష్టం లేదట. ఇదే విషయాన్ని ఆయన బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. విపక్ష కూటమికి 'ఇండియన్ నేషనల్ డవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్' పేరు వద్దని తాను కాంగ్రెస్‌కు, ఇతర విపక్ష కూటమి నేతలకు చెప్పానని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల షేరింగ్ అవగాహనను ఖరారు చేయడంలో కూటమి మీనమేషాలు లెక్కపెడుతుండటం వల్లనే తాను ఎన్డీయేలో చేరాల్సి వచ్చిందంటూ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.


''విపక్ష కూటమిని మరో పేరు ఎంచుకోవాలని కోరాను, కానీ అప్పటికీ వారు ఆ పేరు ఖరారు చేశారు. నేను ఎంత ప్రయత్నించినా పెడచెవిని పెట్టారు. ఈరోజుకు కూడా ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే నిర్ణయానికి రాలేదు. ఈ కారణం వల్లే నేను వెనక్కి వచ్చాను. ఇంతకుముందు ఎవరితో పనిచేశానో వారితోనే కలిసాను. బీహార్ ప్రజల కోసం నేను పనిచేస్తూనే ఉంటాను'' అని నితీష్ తెలిపారు.


క్రెడిట్ కొట్టేయాలనుకున్న రాహుల్

బీహార్ కుల గణన క్రెడిట్‌ను దక్కించుకోవాలని రాహుల్ గాంధీ ప్రయత్నించారని నితీష్ తప్పుపట్టారు. కులగణన ఎప్పుడు జరిగిందో రాహుల్ మరిచిపోయారా? అని ప్రశ్నించారు. 9 పార్టీల సమక్షంలో తాను కులగణన చేపట్టానని, 2019-2020లో కులగణన అంశంపై అసెంబ్లీ నుంచి బహిరంగ సభల వరకూ ప్రతిచోట మాట్లాడానని, అయితే రాహుల్ ఈ ఘనతను తాను దక్కించుకోవాలని చూశారని నితీష్ ఆరోపించారు.

Updated Date - Jan 31 , 2024 | 02:38 PM