Share News

National : ఆద్య కళకు అరుదైన గౌరవం

ABN , Publish Date - Jun 20 , 2024 | 02:46 AM

ఆదివాసీ, గిరిజన, జానపద వస్తు సంచయానికి అరుదైన గౌరవం లభించింది. కొన్ని వందల ఏళ్లుగా విస్మరణకు లోనవుతున్న శ్రమైక జీవనం తాలూకూ ఆనవాళ్లకు ఆలవాలమైన ఆద్య కళలోనిఅపురూప కళాఖండాలను పరిరక్షించే బాధ్యతను........

National : ఆద్య కళకు అరుదైన గౌరవం

ఆదివాసీ, జానపద వస్తు సంచయం పరిరక్షణకు ముందుకొచ్చిన ఐజీఎన్‌సీఏ

ఆచార్య జయధీర్‌ బృందంతో ఒప్పందం

న్యూఢిల్లీ/హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): ఆదివాసీ, గిరిజన, జానపద వస్తు సంచయానికి అరుదైన గౌరవం లభించింది. కొన్ని వందల ఏళ్లుగా విస్మరణకు లోనవుతున్న శ్రమైక జీవనం తాలూకూ ఆనవాళ్లకు ఆలవాలమైన ఆద్య కళలోనిఅపురూప కళాఖండాలను పరిరక్షించే బాధ్యతను న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌ (ఐజీఎన్‌సీఏ) స్వీకరించనుంది. ఆద్య కళ వస్తు సంచయ సేకర్త ఆచార్య జయధీర్‌ తిరుమలరావు బృందం బుధవారం ఐజీఎన్‌సీఏ కేంద్ర కార్యాలయంలో ఆ సంస్థ సభ్య కార్యదర్శి సచ్చిదానంద జోషిని కలిసింది.

ఈ సందర్భంగా కళా రంగాల చరిత్ర, కళల పరిరక్షణతో పాటు ఆదివాసీ, జానపద చిత్రాలు, పటాలను భవిష్యత్తు తరాలకు అందించేలా జాగ్రత్త చేసే బాధ్యతను స్వీకరిస్తున్నట్టు ఆద్య కళ నిర్వాహకులతో ఐజీఎన్‌సీఏ ప్రతినిధులు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. గత ఏడాది ఐజీఎన్‌సీఏకు చెందిన బృందం హైదరాబాద్‌లోని ఆద్య కళలో కొలువుదీరిన కళాఖండాలు, చారిత్రక వస్తువులను సందర్శించింది. ఆ క్రమంలో వారు రూపొందించిన నివేదిక ఆధారంగా ఎంవోయూ కుదిరింది.


కళల అధ్యయనం, పరిరక్షణలో భాగంగా నిపుణులను పంపి, ఆద్య కళలోని వస్తు సంచయాన్ని పరిరక్షిస్తామని జోషి తెలిపారు. అలాగే గుంజల గోండి లిపి శిక్షణా శిబిరం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటైన ‘జన్‌జాతీయ దర్పణ్‌’ ప్రదర్శనలో ఆద్య కళ సేకరించిన 170 కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని, అవి సందర్శకుల మన్ననలు పొందుతున్నాయని ఆద్య కళ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గూడూరు మనోజ పేర్కొన్నారు.

గిరిజన, జానపద, గ్రామీణ కళలకు చేయూతనివ్వడంతో పాటు ఆద్య కళ మ్యూజియం ఏర్పాటుకు సహకరిస్తామని సీఎం రేవంత్‌ హామీ ఇవ్వడం శుభపరిణామమని జయధీర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆద్య కళ మ్యూజియం ఏర్పాటైతే ఆదివాసీ, గిరిజనులతో పాటు అనేక తెగలు, సమూహాలు, శ్రమజీవుల సంస్కృతికి గౌరవం లభించినట్లేనన్నారు. గత పదేళ్ళలో సాంస్కృతికంగా కొనియాడదగిన పని ఒక్కటి కూడా జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజా సంస్కృతిని పరిరక్షించే బృహత్‌ కార్యాచరణను రూపొందించడంతో పాటు ఆదిశగా రేవంత్‌ ప్రభుత్వం అడుగులు వేయాలని ఆకాంక్షించారు.

Updated Date - Jun 20 , 2024 | 02:46 AM