Share News

Minister Shivashankar: కార్మికులు సమ్మెకు దిగినా బస్సులు నడుపుతాం..

ABN , Publish Date - Jan 05 , 2024 | 09:54 AM

రవాణా కార్మికులు సమ్మె చేపట్టినా బస్సులను నడిపితీరుతామని రవాణాశాఖ మంత్రి శివశంకర్‌(Minister Shivashankar) ప్రకటించారు. 15వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం వేతనాలు పెంచాలని, ఇతర సదుపాయాలను కల్పించాలని కోరుతూ

Minister Shivashankar: కార్మికులు సమ్మెకు దిగినా బస్సులు నడుపుతాం..

- రవాణాశాఖ మంత్రి శివశంకర్‌

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రవాణా కార్మికులు సమ్మె చేపట్టినా బస్సులను నడిపితీరుతామని రవాణాశాఖ మంత్రి శివశంకర్‌(Minister Shivashankar) ప్రకటించారు. 15వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం వేతనాలు పెంచాలని, ఇతర సదుపాయాలను కల్పించాలని కోరుతూ ప్రభుత్వ రవాణా సంస్థలలో పనిచేస్తున్న కార్మికులు కొద్ది మాసాలుగా డిమాండ్‌ చేస్తున్నారు. కార్మికులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు కూడా సంక్రాంతి లోపున చెల్లించాలని కూడా కోరుతున్నారు. ఈ అంశాలపై కార్మికుల సంక్షేమ శాఖ డిప్యూటీ కమిషనర్‌ అధ్యక్షతన రెండుసార్లు జరిగిన త్రైపాక్షిక చర్యలు విఫలమయ్యాయి. బుధవారం జరిగిన చర్చలలో పింఛన్‌దారులకు చెల్లించాల్సి డీఏ బకాయిలను సంక్రాంతిలోపు చెల్లించాలని కార్మిక సంఘాల నేతల పట్టుబట్టారు. కానీ ఆ డిమాండ్‌ గురించి ప్రభుత్వ పరంగా ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 9 నుండి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు కార్మిక సంఘాలు నేతలు సంయుక్తంగా ప్రకటించారు. పండుగ సమయంలో ఇలా రవాణా కార్మికులు సమ్మెకు దిగితే తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని ప్రజానీకం ఆందోళన చెందుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శివశంకర్‌ మాట్లాడుతూ... రవాణా కార్మికుల డిమాండ్‌లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, కాకపోతే సంక్రాంతి తర్వాత చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని తాను చేసిన ప్రతిపాదనను కార్మిక సంఘాల నేతలు తోసిపుచ్చారని ఆరోపించారు. సాధ్యమైనంతవరకూ సమ్మెను అడ్డుకునేందుకు ప్రభుత్వపరంగా కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరుపుతామన్నారు. అన్నాడీఎంకేకు చెందిన కార్మిక సంఘం సహా కొన్ని సంఘాలు సంక్రాంతి లోపునే అన్ని డిమాండ్‌లు పరిష్కరించాలని పట్టుబట్టాయన్నారు. రవాణా శాఖ పింఛన్‌దారులకు ఎనిమిదేళ్లుగా డీఏ బకాయిలు చెల్లించలేదన్న ఆరోపణ సరికాదని, అన్నాడీఎంకే ప్రభుత్వ హాయంలో ఐదేళ్లపాటు డీఏ చెల్లించలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రవాణా కార్మికుల వేతనాల హెచ్చింపులో అవకతవకలు జరిగాయని, సీనియారిటీని పట్టించుకోలేదన్నారు. ఏదీ ఏమైనప్పటికీ రవాణా కార్మికులు సమ్మెకు దిగినా ప్రజలకు ఇబ్బంది కలుగకుండా బస్సులు నడిపే దిశగా చర్యలు చేపడుతున్నామని మంత్రి శివశంకర్‌ చెప్పారు.

Updated Date - Jan 05 , 2024 | 09:54 AM