Share News

Delhi: ‘ఇండియా’ ఓటుబ్యాంకుకు బీఎస్పీ గండి!

ABN , Publish Date - Apr 28 , 2024 | 03:46 AM

మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పలువురు ముస్లిం, ఓబీసీ, అగ్రవర్ణాల అభ్యర్థులను బరిలోకి దింపింది.

Delhi: ‘ఇండియా’ ఓటుబ్యాంకుకు బీఎస్పీ గండి!

దళితులకు రిజర్వుడ్‌ స్థానాల్లో మాత్రమే మాయావతి సీట్లు

  • బీజేపీ మేలుకేనని ఆరోపణలు.. బీ-టీమ్‌ అని విమర్శలు

మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పలువురు ముస్లిం, ఓబీసీ, అగ్రవర్ణాల అభ్యర్థులను బరిలోకి దింపింది. వీరి వల్ల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కంటే కూడా ఇండియా కూటమి అభ్యర్థులకే ఎక్కువగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు బీఎస్పీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో దళితులకు రిజర్వుడు స్థానాల్లో మాత్రమే సీట్లు కేటాయించడం గమనార్హం. గెలుపు గుర్రాల పేరిట 18 నియోజకవర్గాలలో ముస్లింలు, 14 స్థానాల్లో ఓబీసీలు ఆ పార్టీ బరిలోకి దింపింది.

పలు చోట్ల అగ్రవర్ణాల వారికి టికెట్లు కేటాయించింది. వీరివల్ల ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీజేపీతో బీఎస్పీ చేతులు కలిపిందని అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఆరోపించింది. అఖిలేశ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ పోటీ చేస్తున్న మెయిన్‌పురి నియోజకవర్గంలో బీఎస్పీ అకస్మాత్తుగా అభ్యర్థిని మార్చివేసి, యాదవ్‌ కులం అభ్యర్థిని బరిలోకి దింపడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. బీజేపీకి మేలు చేసేందుకే మెయిన్‌పురిలో అభ్యర్థిని బీఎస్పీ మార్చిందని ఎస్పీ ఆరోపించింది.


ఆ నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థులు..

తొలిదశలో పోలింగ్‌ జరిగిన సహరణ్‌పూర్‌, మొరాదాబాద్‌, రాంపూర్‌, ఫిలిభిత్‌తో పాటు సంభల్‌, ఆవ్లా, లఖ్‌నవూ, బదాయూన్‌, వారాణసీ, ఈతాహ్‌, దొమరియాగంజ్‌, కన్నౌజ్‌, గోరఖ్‌పూర్‌, సంత్‌ కబీర్‌నగర్‌, మహరాజ్‌గంజ్‌, ఫిరోజాబాద్‌, భదోహి నియోజకవర్గాలలో ముస్లిం అభ్యర్థులను బీఎస్పీ బరిలోకి దింపింది. సహరణ్‌పూర్‌, సంభల్‌, అమ్రోహా, రాంపూర్‌ నియోజకవర్గాలలో ఇండియా కూటమి నిలిపిన ముస్లిం అభ్యర్థుల గెలుపు అవకాశాలను వీరు దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బీఎస్పీ ముస్లిం అభ్యర్థులను నిలిపిన ఇతర నియోజకవర్గాల్లోనూ ముస్లిం ఓటర్ల సంఖ్య గణనీయంగానే ఉంది.

తద్వారా ఆ నియోజకవర్గాల్లోనూ ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు అవకాశాలను బీఎస్పీ దెబ్బతీసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని పార్టీల కంటే ఎక్కువగానే ముస్లిం అభ్యర్థులను బీఎస్పీ బరిలోకి దింపినప్పటికీ, వారంతా ఇండియా కూటమి ఓట్లకు గండికొట్టేవారేనని విశ్లేకులు చెబుతున్నారు. బీజేపీకి మేలు చేసేందుకే ముస్లిం ఓట్లను బీఎస్పీ చీల్చుతోందని ఎస్పీ ఆరోపించింది. బీజేపీకి బీ-టీమ్‌గా బీఎస్పీ పనిచేస్తోందని ఎస్పీ అధికార ప్రతినిధి ఐపీ సింగ్‌ విమర్శించారు. ‘బీఎస్పీకి బీజేపీపై పోరాడటం ప్రాధాన్యం కాదు. ఇండియా కూటమిపై ప్రత్యేకించి ఎస్పీపై పోరాడటమే బీఎస్పీకి ప్రాధాన్యం. అయితే, ఏ నాయకులు ఎవరి సంకేతాల మేరకు పనిచేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకున్నారు. బీఎస్పీకి చెందిన అనేకమంది బీసీ, దళిత, ముస్లిం నాయకులు ఎస్పీలో చేరిపోయారు. ఇప్పుడు ఒక్క ఓటు కూడా వృథా కాదు’ అని ఐపీ సింగ్‌ వ్యాఖ్యానించారు.


జనాభా ప్రాతిపదికనే ఆయా కులాలకు సీట్లు..

తమది జాతీయ పార్టీ అని, ఆయా కులాల జనాభా ప్రాతిపధికన బ్రాహ్మణులు, ముస్లింలు, దళితులు, ఓబీసీలకు ప్రతి ఎన్నికల్లోనూ తమ పార్టీ టికెట్లు కేటాయిస్తోందని బీఎస్పీ ఎమ్మెల్సీ భీంరావ్‌ అంబేడ్కర్‌ చెప్పారు. ‘2007లో బ్రాహ్మణులు మా పార్టీకి ఓట్లు వేశారు. బీఎస్పీ ఇప్పుడు వారికి మద్దతుగా నిలిచింది’ అని వివరించారు. నమ్మకమైన ఓటుబ్యాంకు ఉన్న బీజేపీ కంటే నమ్మకమైన ఓటు బ్యాంకు లేని ఎస్పీ, కాంగ్రెస్‌ ఓట్లనే బీఎస్పీ ఎక్కువగా చీల్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

‘గత ఎన్నికల్లో అగ్రకులస్థుల ఓట్లు బీజేపీకే పడటం గమనించాం. అందువల్ల బ్రాహ్మణులు, ఠాకూర్‌లు తదితర అగ్రకులాల అభ్యర్థులను బీఎస్పీ బరిలోకి దింపినప్పటికీ ఆయా కులాల ఓటర్లు తమ కులంలో గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థికే ఓటు వేస్తారు’ అని అంబేడ్కర్‌ వర్సిటీ రాజనీతి శాస్త్రం విభాగాధిపతి శశికాంత్‌ పాండే తేల్చిచెప్పారు. బీజేపీ వలే నమ్మకమైన ఓటర్లు ఎస్పీ, కాంగ్రె్‌సలకు లేరన్నారు. అందువల్ల బీజేపీ కంటే ఇండియా కూటమి ఓట్లకే బీఎస్పీ ఎక్కువగా గండి కొట్టే అవకాశం ఉందని విశ్లేషించారు. - సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - Apr 28 , 2024 | 06:52 AM