Share News

Elections: బీజేపీపై మళ్లీ దీదీ ఫైర్

ABN , Publish Date - Apr 05 , 2024 | 04:21 PM

బీజేపీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ది కోసం ఆ పార్టీ ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమిస్తోందని ఆరోపించారు. కూచ్ బిహార్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో బీజేపీని లక్ష్యంగా చేసుకొని ఆమె ఆరోపణలు గుప్పించారు.

Elections: బీజేపీపై మళ్లీ దీదీ ఫైర్
Mamata Banerjee

కోల్‌కత్తా, ఏప్రిల్ 05: బీజేపీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (mamata banerjee) మరోసారి నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ది కోసం ఆ పార్టీ ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమిస్తోందని ఆరోపించారు. కూచ్ బిహార్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో బీజేపీని లక్ష్యంగా చేసుకొని ఆమె ఆరోపణలు గుప్పించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఎన్ఐఏ, ఇన్‌కమ్ ట్యాక్స్, బీఎస్‌ఎఫ్‌తోపాటు సీఐఎస్ఎఫ్‌లు కాషాయం పార్టీ కోసం పని చేస్తున్నాయని ఆరోపించారు.

ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాలని విజ్జప్తి చేశారు. అవాస్ యోజనలో మరోసారి పేర్లు నమోదు చేసుకోవాలని బీజేపీ చెబుతుందని.. మళ్లీ పేర్ల నమోదు ప్రక్రియ ఎందుకని ఈ సందర్బంగా ఆమె ప్రశ్నించారు. బీజేపీని నమ్మితే.. విషపూరితమైన పామును నమ్మినట్లేనన్నారు.


దేశాన్ని బీజేపీ నాశనం చేస్తుందని ఈ సందర్బంగా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 19వ తేదీన నుంచి లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమవుతున్నాయన్నారు. ఆ క్రమంలో స్థానికులను సరిహద్దు భద్రత దళాలు ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయని సందేహం వ్యక్తం చేశారు. అలా జరిగితే.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూచ్ బిహర్‌ మహిళలకు సీఎం మమత సూచించారు. ఒక దేశం, ఒక పార్టీ సూత్రాన్ని బీజేపీ అనుసరిస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు నిషిత ప్రమాణిక్‌పై సీఎం మమత మండిపడ్డారు. ఆయనపై ఎన్నో కేసులు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని సైతం ప్రధాని మోదీ తన కేబినెట్‌లోకి తీసుకొని.. హోం శాఖ సహాయ మంత్రి పదవి కట్టబెట్టారని ఆరోపించారు. ఇది సిగ్గుచేటని ఆమె అభివర్ణించారు. అయితే గతంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీలో పని చేసిన నిషిత్ ప్రమాణిక్‌‌ను పార్టీ నుంచి బహిష్కరించిన విషయాన్ని ఈ సందర్బంగా సీఎం మమత గుర్తు చేశారు.


నిషిత్ ప్రామాణిక్.. గతంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీలో యువత విభాగంలో నాయకుడిగా ఉండే వారు. అయితే 2018లో ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన బీజేపీలో చేరారు. ఇక సీఏఏను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని.. దీనిని బెంగాల్‌లో అమలు చేయడానికి వీలు లేదన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమి లేదన్నారు. గతంలో ప్రతిపక్ష కూటమి ఇండియా ఏర్పాటులో తాను కీలక పాత్ర పోషించానని చెప్పారు. అసలు అయితే ఆ కూటమికి ఇండియా పేరు సైతం తానే పెట్టానన్నారు. అయితే పశ్చిమ బెంగాల్‌లో సీపీ(ఎం), కాంగ్రెస్‌ పార్టీలు బీజేపీ విజయం కోసం పని చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీని ఓడించాలంటే.. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయవద్దని సూచించారు. ఇక మైనార్టీ పార్టీలకు ఓటు వేస్తే.. తద్వారా ఓట్లు చీలి.. బీజేపీ లాభ పడి గెలుస్తుందని మమత బెనర్జీ తెలిపారు.

Updated Date - Apr 05 , 2024 | 04:21 PM