Khushboo: అనుమతి లేకుండా నా ఆడియో ఎలా రికార్డు చేస్తారు
ABN , Publish Date - Dec 31 , 2024 | 04:03 AM
తన అనుమతి తీసుకోకుండా తాను మాట్లాడిన విషయాన్ని ఏవిధంగా రికార్డు చేస్తారని నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంత దిగజారుతారనుకోలేదు: ఖుష్బూ
చెన్నై, డిసెంబరు 30: తన అనుమతి తీసుకోకుండా తాను మాట్లాడిన విషయాన్ని ఏవిధంగా రికార్డు చేస్తారని నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఫోన్‌లో చెప్పిన మాటలు వాస్తవమేనని, అయినప్పటికీ ఫోన్ సంభాషణను రికార్డు చేయడం సరికాదన్నారు. తమిళనాడులో జరుగుతున్న పరిణామాలపై స్పందించమని కోరుతూ ఇటీవల ఓ స్థానిక మీడియా సంస్థ ఫోన్ కాల్‌లో ఆమెను సంప్రదించగా.. ఆమె తమిళనాడు బీజేపీ తనను పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ ఆడియో రికార్డును సదరు మీడియా సంస్థ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. దీనిపై తాజాగా ఖుష్బూ స్పందించారు. ‘‘నా అనుమతి తీసుకోకుండా ఈవిధంగా నా వాయిస్ ఎలా రికార్డు చేస్తారు? మరి ఇంత దిగజారుతారని అనుకోలేదు. కానీ, నేను నిజమే చెప్పా. బీజేపీ కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించరు. కానీ, నేనేమీ పార్టీ మారడం లేదు’’ అని ఖుష్బూ పేర్కొన్నారు.