Share News

Delhi: మే 7 వరకు కేజ్రీవాల్‌, కవిత కస్టడీ పొడిగింపు..

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:12 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు మే 7 వరకు పొడిగించింది. ఈ కేసులో ఈడీ తొలుత కవితను, తర్వాత కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది.

Delhi: మే 7 వరకు కేజ్రీవాల్‌, కవిత కస్టడీ పొడిగింపు..

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు మే 7 వరకు పొడిగించింది. ఈ కేసులో ఈడీ తొలుత కవితను, తర్వాత కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. ఇద్దరి జ్యుడీషియల్‌ కస్టడీ మంగళవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఉదయం కేజ్రీవాల్‌, మధ్యాహ్నం 2 గంటలకు కవిత వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఇద్దరి కస్టడీని పొడిగించాలని దర్యాప్తు సంస్థలు న్యాయమూర్తి కావేరి భవేజాను కోరాయి.

కవితను మార్చి 15న హైదరాబాద్‌లోని నివాసంలో ఈడీ అరెస్టు చేసింది. కవిత తిహాడ్‌ జైలులో ఉండగా ఇదే కేసులో ఏప్రిల్‌ 11న సీబీఐ అరెస్టు చేసింది. 12న కోర్టులో హాజరుపరిచింది. కోర్టు అనుమతితో మూడు రోజులు కస్టడీలోకి తీసుకుని ఆమెను ప్రశ్నించింది. ఈడీ కేసులో 23 వరకు రిమాండ్‌ ఉండడంతో అదే తేదీ వరకు సీబీఐ కేసులోనూ కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసింది. మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టింది. 28 వరకు కస్టడీలోకి తీసుకుని విచారించింది.

Updated Date - Apr 24 , 2024 | 06:12 AM