Share News

IT companies : గప్‌చుప్‌గా కొలువుల కోత

ABN , Publish Date - May 29 , 2024 | 05:56 AM

భారత ఐటీ కంపెనీల్లో కొలువుల కోత గప్‌చుప్‌గా కొనసాగుతోంది. గతేడాది దాదాపు 20,000 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు ఇంటికి పంపాయి. నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందని ఆలిండియా ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఏఐఐఐఈయూ) తెలిపింది.

 IT companies : గప్‌చుప్‌గా కొలువుల కోత

‘ఐటీ’లో గత ఏడాది 20,000 మంది ఔట్‌

ఈ ఏడాది ఇప్పటి వరకు 3,000 మంది

ఉన్న పళంగా తొలగిస్తున్న కంపెనీలు

బెంచ్‌ ఉద్యోగులకు ‘కోత’ల భయం

న్యూఢిల్లీ, మే 28: భారత ఐటీ కంపెనీల్లో కొలువుల కోత గప్‌చుప్‌గా కొనసాగుతోంది. గతేడాది దాదాపు 20,000 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు ఇంటికి పంపాయి. నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందని ఆలిండియా ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఏఐఐఐఈయూ) తెలిపింది. ఈ ఏడాదీ ఈ కోతలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రముఖ కంపెనీలు ఈ ఏడాది ఇప్పటి వరకు 2,000 నుంచి 3,000 మందిని ఇంటికి పంపించినట్టు అంచనా.

కొన్ని ఐటీ సేవల కంపెనీలుఉద్యోగులకు పెద్దగా సమయం కూడా ఇవ్వడం లేదు. వర్చువల్‌ మీటింగ్‌లోకి రమ్మని మెసేజ్‌ పెట్టడం,ఆ మీటింగ్‌లోకి వచ్చాక ‘కంపెనీకి ఇక మీ సేవలు చాలు. సెలవు తీసుకోండి’ అని చల్లగా చెబుతున్నాయి. మరికొన్ని కంపెనీలైతే నెల రోజుల్లో వేరే జాబ్‌ చూసుకోండి, లేకపోతే మీ జాబ్‌ పోతుందని చెప్పి మరీ తీసేస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు లేక బెంచ్‌ మీద ఉన్న ఐటీ ఉద్యోగులు ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని బెదిరిపోతున్నారు.


కొత్త ఉద్యోగాలు కష్టమే..

ప్రస్తుతం భారత ఐటీ రంగంలో డౌన్‌ట్రెండ్‌ నడుస్తోంది. ప్రధాన మార్కెట్లయిన అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ నుంచి స్థానిక ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులేవీ పెద్దగా రావడంలేదు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ దేశాల కంపెనీలు అత్యవసరం కాని టెక్‌ బడ్జెట్‌లు పక్కన పెట్టడం ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఉద్యోగాలు కోల్పోయిన టెకీలకు అంత తేలిగ్గా ఉద్యోగాలు లభించడం లేదు. ఒకవేళ లభించినా అరకొర జీతాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. జీతాల ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్న ఐటీ కంపెనీలు, ఉన్న ఉద్యోగులపై మరింత పని భారం మోపుతున్నాయి. గతంలో ఐటీ ఉద్యోగులు వారంలో 5 రోజులు రోజుకి సగటున 10-12 గంటలు పని చేయాల్సి వచ్చేది. ఇప్పుడది 16-18 గంటలకు పెరిగిందని టెకీలు చెబుతున్నారు. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే వేరియబుల్‌ పేలో కోత లు పెడుతున్నట్టు సమాచారం. గతంలో టెకీలు మంచి జీతాల కోసం తరచూ ఉద్యోగాలు మారేవారు. కొవిడ్‌ సమయంలో కొన్ని కంపెనీలు తమకు కావాల్సిన నిపుణులకు 100-150శాతం హైక్‌ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకునేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉద్యోగులు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కష్టమనిపించినా ఉన్న కంపెనీల్లోనే సర్దుకుపోతున్నారు.

Updated Date - May 29 , 2024 | 05:56 AM