Share News

UP: భర్తకు ఉద్యోగం లేకపోయినా భార్యకు డబ్బులివ్వాల్సిందే.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

ABN , Publish Date - Jan 28 , 2024 | 08:11 AM

భర్తకు ఉద్యోగం లేకపోయినా, కూలీగా రోజుకు రూ. 300-400 సంపాదించే అవకాశం ఉన్నందున, తన భార్యకు భరణం అందించాల్సిన బాధ్యత భర్తపై ఉందని అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) తీర్పునిచ్చింది.

UP: భర్తకు ఉద్యోగం లేకపోయినా భార్యకు డబ్బులివ్వాల్సిందే.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

లఖ్‌నవూ: భర్తకు ఉద్యోగం లేకపోయినా, కూలీగా రోజుకు రూ. 300-400 సంపాదించే అవకాశం ఉన్నందున, తన భార్యకు భరణం అందించాల్సిన బాధ్యత భర్తపై ఉందని ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) తీర్పునిచ్చింది. విడిపోయిన భార్యకు నెలకు రూ. 2 వేలు భరణంగా చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై భర్త దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

కేసు విచారణ సందర్భంగా జస్టిస్ రేణు అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యకు మంజూరైన భరణం మొత్తాన్ని భర్త నుంచి రికవరీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ట్రయల్ కోర్టు ప్రిన్సిపల్ జడ్జిని ఆదేశించింది.

అసలేమైందంటే..

ఓ జంట 2015లో వివాహం చేసుకుంది. కట్నం ఇవ్వాలని వేధిస్తున్నారని ఆరోపిస్తూ భార్య తన భర్త, అత్తమామలపై 2016లో కేసు వేసింది. అప్పటినుంచి ఆమె తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 125 ప్రకారం వేరుగా ఉంటున్న తన భార్యకు ప్రతి నెల రూ.2 వేలు భరణం అందించాలని ఫ్యామిలీ కోర్టు అతన్ని గతంలో ఆదేశించింది.

ఈ తీర్పును సవాలు చేస్తూ భర్త 2023 ఫిబ్రవరి 21న హైకోర్టులో రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. గ్రాడ్యుయేట్ అయిన తన భార్య టీచింగ్ ద్వారా నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్న విషయాన్ని ప్రిన్సిపల్ జడ్జి పట్టించుకోలేదని భర్త హైకోర్టు ముందు వాదించాడు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపాడు. ఆరోగ్యం బాగా లేకున్నా కూలీగా పని చేస్తూ.. అద్దె గదిలో నివసిస్తున్నానని చెప్పాడు. దానికితోడు తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ల బాధ్యతలు మోస్తున్నానని వివరించాడు.


కోర్టు ఏమందంటే

తన భార్య టీచింగ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్లు రుజువు చేసే డాక్యుమెంటేషన్‌ను అందించడంలో భర్త విఫలమయ్యాడని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనికితోడు తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ల బాధ్యతలతో ఆర్థిక భారం పడుతోందనే భర్త వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.

ఆయన ఆరోగ్యంగా ఉన్నాడని, కష్టపడి డబ్బు సంపాదించే సామర్థ్యం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఉద్యోగ నైపుణ్యాలు లేకపోయినా కార్మికుడిగా వెళ్తే రోజుకు రూ.300 - 400 వరకు సంపాదించవచ్చని.. ఆ డబ్బుతో భార్యకు డబ్బులు చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Updated Date - Jan 28 , 2024 | 08:22 AM