Share News

Nayab Singh Saini: విశ్వాసతీర్మానంలో గెలిచిన సీఎం

ABN , Publish Date - Mar 13 , 2024 | 03:45 PM

హరియాణా కొత్త ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ బుధవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్షలో గెలిచారు. మూజువాణి ఓటుతో విశ్వాస తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఓటింగ్‌కు జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు.

Nayab Singh Saini: విశ్వాసతీర్మానంలో గెలిచిన సీఎం

నుహ్: హరియాణా కొత్త ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) బుధవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్షలో (confidence motion) గెలిచారు. మూజువాణి ఓటుతో విశ్వాస తీర్మానాన్ని సభ ఆమోదించింది. మనోహర్ లాలా ఖట్టర్ ముఖ్యమంత్రి పదవికి మంగళవారంనాడు అనూహ్యంగా రాజీనామా చేయడం, ఆయనతో పాటు మంత్రివర్గ సభ్యులంతా రాజీనామాలు సమర్పించడంతో ఆయన స్థానంలో కురక్షేత్ర నియోజకవర్గం ఎంపీ నాయక్ సింగ్ సైనీ (54) కొత్త సీఎంగా వెంటనే బాధ్యతలు చేపట్టారు.


నాటకీయ పరిణామాలు

లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారంలో బీజేపీ, దాని భాగస్వామ్య పక్షమైన జేజేపీ మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయి. దీంతో ప్రభుత్వంలో భారీ మార్పులు జరగనున్నాయంటూ మంగళవారం నుంచి ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే ఖట్టర్ సహా 13 మంది మంత్రులు రాజీనామాలు చేయడం, గవర్నర్ బండారు దత్తాత్రేయ వెంటనే వాటిని ఆమోదించడం చకచగా జరిగిపోయాయి. ఆ వెంటనే శాసనసభా పక్షం సమావేశమై సైనిని తమ నాయకుడిగా ఎన్నుకుంది. ఆరుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీ సర్కార్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో జేజేపీ మద్దతు లేకుండానే బీజేపీకి మెజారిటీ చేకూరింది. వెంటనే సైనితో గవర్నర్ దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు.


దుష్యంత్ చౌతాలా విప్

కాగా, బుధవారంనాడు సైనీ విశ్వాస పరీక్ష సందర్భంగా ఓటింగ్‌కు దూరంగా ఉండాలని జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) అధినేత దుష్యంత్ చౌతాలా తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. అయితే విప్‌ జారీ చేసినప్పటికీ జేజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు జోగి రామ్ సిహాగ్, ఐశ్వర్ సింగ్, రామ్‌కుమార్ గౌతమ్, దేవేంద్ర బబ్లి రాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు. అయితే విశ్వాసపరీక్ష మొదలైన తర్వాత ఆ ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోయారు.

Updated Date - Mar 13 , 2024 | 03:45 PM