Share News

Governor: తిరువళ్లువర్‌ చిత్రానికి కాషాయ వస్త్రం.. గవర్నర్‌ సరికొత్త వివాదం!

ABN , Publish Date - Jan 17 , 2024 | 08:32 AM

తమిళులంతా పంచమవేదంగా భావించే తిరుక్కురళ్‌ను అందించిన తిరువళ్లువర్‌ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) సరికొత్త వివాదానికి కేంద్రబిందువయ్యారు.

Governor: తిరువళ్లువర్‌ చిత్రానికి కాషాయ వస్త్రం.. గవర్నర్‌ సరికొత్త వివాదం!

- తిరువళ్లువర్‌కు రంగులు పులమడం భావ్యం కాదు

- ముఖ్యమంత్రి స్టాలిన్‌

చెన్నై, (ఆంధ్రజ్యోతి): తమిళులంతా పంచమవేదంగా భావించే తిరుక్కురళ్‌ను అందించిన తిరువళ్లువర్‌ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) సరికొత్త వివాదానికి కేంద్రబిందువయ్యారు. ఆయన నివాళులర్పించిన తిరువళ్లువర్‌ విగ్రహానికి కాషాయవస్త్రం ధరింపజేయడమే ఇందుకు కారణమైంది. చలువరాయిలో చెక్కబడిన తిరువళ్లువర్‌ రూపానికి వస్త్రం చుట్టినట్లుగా ఉండడం లేదా ధవళ వస్త్రం కప్పివున్న తిరువళ్లువర్‌ రూపం మినహా, ఇతర రంగుల వస్త్రంతో వున్న తిరువళ్లువర్‌ ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. అయితే మంగళవారం ఉదయం రామనాఽథపురంలో గవర్నర్‌ నివాళిలర్పించిన తిరువళ్లువర్‌ చిత్రపటంలో మాత్రం కాషాయవస్త్రం కప్పి వుంది. ఈ వ్యవహారమే ఇప్పుడు వివాదమైంది. తిరువళ్లువర్‌కు నివాళి అర్పించిన అనంతరం గవర్నర్‌ తన ఎక్స్‌ పేజీలో ఆ ఫొటోను పెట్టారు. అంతేగాక ‘ఆధ్యాత్మిక భూమి తమిళనాట జన్మించిన తిరువళ్లువర్‌ భారతీయ సనాతన సంప్రదాయానికి చెందిన గొప్ప కవి, తత్త్వవేత్త. అద్భుతమైన ఆ సాధువుకు వినయపూర్వక ప్రణామాలు సమర్పించా. తిరువళ్లువర్‌ జ్ఞానం భారతీయ సంస్కృతిని సుసంపన్నం చేసింది. మొత్తం మానవాళికి మార్గదర్శకంగా నిలిచిన ఆ మహాపురుషుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు’ అంటూ సందేశం వెలువరించారు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వెలువడగానే రాష్ట్రవ్యాప్తంగా పలువురు నిరసన తెలిపారు.

సీఎం స్టాలిన్‌ కౌంటర్‌...

తమిళసీమలో జన్మించి అందమైన తమిళంలో ధర్మాన్ని బోధించి సమస్త మానవాళికి హితోక్తులను అందించిన తిరువళ్లువర్‌పై ఎవరూ రంగులు పులమలేరని, మచ్చలు ఆపాదించలేరని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) గవర్నర్‌ రవికి కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రజలకు తిరువళ్లువర్‌ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ సందేశం వెలువరించారు. తిరువళ్లువర్‌ కీర్తిని నలుదిశలా చాటేలా 133 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని, ఆ మహాపురుషుడి పేరుతోనే నగరంలో వళ్లువర్‌ కోట్టంను నిర్మించామన్నారు. తిరుక్కురళ్‌ అందించిన బోధనలు హితోక్తులు, సామాజిక న్యాయ సూత్రాలే తమకు ఆచరణీయమని, ఆ మహాపురుషుడికి ఎవరూ ఎలాంటి రంగులను పులమలేరని పేర్కొన్నారు. స్టాలిన్‌ తన సందేశంతోపాటు తెలుపు దుస్తులు ధరించిన తిరువళ్లువర్‌ విగ్రహానికి మంత్రులు నివాళి అర్పిస్తున్న ఫొటో, కన్నియాకుమారిలో ఉన్న 133 అడుగుల విగ్రహం ఫొటోను జతచేశారు.

Updated Date - Jan 17 , 2024 | 08:32 AM