Share News

Matrimonial Fraud: మోసగాళ్లకే మోసగాడు.. 250 మంది మహిళలను నమ్మించి..

ABN , Publish Date - Feb 29 , 2024 | 07:19 PM

ఈజీ మనీకి అలవాటు పడిన దుండగులు.. అవతలి వారిని మోసం చేసి, డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకుంటుంటారు. ఈ ఆధునిక యుగంలో ఆన్‌లైన్ మోసాలు మరీ పెచ్చుమీరిపోయాయి. తమ తెలివితేటలతో అవతలి వ్యక్తుల్ని బుట్టలో పడేసి, వారిని నిలువునా దోచేస్తున్నారు. ఇప్పుడు ఓ వ్యక్తి కూడా మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్స్ (Matrimonial Websties) ద్వారా మోసాలకు పాల్పడ్డాడు.

Matrimonial Fraud: మోసగాళ్లకే మోసగాడు.. 250 మంది మహిళలను నమ్మించి..

ఈజీ మనీకి అలవాటు పడిన దుండగులు.. అవతలి వారిని మోసం చేసి, డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకుంటుంటారు. ఈ ఆధునిక యుగంలో ఆన్‌లైన్ మోసాలు మరీ పెచ్చుమీరిపోయాయి. తమ తెలివితేటలతో అవతలి వ్యక్తుల్ని బుట్టలో పడేసి, వారిని నిలువునా దోచేస్తున్నారు. ఇప్పుడు ఓ వ్యక్తి కూడా మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్స్ (Matrimonial Websties) ద్వారా మోసాలకు పాల్పడ్డాడు. పది కాదు, ఇరవై కాదు.. ఏకంగా 250 మందికి పైగా మహిళల్ని మోసం చేసి చేశాడు. అయితే.. చివరికి అతని పాపం పండి, పోలీసులు అడ్డంగా దొరికిపోయాడు.


ఆ మోసగాడి పేరు నరేష్ పూజారి గోస్వామి (Naresh Poojari Goswami). రాజస్థాన్‌కు (Rajasthan) చెందిన అతను.. మ్యాట్రిమోనియల్ సైట్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా 250 మందికి పైగా మహిళలతో స్నేహం చేసి మోసం చేశాడు. గత 20 ఏళ్ల నుంచి బెంగళూరులో (Bengaluru) ఉంటున్న అతగాడు.. ఆన్‌లైన్‌లో యువకుల ఫోటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, మహిళలకు ఎర వేసేవాడు. తనని తాను కస్టమ్ అధికారిగానూ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గానూ పరిచయం చేసుకునేవాడు. అనంతరం పెళ్లి చర్చల కోసం మహిళలు, వారి కుటుంబాలను బెంగళూరుకు పిలిపించేవాడు. తాను కూడా దారిలోనే ఉన్నానని చెప్పి, చివరి నిమిషంలో ఆఫీస్‌లో అత్యవసరమైన పని ఉందని అబద్ధాలు అల్లేవాడు. రైల్వే స్టేషన్‌లో మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి తన మామయ్య వస్తున్నాడని చెప్పి, తనే వాళ్లను కలుసుకోవడానికి వెళ్లేవాడు. అనంతరం కొంత దూరం వెళ్లి.. తన మామ కుటుంబానికి అత్యవసర పని వచ్చిపడిందని, వాళ్లకు రైలు టికెట్స్ బుక్ చేసేందుకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు ఇవ్వాలని అభ్యర్థించేవాడు. అతని మాటలు నమ్మి వాళ్లు డబ్బులివ్వగానే.. నరేష్ అక్కడి నుంచి జంప్ అయ్యేవాడు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసేసేవాడు.

ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. మొత్తం 10 రాష్ట్రాల్లో 259 మంది మహిళల్ని నరేష్ మోసం చేసినట్లు తమ విచారణలో తేలిందని బెంగళూరు రైల్వే పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిఐజిపి) ఎస్‌డీ శరణప్ప చెప్పారు. కోయంబత్తూరుకు (Coimbatore) చెందిన బాధితురాలు ఫిబ్రవరి 23వ తేదీన ఫిర్యాదు చేయడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ బాధితురాలి నుంచి కూడా రూ.10 వేలు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడ్ని రైల్వే స్టేషన్‌లోనే అరెస్ట్ చేశారు. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలనే అతడు లక్ష్యంగా చేసుకునేవాడని తేలింది. ఇప్పటివరకు తాము 16 మంది బాధితుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేశామని, మరిన్ని ఫిర్యాదులను ఆశిస్తున్నామని చెప్పారు. మోసగాడు నరేష్‌పై ఐపీసీ 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ ఎం పాటిల్ తెలిపారు.

Updated Date - Feb 29 , 2024 | 07:19 PM