Share News

Ujjain:హోలీ పర్వదినాన విషాదం.. ఉజ్జయిని ఆలయంలో మంటలు చెలరేగి..

ABN , Publish Date - Mar 25 , 2024 | 10:18 AM

హోలీ(Holi) పర్వదినాన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వరాలయంలో విషాదం జరిగింది. గర్భగుడిలో భస్మ హారతి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పదుల సంఖ్యలో పూజారులు, ఆలయ సిబ్బంది, భక్తులు గాయపడ్డారు.

Ujjain:హోలీ పర్వదినాన విషాదం.. ఉజ్జయిని ఆలయంలో మంటలు చెలరేగి..

ఉజ్జయిన్: హోలీ(Holi) పర్వదినాన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వరాలయంలో విషాదం జరిగింది. గర్భగుడిలో భస్మ హారతి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పదుల సంఖ్యలో పూజారులు, ఆలయ సిబ్బంది, భక్తులు గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హోలీ సందర్భంగా మహాకాళేశ్వర్ ఆలయం(Mahakaleshwar Temple)లో భక్తులు(Devotees) రంగులతో మహాకాళుడి సమక్షంలో పండుగ సంబరాలు జరుపుకున్నారు. భస్మ హారతి సందర్భంగా గులాల్ విసిరే సమయంలో మంటలు చెలరేగాయి.

గర్భగుడి గుహ రూపంలో ఉండటంతో పూజారులు ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో 13 మంది అర్చకులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. క్షతగాత్రులను వెంటనే ఉజ్జయిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో భస్మహారతి ప్రధాన పూజారి సైతం గాయపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఘటనపై విచారణకు మెజిస్టీయల్ విచారణకు ఆదేశించారు.


హోలీ సందర్భంగా భక్తులు ఉత్సాహంతో పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. పాండే-అర్చకులు, భక్తులు కూడా స్వామిపై పూలు, రంగులు జల్లి భస్మ హారతి నిర్వహించి హోలీ ఆడారు. ఆదివారం సాయంత్రం నుంచే హారతి సందర్భంగా భక్తులు తమ భక్తిని చాటుకుని ఆలయ ప్రాంగణంలో హోలికా దహనం చేశారు. అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.

ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దేవుడి నామస్మరణతో నృత్యాలు చేస్తున్నారు. పూజారులు 51 క్వింటాళ్ల పూలతో మహాకాళ స్వామికి హోలీ నిర్వహించారు. భస్మ హారతిలో పాల్గొనేందుకు భారతదేశం సహా విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రాత్రి నుంచి మహాకాల్ ఆలయానికి చేరుకున్నారు. దీంతో హోలీ సందర్భంగా జ్యోతిర్లింగ మహాకాల్ ఆలయంలో ఉత్సవాలు సందడిగా మారాయి.

ఈ పండుగను ఆస్వాదించడానికి ఉత్సాహభరితమైన భక్తులు ఆలయం వద్ద భారీగా గుమిగూడారు. దీంతో ఆలయ పరిసరాలు కీర్తనలు, నృత్యాలతో కోలాహలంగా మారాయి. ఆ క్రమంలో భక్తులు ఒకరికొకరు గులాల్‌తో రంగులు చల్లుకుంటున్నారు. దేశంలోనే మొదటగా ఈ ఆలయ ప్రాంగణంలో హోలీ పండుగను జరుపుకోవడం విశేషం. ఈ క్రమంలో మంటలు చెలరేగి పండగ రోజు విషాదం చోటు చేసుకుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2024 | 10:18 AM