Share News

Exit Polls : మోదీ మ్యాజిక్‌!

ABN , Publish Date - Jun 02 , 2024 | 06:31 AM

ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్‌ కొట్టబోతున్నారా!? కేంద్రంలో వరుసగా మూడోసారి కూడా బీజేపీయే తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రాబోతోందా!? ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్డీయే

Exit Polls : మోదీ మ్యాజిక్‌!

తిరుగు లేని మెజారిటీతో కేంద్రంలో మూడోసారి ఎన్డీయే!

ఎన్డీయేకు 350కు పైనే అంటున్న ఎగ్జిట్‌పోల్స్‌.. 400కు పైన రావచ్చంటున్న 3 సంస్థలు

కేరళలో ఖాతా తెరవనున్న కాషాయ దళం.. తమిళనాడు, ఏపీ, తెలంగాణల్లో విస్తరణ

ఒడిసాలో అధికారం దిశగా.. బెంగాల్లో బలంగా.. ఢిల్లీ సహా ఉత్తరాదిపై గట్టి పట్టు

200 సీట్లు కూడా దాటని ఇండియా కూటమి

ప్రజలు ఎన్డీయే ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారని నమ్మకంగా చెప్పగలను. మా పనితీరుతో తమ జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని పేదలు, బడుగు, బలహీన వర్గాల వారు గుర్తించారు.

- ప్రధాని మోదీ

మా కూటమికి 295 సీట్లు వస్తాయి. ఒక్కటి కూడా తగ్గదు. మా కూటమి నాయకులందరి నుంచీ వివరాలు సేకరించాకే ఈ నిర్ధారణకు వచ్చాం. ప్రజలు మా నాయకులకు చెప్పిందే, మేము మీకు చెబుతున్నాం.

- ఖర్గే, కాంగ్రెస్‌ అధ్యక్షుడు

న్యూఢిల్లీ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్‌ కొట్టబోతున్నారా!? కేంద్రంలో వరుసగా మూడోసారి కూడా బీజేపీయే తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రాబోతోందా!? ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్డీయే ప్రభంజనమేనా!? టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించనుందా!? తెలంగాణలో కాషాయ సునామీ రానుందా!? అత్యధిక సీట్లలో బీజేపీ ఘన విజయం సాధించనుందా!? ఈ ప్రశ్నలు అన్నిటికీ ‘ఔను’ అనే అంటున్నాయి మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌! దేశవ్యాప్తంగా ఎన్డీయే సునామీని అత్యధిక పోల్స్‌ అంచనా వేశాయి. ఎన్డీయే 400కుపైగా సీట్లు సాధించే అవకాశం ఉందని ఇండియా టీవీ - సీఎన్‌ఎక్స్‌; టుడేస్‌ చాణక్య; ఇండియా టుడే - యాక్సిస్‌ మై ఇండియా సర్వేలు తేల్చి చెప్పాయి. ఇండియా కూటమి డబుల్‌ డిజిట్‌కే పరిమితమయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేమని టుడేస్‌ చాణక్య సర్వే తెలిపింది. ఏడు దశల సార్వత్రిక సమరం శనివారం ముగిసింది! ఏడో దశ పోలింగ్‌ ముగిసిన తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడ్డాయి. వాటిలో అత్యధిక సంస్థలు తిరుగు లేని మెజారిటీతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఎన్డీయేకు 350కిపైగా స్థానాలు వస్తాయని ఇండియా టుడే, ఇండియా న్యూస్‌ - డి డైనమిక్స్‌, జన్‌ కీ బాత్‌, రిపబ్లిక్‌ భారత్‌ - మ్యాట్రిజ్‌; రిపబ్లిక్‌ టీవీ- పి మార్క్‌; టుడేస్‌ చాణక్య తదితర సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తేల్చాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ జట్టు కట్టినా.. కుల గణన, రిజర్వేషన్ల అంశాలను తెరపైకి తెచ్చినా.. వాటినే ఎన్నికల అంశాలుగా మార్చినా ఇండియా కూటమి పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందని స్పష్టం చేశాయి. ఒక్క దైనిక్‌ భాస్కర్‌ మినహా మిగిలిన అన్ని సంస్థలు ఎన్డీయే కూటమికి 350 సీట్లకు పైనే వస్తాయని; ఇండియా కూటమికి 200 స్థానాల్లోపు వస్తాయని అంచనా వేశాయి. ఎన్డీటీవీ పోల్‌ ఆఫ్‌ పోల్స్‌ సర్వే ప్రకారం.. ఎన్డీయేకు 361; ఇండియా కూటమికి 145; ఇతరులకు 37 సీట్లు లభించనున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నాలుగో తేదీన వెలువడనున్న సంగతి తెలిసిందే.

దక్షిణాదిలో పాగా..

ఇప్పటి వరకూ ఉత్తరాదికి, ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన బీజేపీ.. ఈసారి దక్షిణాదిలోనూ గణనీయమైన సంఖ్యలో సీట్లను సాధించనుందని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. మరీ ముఖ్యంగా, ఒకప్పడు కమ్యూనిస్టుల కంచుకోట, విద్యాధికుల రాష్ట్రమైన కేరళలో బీజేపీ ఖాతా తెరవనుంది. ఇక్కడ బీజేపీకి 1-3 సీట్లు వస్తాయని ఎగ్జిట్స్‌ పోల్స్‌ చెబుతున్నాయి. తమిళనాడులోనూ బీజేపీ సీట్ల సంఖ్య పెరగనుందని అంచనా వేశాయి. ఇక్కడ బీజేపీకి అనూహ్యంగా 5 నుంచి 7 సీట్ల వరకు లభించవచ్చని ఇండియా టీవీ- సీఎన్‌ఎక్స్‌, జన్‌ కీ బాత్‌ తేల్చాయి. తద్వారా.. రాబోయే పార్లమెంటులో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచీ బీజేపీ ప్రాతినిధ్యం ఉండనుందని స్పష్టం చేస్తున్నాయి. అంతేనా.. గత ఎన్నికల ఫలితాల్లో అసలు ప్రాతినిధ్యమే లేని ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి కూటమిలో భాగస్వామిగా గణనీయ సంఖ్యలో సీట్లు సాధించుకోనుందని, కర్ణాటకలో పట్టును నిలుపుకోనుందని; తెలంగాణలో మరింత విస్తరించనుందని ఆయా ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థలు తెలిపాయి. కర్ణాటకలో ఎన్డీయే 23-25 సీట్లను సాధిస్తుందని ఇండియా టుడే - యాక్సిస్‌ మై ఇండియా పోల్‌తోపాటు న్యూస్‌ 18 సంస్థ అంచనా వేసింది.

తూర్పులో అధికారం దిశగా...

బీజేపీ ఎప్పటి నుంచో కన్నేసిన ఒడిసా, పశ్చిమ బెంగాల్‌లలో ఆ పార్టీ లక్ష్యం దిశగా సాగుతోందని ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు విశ్లేషిస్తున్నాయి. ఒడిసాలో బీజేపీ ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, లోక్‌సభ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు దక్కించుకుంటుందని అత్యధిక ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఇక, పశ్చిమ బెంగాల్లో గతంలో కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని, ఇక్కడ తృణమూల్‌ కాంగ్రె్‌సను మించి లోక్‌సభ సీట్లను సాధిస్తుందని విశ్లేషిస్తున్నాయి. ఇక, జార్ఖండ్‌లోనూ బీజేపీయే పైచేయి సాధిస్తుందని, బిహార్లో ఈసారి కూడా ఎన్డీయే కూటమికే మెజారిటీ సీట్లు వస్తాయని స్పష్టం చేస్తున్నాయి. వెరసి, తూర్పులోనూ రాబోయే రోజుల్లో అధికారం దిశగా బీజేపీ అడుగులు వేస్తోందని సంకేతాలు ఇస్తున్నాయి.

ఉత్తరాది మళ్లీ కాషాయమయమే

ఉత్తరాదితోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీయే ఆధిక్యం ప్రదర్శించబోతోందని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ కనుమరుగు కానుందని విశ్లేషిస్తున్నాయి. గుజరాత్‌, ఢిల్లీలో బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేయనుందని తెలిపాయి. గుజరాత్‌లో మళ్లీ మొత్తం 26 సీట్లు బీజేపీయే సాధిస్తుందని న్యూస్‌ 18 చెబితే.. న్యూస్‌ 24- టుడేస్‌ చాణక్య ప్రకారం పంజాబ్‌లో బీజేపీకి 4, కాంగ్రె్‌సకు 4, ఆప్‌కు 2 సీట్లు లభించే అవకాశం ఉందని తెలిపింది. హరియాణా, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో ఎప్పట్లాగే బీజేపీకే మెజారిటీ సీట్లు రానున్నాయని తేల్చి చెప్పాయి. ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగడ్‌, హిమాచల్‌లలో మొత్తం సీట్లు బీజేపీకే దక్కనున్నాయని టుడేస్‌ చాణక్య అంచనా వేసింది. ఒక్క మహారాష్ట్రలో ఇండియా కూటమి కాస్త పోటీ ఇచ్చినా.. ఎన్డీయే కూటమికే మెజారిటీ స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. మహారాష్ట్రలో ఎన్డీయేకు 32-35, ఇండియా కూటమికి 15-18 మధ్య సీట్లు లభిస్తాయని న్యూస్‌ 18 సంస్థ తేల్చింది.

3 రోజుల్లో ‘ఇండియా’ విజయోత్సవాలు: స్టాలిన్‌

చెన్నై, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ‘ఇండియా’ కూటమి విజయోత్సవాలకు మరో మూడు రోజులు మాత్రమే ఉందని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను తరిమికొట్టారని శనివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘‘బీజేపీ పదేళ్ల ఫాసిస్ట్‌ ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడి దేశాన్ని రక్షించేందుకు ఏర్పాటైన ఇండియా కూటమి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి విజయం అంచున ఉంది. తమను ఎదిరించే శక్తి లేదన్న భ్రమలో ఉన్న బీజేపీకి దీటుగా ఈ కూటమి ఆవిర్భవించింది. కూటమి నేతలు దేశ వ్యాప్తంగా చేపట్టిన ప్రచార సభలతో బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను తరిమికొట్టారు. ఓట్ల లెక్కింపు సమయంలో కూటమి నేతలు మరింత అప్రమత్తతో ఉండాలి. ఈ నెల 4వ తేదీ దేశ విముక్తి కోసం పడే తొలి అడుగు’’ అని స్టాలిన్‌ అన్నారు.

ఎగ్జిట్‌ కావడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తే ఈ ఎగ్జిట్‌ పోల్స్‌కు సూత్రధారి. ‘ఇండియా’ కూటమి కనీసం 295 సీట్లు సాధిస్తుంది. దిగిపోతున్న ప్రధాని మాపై మానసికంగా దెబ్బ తీయడానికి ఇలాంటి ఆటలు ఆడుతున్నారు. అసలు ఫలితాలు భిన్నంగా ఉంటాయి.

- జైరాం రమేశ్‌, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి

మోదీ మూడోసారి ప్రధాని అయితే నా తలగొరిగించుకొంటాను. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ తప్పు అని జూన్‌ 4న తేలిపోతుంది. మోదీ మళ్లీ ప్రధాని కాలేరు. రాసి పెట్టుకోండి.

- సోమనాథ్‌ భారతి, ఆప్‌ నేత

ప్రతిపక్ష కూటమి 295కు పైగా సీట్లు సాధించి కేంద్రంలో సుస్థిర, సమర్థ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. బీజేపీకి సొంతంగా 220కి మించి సీట్లు రావు. ఎన్డీయే మొత్తానికి 235 దాకా రావొచ్చు. ఇది ప్రజల మాట.

- కేజ్రీవాల్‌, ఢిల్లీ సీఎం

Updated Date - Jun 02 , 2024 | 06:31 AM