Share News

Chennai: నేడు కానుం పొంగల్‌.. పర్యాటక ప్రాంతాలకు వెళ్లనున్న ప్రజలు

ABN , Publish Date - Jan 17 , 2024 | 08:53 AM

కానుం పొంగల్‌ సందర్భంగా మెరీనా, ఎలియట్స్‌ బీచ్‌ సహా పర్యాటక ప్రాంతాల్లో 15,500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ సందీప్ రాయ్‌ రాథోడ్‌(Sandeep Roy Rathore) ప్రకటించారు.

Chennai: నేడు కానుం  పొంగల్‌.. పర్యాటక ప్రాంతాలకు వెళ్లనున్న ప్రజలు

- చెన్నైలో 15 వేలమందితో పోలీసుల భద్రత

పెరంబూర్‌(చెన్నై): కానుం పొంగల్‌ సందర్భంగా మెరీనా, ఎలియట్స్‌ బీచ్‌ సహా పర్యాటక ప్రాంతాల్లో 15,500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ సందీప్ రాయ్‌ రాథోడ్‌(Sandeep Roy Rathore) ప్రకటించారు. సంక్రాంతి పండుగ చివరి రోజైన కానుం పొంగల్‌ నాడు నగరం నుంచే కాకుండా పొరుగు జిల్లాలకు చెందిన వారు కూడా కుటుంబసభ్యులతో నగరం, శివారు ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 15,500 మంది పోలీసులతో పాటు 1,500 హోంగార్డ్స్‌ భద్రతా విధులు చేపట్టనున్నారు. మెరీనా తీరం(Marina Beach)లోని కార్మికుల స్మారకస్థూపం నుంచి గాంధీ విగ్రహం వరకు మూడు పోలీసు అవుట్‌ పోస్టులు, కార్మికుల స్మారక స్థూపం నుంచి లైట్‌ హౌస్‌ వరకు ఉన్న 7వ సర్వీస్‌ రోడ్డులోని ప్రవేశ మార్గాల్లో పోలీసు కంట్రోల్‌ రూంలు ఏర్పాటు కానున్నాయి. అలాగే, అత్యవసర వైద్యసేవలకు వైద్య బృందాలు, 8 అంబులెన్స్‌లు, రెండు అగ్నిమాపక వాహనాలు సిద్ధం చేశారు. అలాగే, భద్రత కోసం మో టరు పడవలు, సుమారు 200 మంది గజ ఈతగాళ్లను సముద్రతీరాల్లో ఉంచామన్నారు. అలా గే, మెరీనా తీరంలో 13 వాచ్‌ టవర్లు ఏర్పాటుచేసి బైనాక్యులర్స్‌ ద్వారా పోలీసులు పర్యవేక్షించనున్నారు.

పిల్లల భద్రత ప్రత్యేక చర్యలు

రద్దీ ప్రాంతాల్లో తప్పిపోయే పిల్లలను సత్వరం రక్షించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ప్రవేశ ద్వారాల్లోనే పిల్లల వివరాలు, తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌ నెంబరు తీసుకొని, వారి చేతికి బ్యాండ్‌ ఏర్పాటు చేయనున్నారు. ఒకవేళ పిల్లలు తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన సందర్భంగా, గస్తీలో ఉన్న పోలీసులు ఆ పిల్లల చేతిలోని బ్యాండ్‌ ఆధారంగా తల్లిదండ్రులను సంప్రదించి వారికి అప్పగించే పనులు చేపట్టనున్నారు. ఇక, మెరీనా బీచ్‌, ఎలియట్స్‌ బీచ్‌లో తలా నాలుగు డ్రోన్‌ కెమెరాలను భద్రత కోసం వినియోగించనున్నారు. అలాగే, రద్దీగా ఉండే 12 ప్రాంతా లు గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే, గిండి, అడయార్‌, తరమణి, నీలాంగరై, దురైపాక్కం, మదురవాయల్‌ బైపాస్‌ రోడ్డు, జీఎన్‌టీ రోడ్డు సహా ఇతర ప్రాంతాల్లో బైక్‌ రేసులు అడ్డుకొనేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం తాగి వాహనాలు నడపడం తదితర చర్యలకు పాల్పడే వారిపై కఠినచర్యలు చేపట్టనున్నారు. ఇక, రద్దీలో చైన్‌ స్నాచింగ్‌, చోరీలు అడ్డుకొనేలా మఫ్టీ పోలీసులు పహారా కాస్తారని నగర పోలీసు శాఖ తెలిపింది.

Updated Date - Jan 17 , 2024 | 08:53 AM