Share News

Chennai: కర్ణాటకలో ప్రబలుతున్న ‘మంకీ ఫీవర్‌’.. తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో అప్రమత్తం

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:08 AM

కర్ణాటక రాష్ట్రంలో ‘మంకీ ఫీవర్‌’ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దు జిల్లాలు అప్రమత్తమయ్యాయి. అక్కడ నివారణ చర్యలు ముమ్మరం చేయాలని ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Chennai: కర్ణాటకలో ప్రబలుతున్న ‘మంకీ ఫీవర్‌’.. తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో అప్రమత్తం

చెన్నై: కర్ణాటక రాష్ట్రంలో ‘మంకీ ఫీవర్‌’ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దు జిల్లాలు అప్రమత్తమయ్యాయి. అక్కడ నివారణ చర్యలు ముమ్మరం చేయాలని ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ సెల్వవినాయగం అన్ని జిల్లాల ఆరోగ్యశాఖ అధికారులకు సర్క్యులర్‌ పంపారు. ‘క్యాసనూర్‌ ఫారెస్ట్‌ డిసీజ్‌ వైరస్‌ (కేఎ్‌ఫడీవీ) అనే మంకీ ఫీవర్‌తో కర్ణాటక(Karnataka) రాష్ట్రంలో 53 మంది చికిత్స పొందుతుండగా, ఇద్దరు మృతిచెందారన్నారు. 1957లో గుర్తించిన ఈ వైరస్‌ కారణంగా ఏడాదికి 400 నుంచి 500 మందికి సోకుతోందని తెలిపారు. వానరాలు, పశువుల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిస్తుండగా, వానరాల నుంచి వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంటుందన్నారు. ఈ వైరస్‌ సోకిన వారికి జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులు, జీర్ణకోశ సమస్యలు, రక్తపోటు తదితర లక్షణాలుంటాయని తెలిపారు. ఈ లక్షణాలు సోకిన వారు చికిత్స అనంతరం కోలుకుంటుండగా, కొందరికి మాత్రం ప్రమాదకరంగా మారే అవకాశముందన్నారు. పీసీఆర్‌, రక్తపరీక్షల ద్వారా ఈ జ్వరాన్ని నిర్ధారించవచ్చన్నారు. ఈ వైరస్‌ రాష్ట్రంలో ప్రబలకుండా ముందస్తు నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి, ఆ రాష్ట్రాల నుంచి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించాలని, జ్వరం, తలనొప్పి తదితర సమస్యలతో బాధపడే వారికి వైద్యపరీక్షలు చేసి తగిన చికిత్సలందించాలని సూచించారు. పశువులు, ఆవులు, ఎద్దులను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వాటిని మేత కోసం అడవుల్లోకి పంపకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాధికారక సూక్ష్మజీవులను అంతమొందించేలా పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు తెలియజేయాలని ఆరోగ్యశాఖ జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - Feb 13 , 2024 | 11:08 AM