Share News

పార్లమెంటు ముందుకు 16 బిల్లులు!

ABN , Publish Date - Nov 25 , 2024 | 04:04 AM

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేసింది.

పార్లమెంటు ముందుకు 16 బిల్లులు!

వీటిలో వక్ఫ్‌(సవరణ) కూడా..

జమిలి బిల్లునూ చేర్చే అవకాశం

నేటి నుంచి శీతాకాల సమావేశాలు

బీజేపీలో ‘మహా’ ఉత్సాహం

కాంగ్రె్‌సకు అదానీ అస్త్రం!

నిలదీసేందుకు విపక్షాల కసరత్తు

మణిపూర్‌పై చర్చకు డిమాండ్‌

వాయు కాలుష్యం ముప్పుపైనా..

అఖిలపక్ష సమావేశానికి 30 పార్టీల నాయకులు హాజరు

న్యూఢిల్లీ, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేసింది. అందులో వక్ఫ్‌ (సవరణ) బిల్లు, విపత్తు నిర్వహణ(సవరణ) సహా కీలక బిల్లులు ఉన్నాయి. సోమవారం నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో సమావేశమయ్యారు. ఈ భేటీకి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత వహించారు. ఆ 16 బిల్లులకు సంబంధించిన వివరాలను అన్ని పార్టీల నేతలకు అందించారు. అయితే, మరికొన్ని బిల్లులను కూడా ప్రవేశపెట్టాలని కొందరు సభ్యులు కోరినట్టు తెలిసింది. అలాగే, కేంద్రం మరికొన్ని బిల్లులను ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపుతో జోష్‌లో ఉన్న ఎన్డీయే జమిలి ఎన్నికలపైనా కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే, ఈ సమావేశాల్లోనే ఆ బిల్లు పెడతారా? లేదా తదుపరి సమావేశాల వరకు నిరీక్షిస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అఖిలపక్ష సమావేశానికి 30 రాజకీయ పార్టీలకు చెందిన 42 మంది నేతలు హాజరయ్యారు. డిసెంబరు 20వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబరు 26న పార్లమెంటు సమావేశాలు జరగవని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆ రోజున పాత పార్లమెంట్‌ భవనంలోని సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాల్‌లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.

G.jpg


శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్న బిల్లులు ఇవీ..

భారతీయ వాయుయాన్‌ విధేయక్‌ బిల్లు, విపత్తు నిర్వహణ(సవరణ) బిల్లు, గోవా అసెంబ్లీలో షెడ్యూల్డ్‌ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణం బిల్లు, ది బిల్స్‌ ఆఫ్‌ లాడింగ్‌ బిల్లు, ది క్యారేజ్‌ ఆఫ్‌ గూడ్స్‌ బై సీ బిల్లు, రైల్వే(సవరణ) బిల్లు, బ్యాంకింగ్‌ చట్టాల(సవరణ) బిల్లు, ముసల్మాన్‌ వక్ఫ్‌(రద్దు) బిల్లు, వక్ఫ్‌(సవరణ) బిల్లు, చమురు క్షేత్రాల(నియంత్రణ, అభివృద్థి) సవరణ బిల్లు, బాయిలర్స్‌ బిల్లు, రాష్ర్టీయ సహకారి విశ్వవిద్యాలయ బిల్లు, పంజాబ్‌ కోర్టుల(సవరణ) బిల్లు, మర్చంట్‌ షిప్పింగ్‌ బిల్లు, కోస్టల్‌ షిప్పింగ్‌ బిల్లు, ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు.

కాంగ్రె్‌సకు ‘అదానీ’ అస్త్రం...

అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చించాలని కాంగ్రెస్‌ సహా విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అదానీ లంచాలపై అమెరికాలో కేసు నమోదు చేయడం విపక్షాలకు అస్త్రంగా మారింది. అలాగే మణిపూర్‌ హింస, ప్రాణాంతకంగా మారిన వాయు కాలుష్యం తదితర అంశాలపై అధికార పార్టీని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అఖిలపక్ష సమావేశంలోనూ అదానీ వ్యవహారంపై చర్చ జరగాలని కోరినట్టు కాంగ్రెస్‌ నేత ప్రమోద్‌ తివారీ మీడియాకు తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికలపైనా పార్లమెంట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని శివేసన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు.

బీజేపీ మరింత దూకుడే...

దేశంలోనే మినీ ఇండియా పోరుగా పిలిచిన మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకోవడం పార్లమెంట్‌ సమావేశాల ముందు బీజేపీలో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఇటీవలే హర్యానా గెలుపు, ఇప్పుడు మహారాష్ట్ర విజయం బీజేపీకి తిరుగులేని ఉత్సాహాన్ని ఇచ్చాయి. దీంతో పార్లమెంట్‌ సమావేశాల్లో బీజేపీ మరింత దూకుడును ప్రదర్శించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ నేతృత్వంలో మరిన్ని కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. జమిలి ఎన్నికలపైనా ఉభయ సభల్లో చర్చ జరగనుందని సమాచారం. కాగా, వక్ఫ్‌ బిల్లుపై పార్లమెంట్‌ సంయుక్త కమిటీ ఈ నెల 29న తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది. కమిటీలోని విపక్ష సభ్యులు తమకు మరికొంత సమయం కావాలని అడిగే అవకాశం ఉంది.

Updated Date - Nov 25 , 2024 | 04:04 AM